వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   Struggling పురుషులు
WFTW Body: 

మత్తయి 6:13 లో ఈ విధంగా ప్రార్ధించమని ప్రభువైన యేసు నేర్పించారు, “మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి(కీడునుండి) తప్పించుము”. ప్రార్ధనలో పోరాడుటద్వారానే దేవుని నిజమైన పరిశుద్ధతను పొందగలము. సోమరులుగా ఉండి మరియు ఆత్మీయజీవితాన్ని చులకనగా తీసుకున్న క్రైస్తవులు ఈ పరిశుద్ధతను పొందుకొనలేరు. మన శరీరయిచ్ఛలను మరియు సాతానును పరిశుద్ధాత్మ శక్తితో పోరాడుటద్వారానే మనం పరిశుద్ధపరచబడగలం. అప్పుడు మనం ఈలాగు ప్రశ్నించవచ్చు, “మనం పరిశుద్ధత పొందుటకు సాతాను ఆటంకముగా ఉన్నట్లయితే, దేవుడు అతనిని ఎందుకు నాశనము చేయుటలేదు?. బంగారం అగ్నిలో పవిత్రపరచబడినట్లు, మనంకూడా దేవుని పరిశుద్ధతలో అంతకంతకు పాలుపొంది ఆత్మీయముగా వృద్ధినిపొందునట్లు ఒకవిధంగా సాతాను అవసరం. మన ఆత్మీయనరములు ఈ విధంగా పోరాడుటవలన బలం పొందుతాము. లేనట్లయితే మనం క్రొవ్వుతో ఉండి, వదులు(బలహీనులము)గా ఉంటాము.

ఆదాములో ఉన్న నిర్ధోషత్వము పరిశుద్ధతకాదు. ఆదాము పరిక్షించబడనట్లయితే తన జీవితాంతము నిర్దోషత్వము కలిగియుండేవాడు కాని పరిశుద్ధపరచబడలేడు. నిర్ధోషత్వమంటే మధ్యస్తంగా ఉండుట, దానినుండి పరిశుద్ధపరచబడాలంటే ఆదాము ఒక నిర్ణయం తీసుకోవలసియున్నది. అతడు శోధనకు “కాదు” అని చెప్పి, దేవునితో ఏకీభవించి ఆయనకు “అవును, ఆమేన్” అని చెప్పాలి. అప్పుడు అతడు పరిశుద్ధపరచబడతాడు. కాబట్టి అతడు శోధనలోగుండా వెళ్లాలి. దురదృష్టవసాత్తు ఆదాము జీవవృక్షమైయున్న దేవునికి “కాదు, వద్దు” అని చెప్పి పాపి అయ్యాడు.

ప్రభువైనయేసు కూడా మనవలె అన్నివిషయములలో శోధించబడ్డాడు (హెబ్రీ 4:15). కాని ఆదాముకు మరియు ప్రభువుకు ఉన్న తేడా ఏమిటంటే ఆయన ఎల్లప్పుడు దేవునికి “అవును, ఆమేన్” అని చెప్పాడు. దేవుడు కోరినట్లుగా పరిపూర్ణుడగుటకు ప్రభువైన యేసు ఆయన పొందిన శ్రమలద్వారా విధేయత నేర్చుకున్నారు. ఆయన శోధించబడి మరియు జయించారు కనుక “ఆయన సంపూర్ణసిద్ది”ని పొందియున్నారు (హెబ్రీ 5:8,9). అందుకనే ప్రభువైన యేసు శిష్యులకొరకీలాగు ప్రార్ధించారు, “నీవు లోకములోనుండి వారిని తీసుకొనిపొమ్మని నేను ప్రార్ధించుటలేదుగాని దుష్టునినుండి వారిని కాపాడమని ప్రార్ధించుచున్నాను” (యోహాను 17:15). ఈ లోకంలో తన శిష్యులు ఎదుర్కొనవలసిన వత్తిడులు, పరీక్షలు మరియు శోధనలు వారు ఎదుర్కొనకుండ తీసుకొనిపోబడితే వారు దేవుని పరిశుద్ధతలో పాలుపొందుట కష్టమని ప్రభువుకు తెలియును. శోధనకు మరియు పాపానికి ఉన్న తేడాను మనం వివేచించాలి. మనం అకసాత్ముగా దేనినైనా చూచి శోధించబడినట్లయితే, అది పాపముకాదు కాని మనం ఎల్లప్పుడు మనలను శోధించేదానినే కావాలని చూస్తూ లేక దానిగురించే ఎల్లప్పుడు ఆలోచిస్తూ ఉన్నట్లయితే మనం పాపం చేస్తాం. శోధించబడుటను తప్పించుకొనలేము. కాని మనలను శోధించేదానినుండి మన కళ్లను మరియు మన మనస్సును త్రిప్పివేసుకోవాలి. ఆవిధముగా మన చిత్తమును ఉపయోగించి మనం పరిశుద్ధపరచబడతాము లేక పాపములో ఉంటాము.

