సాతాను ‘సహోదరులపై నేరము మోపువాడని’ అతడు రాత్రింబవళ్ళు దేవుని యెదుట వారిపై నేరము మోపునని మనము ప్రకటన 12:10 లో చదివెదము. ఇది సాతాను చేయుచున్న ఒక పూర్తికాల పరిచర్యగా నున్నది. మరియు ఈ పరిచర్యలో, అతడు దురాత్మలలోను మనుష్యులలోను అనేకమంది జత పనివారిని కలిగియున్నాడు. విషాదకరమైన విషయమేమిటంటే ఈ నేరారోపణ పరిచర్యలో అనేకమంది విశ్వాసులు కూడా సాతానుతో జతపనివారిగా ఉన్నారు.
దేవుడు లోకమును రక్షించుటకే గాని దానికి తీర్పుతీర్చుటకు ఆయన కుమారుని పంపలేదు (యోహాను 3:17 ). ప్రభువు మనలను సంపూర్ణముగా రక్షింపగలుగుటకు కారణము ఆయన మనకొరకు విజ్ఞాపన చేయుటకొరకు నిరంతరము జీవించుటయే (హెబ్రీయులు 7:25 ). నేరారోపణతోను మరియు శిక్షావిధితోను కూడిన పరిచర్య సాతాను పరిచర్య మరియు మనకు దానిలో ఏ భాగము ఉండకూడదు. మరోప్రక్క మన ప్రభువు మనము సంపూర్ణరక్షణ పొందునట్లు విజ్ఞాపన చేసే పూర్తికాల పరిచర్యను కలిగియున్నాడు. మనము కూడా కలిగియుండవలసిన పరిచర్య ఇదియే.
దేవుడు మనలను ప్రభువైన యేసుకు వధువుగాను, ఈ పరిచర్య కొరకు సాటియైన సహాయముగాను ఆయనకు ఇచ్చెను. కాబట్టి ఈ విజ్ఞాపనచేయు పరిచర్యలో మనము మన ప్రభువుతో జతపనివారమై యుండవలెను. లోకమును ఖండించుటకు (తీర్పు తీర్చుటకు మరియు నేరారోపణ చేయుటకు) కాక దానిని రక్షించుటకు తండ్రి యేసును లోకములోనికి ఎలా పంపెనో అలాగే, ఆయన మనలను కూడా ఇతరులను ఖండించుటకు, తీర్పు తీర్చుటకు మరియు నేరారోపణ చేయుటకు కాక వారిని రక్షించుటకు లోకములోనికి పంపెను (యోహాను 20:21 ). కాబట్టి మనము మన జీవితాలనుండి "నేరారోపణచేయు ఆత్మను" (సాతానుయొక్కఆత్మతో) నింపినప్పుడు మాత్రమే మనము ఈ లోకములో ఈనాడు దేవుని పనిలో ఆయన చేతులలో సమర్ధవంతమైన సాధనాలుగా ఉండగలము.
విజ్ఞాపనచేయు పరిచర్యను మనలో ప్రతి ఒక్కరు తీవ్రముగా తీసుకోవలెను. సంఘములో సాతానుని జయించుటకు వేరే మార్గము లేదు. మనలను హింసించువారిని క్షమించుటయే కాక వారి కొరకు ప్రార్ధన కూడా చేయవలెనని మన ప్రభువు మనకు చెప్పారు (మత్తయి 5:44 ). మనము వారిని కేవలము క్షమించి వారి కొరకు ప్రార్ధన చేయనియెడల, నేరారోపణచేయుఅత్మ తిరిగి మన జీవితాలలోనికి ప్రవేశింపవచ్చును. ఒకరినిబట్టి ఒకరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుట మనము ప్రారంభించవలెను, ఎందుకనగా నిజమైన విజ్ఞాపన అంతయు ఇక్కడే మొదలగును. "ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు (ఒకరికొకరు) కృతజ్ఞులై యుండుడి (కొలొస్స 3:15 ).