మనం శోధించబడినందుకు దేవుడు మనమీద నేరము మోపడు కాని ప్రార్ధించుట ద్వారా దానిమనం ఎదుర్కొనాలి. ఒకరు చెప్పినట్లుగా “నా తలమీదుగా పక్షులు ఎగురకుండా నేను ఆపలేను, కాని అవి నా తలమీద గూడు కట్టుకొనకుండా ఆపగలను”. శోధన రాకుండా మనం ఆపలేము(చెయ్యలేము) కాని అది మనస్సులో గూడు కట్టుకొనకుండా చెయ్యగలం. మనమెంత బలవంతులమో చూపించుకొనుటకు సాధ్యమైనంత ఎక్కువ శోధనలు ఎదుర్కొనమని దేవుని వాక్యము చెప్పుటలేదు. అలాకాదు. మన శోధననుండి పారిపోవాలి. తనను శోధించే విషయాలనుండి పారిపొమ్మని పౌలు తిమోతీకి చెప్పుచున్నాడు (2 తిమోతి 2:22). దేవునినుండి దూరముగా తీసుకెళ్ళే ధనాపేక్షనుండి, కులుకులాడే స్త్రీలనుండి మొదలగు వాటినుండి దూరముగా పారిపోవాలి.

శోధించబడు విషయంలో మన వైఖరి ఇలాగుండాలి, “సాధ్యమైనంత వరకు దానికి దూరముగా ఉండాలి”. చిన్న బిడ్డలవలె గోతిలో పడుటకు అంచు ఎంత దూరముగా ఉన్నదో అనిగాని లేక రైలుక్రింద పడకుండునట్లు రైల్వేస్టేషన్లో ఫ్లాట్ఫామ్ మీద అంచుకు ఎంత దగ్గరగా వెళ్ళవచ్చునో అనిగాని చూచినట్లుంటుంది. ఏ తల్లిదండ్రులైన నా బిడ్డలకు ఆవిధంగా సలహా ఇవ్వరు. అటువంటి అపాయములనుండి దూరముగా ఉండమని మన పిల్లలకు చెబుతాము. దేవుడు కూడా మనకు ఆ విషయాన్ని చెబుతున్నాడు. అనగా “తండ్రీ, నా శక్తికి మించిన శోధన నాకు అనుమతించవద్దు” అని ప్రార్ధించాలి. తన బలహీనతను ఎరిగి మరియు తానెంతసులభంగా పడిపోతాడో గుర్తించిన వ్యక్తి ఆవిధంగా మొఱ్ఱపెడతాడు.

“మమ్మును శోధనలోకి తేకుము” అని ప్రార్ధించిన తరువాత “మమ్మును దుష్టునినుండి కాపాడుము(తప్పించుము)” అని ప్రార్ధించమన్నారు. మమ్మును తప్పించుము అనగా “ఓ యేసుప్రభువా, నన్ను నీలోనికి ఆకర్షించుము” అని మనం శోధించబడినప్పుడెల్లను ప్రార్ధించాలి. దేవుడు మరియు దుష్టుడు మనలను రెండువైపులను ఆకర్షిస్తున్నారు. మనమీలాగున చెప్పుచున్నాము, “తండ్రీ నా శరీరంలో ఉన్న దురాశలు(కీడు) నన్ను లాగుచున్నది. కాని నీవు నన్ను ఆవిధంగా వెళ్ళనియ్యకుము. నేను దానికి లోబడాలని కోరుటలేదు. దయచేసి నన్ను నీవైపే నిరంతరం ఆకర్షించబడనిమ్ము. నిన్నే కోరుకొననిమ్ము”. పాపమునుండి మనం జయం పొందాలంటే దేవునిలోనే మన ఆకలిదప్పులు తీర్చబడునట్లు ఆయననే కోరుకొనుచు, ఆయన కొరకు ఆకలిదప్పులు కలిగియుండాలి.

రోమా 6:14 లో ఉన్న వాగ్ధానము “పాపము మీమీద ప్రభుత్వము చేయదు” అనేకమంది క్రైస్తవులలో నెరవేరలేదు ఎందుకంటే వారి హృదయంలో నిజంగా పాపంనుండి విడుదల పొందాలనే కోరిక వారిలో లేదు. ఓ పరలోకమందున్న మాతండ్రి, ఎటువంటి పరిస్థితులలోనైనను నన్ను పాపమునుండి రక్షించుము, విమోచించుము” అని వారు మొఱ్ఱపెట్టరు. వారిలో పాపమునుండి విడుదల పొందాలనే దాహములేదు. వారికేదైన తీవ్రమైన జబ్బువస్తే వారు మొఱ్ఱపెట్టేవారే. అయితే వారు పాపాన్ని రోగాన్ని తీసుకున్నంత తీవ్రంగా తీసుకోరు. వారు ఓడిపోతూనే ఉండుటలో ఆశ్చర్యం లేదు. “ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారు పెట్టిన మొర దేవునియొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను” (నిర్గమకాండము 2:23-25). మనం కూడా పాపమునుండి విడుదల పొందుటకు ఆవిధంగా మొఱ్ఱపెట్టినట్లయితే, దేవుడు మనలో కూడా పనిచేస్తాడు. “మీరు నన్ను వెదకినయెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు” అని యిర్మియా 29:13 లో దేవుడు చెప్పుచున్నాడు.

దేవునిలోనుండి మనం ఏదైన అమూల్యమైన దానిని పొందుకోవాలంటే లేఖనాలలో ఒక నియమము ఉన్నది, అదేమిటనగా మొదటిగా మనం దేవునిలోనుండి పొందుకొనుటకు ఆకలి దప్పులు కలిగియుండాలి. అప్పుడే మనం దానికి విలువ నిస్తాము. దేవుని కొరకు అటువంటి ఆకలి దప్పులు మనలో చూడాలని దేవుడు కనిపెట్టుచున్నాడు. అప్పుడు మనం కోరేదానిని తప్పకుండా దేవుడు మనకిస్తాడు.

క్రైస్తవజీవితము అనగా సాతానుతో పోరాడుట. ఈ పోరాటములో మనలో శరీరయిచ్ఛలనే(మాంసము) సాతానుదూత మనలోనే ఉన్నాడు. మన శరీరమే సాతాను పక్షముగా ఉన్నది కాబట్టి, మనం సాతానుతో పోరాడుటకు మనలోనే పెద్ద ఆటంకం ఉన్నది. దీనినెప్పుడు మరచిపోవద్దు. కాబట్టి దేవుని కృపద్వారా ఈ శరీరానుసారమైన దానినుండి పూర్తిగా విడుదలపొంది, సాతానును జయించుటకు మనలో గొప్ప ఆసక్తి, కోరిక ఉండాలి.

“ఓ దేవా, అపవాది మరియు ప్రజలు నాకు చేయాలనుకొనుచున్న కీడంతటినుండి నన్ను రక్షించుమని” అనేకమంది విశ్వాసులు ప్రార్ధిస్తున్నారు. కాని వారు వారి శరీరము(సాతానుదూత)ను పోషించుకుంటూ, దానికోర్కెలు నెరవేరుస్తూ జీవిస్తారు. అలాగయితే దేవుడు వారిని కీడునుండి రక్షించడు. శరీరయిచ్ఛలన్నింటినుండి విడుదల పొందుటకు అకలిదప్పులు కలిగియుందాము. అప్పుడు సాతానును సులభంగా జయించవచ్చును. అప్పుడు అపవాదినుండిగాని లేక మనుష్యులనుండి వచ్చే కీడు మనలను ముట్టదు.