పౌలుయొక్క పత్రికలలో అతనికి ఈ అలవాటు ఎలా ఉండెనో మనము చూచెదము: అతడు ఎల్లప్పుడు క్రైస్తవుల కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు తన పత్రికలను ప్రారంభించెను - రోములో, కొరింథులో, ఎఫెస్సీలో, ఫిలిప్పీలో, కొలస్సీలో, థెస్సలోనికయలో ఉన్నవారి కొరకు మరియు తిమోతి, ఫిలోమోను కొరకు కూడా కృతజ్ఞతలు తెలిపెను (రోమా 1:8 ; 1 కొరింథీ 1:4; ఎఫెసీ 1:15 ; ఫిలిప్పీ 1:3 ; కొలొస్సి 1:3 ; 1 థెస్సలోను 1:3 ; 2 తిమోతి 1:3 ; ఫిలోమోను 4 ). పౌలువంటి ఒక భక్తిపరుడు చాలా సుళువుగా చూడగలిగిన పొరపాట్లు ఆ క్రైస్తవులందరిలో ఉండెననుటకు సందేహములేదు. కాని వారిపై నేరారోపణ చేయుటకు అతడు నేరారోపణచేయువానితో (సాతానుతో) చేతులు కలుపుటకు నిరాకరించెను. దేవుడు అతడిని వారి మీద నేరారోపణ చేసి వారిని ఖండించుటకు కాక వారికి సహాయపడుటకు, వారిని రక్షించుటకు పంపెను. వారి మధ్య తీవ్రమైన సమస్యలున్న కొరింథీయులకు వ్రాసినప్పుడు కూడా, వారిలో సహితము అతడు చూడగలిగిన మంచి విషయాలనుబట్టి దేవునికి కృతజ్ఞత తెలుపుచు పౌలు ప్రారంబించాడు. అలా చెప్పిన తరువాతనే, అతడు వారిని సరిదిద్దెను. కొరింథులోనున్న క్రైస్తవులు పౌలు యొక్క దిద్దుబాటును వెంటనే అంగీకరించుటకు బహుశా ఇదే కారణము కావచ్చును (2 కోరింథి 7:8,9 ). ఇతరులు మన దిద్దుబాట్లను మరియు మన హెచ్చరికలను అంగీకరించకపోవుటకు కూడా బహుశా ఇదే కారణము కావచ్చును - అదేదనగా మనము వారిలో చూచిన మంచివిషయాలను ఎప్పుడైనను మెచ్చుకొనక పోవుటయే!
తల్లిదండ్రులైన మీరు దీనిని పరిగణించుడి: మీరు మీ పిల్లలలో చూచిన మంచిని మెచ్చుకొనుట కంటే లోపాలను పొరపాట్లను ఎత్తిచూపుటకు త్వరపడలేదా? మీ పిల్లలతో మీరు ప్రోత్సాహము మరియు ప్రశంసతో కూడిన మాటలను మాట్లాడితిరా? మీరెప్పుడైనను మోకరించి వారినిబట్టి దేవునికి కృతజ్ఞతలు తెలిపితిరా? మీరు మెచ్చుకోకుండా విమర్శించినయెడల, మీ పిల్లలు మెరుగైనవారిగా మారకపోవుటలో ఆశ్చర్యము లేదు!! మీరు మరొక ఎక్కువదైవికమైన పద్ధతిని ఎందుకు ప్రయత్నించకూడదు? మీ వైఖరిని మీరు మార్చుకున్నప్పుడు, మీ పిల్లలుకూడా మారుట మీరు కనుగొనెదరు. మీరు దీనిని ప్రయత్నించి పనిచేస్తుందో లేదో అని చూడండి.
విశ్వాసులమైన మనము మనలను ఈ విధముగా ప్రశ్నించుకోవచ్చు: మనము అనేక సంవత్సరములుగా నేరారోపణ చేయుచున్న ఇతర విశ్వాసులలో అసలు మంచి ఏమీలేదని సాతాను మనకు చెప్పినది నిజముగా సత్యమా? గతంలో మన హృదయాలలోను మన తలంపులలోను ఇతరులకు వ్యతిరేకముగా నేరారోపణ, ఫిర్యాదులు, కొండెములు చెప్పు ఆత్మకు చోటు లబించినట్లే మనము అంతే మోతాదులో, మరిఎక్కువగా, ఒకరికి ఒకరు కృతజ్ఞతలు చెప్పు, విజ్ఞాపనచేయు ఆత్మతో నింపబడునట్లు దేవుడు అనుగ్రహించును గాక. ఆ విధముగా అపవాదికి మన జీవితాలలో ఇకచోటు ఉండదు. నేరారోపణ చేయువాడైన సాతాను అతని ఆత్మలు జయింపబడి, విజ్ఞాపనచేయు ఆత్మద్వారా వెళ్లగొట్టబడును. మీరు ఇప్పుడు తీవ్రముగా ఉండి ఇక ఎప్పటికీ ఇతరుల మీద నేరారోపణచేయు ఈ అలవాటును విడిచిపెట్టి, దానిని విజ్ఞాపనచేయు ఆత్మతో భర్తీ చేయుదురా? అలా చేయుటకు ప్రభువు మనందరికీ సహాయపడును గాక.
"పరిశుద్ధునిగా ఉండగోరినవాడు తన్నుతాను పరిశుద్ధునిగా ఉంచుకోవలెను; కాని అపవిత్రునిగా ఉండగోరిన వానిని అపవిత్రముగానే ఉండనిమ్ము" (ప్రకటన 22:11 ).