వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము నాయకుడు
WFTW Body: 

ఒక సంఘము ఆత్మానుసారముగా అనగా దేవుని జీవములో ఎదుగనట్లయితే, కేవలము సంఖ్య మాత్రమే పెరిగినట్లయితే దేవుడు తృప్తిపడడు. ఒకవేళ కొరింథులో ఉన్నవారు శరీరానుసారముగా ఉన్నట్లయితే దేవునియెదుట దుఃఖపడవలసివచ్చుమో అని పౌలు చెప్పుచున్నాడు (II కొరింథీ 12 : 20, 21 చూడండి). కొరింథీయులు శరీరసంబంధులైనందుకు పౌలు ఎందుకు దుఃఖపడాలి? ఎందుకనగా పౌలు వారియొక్క ఆత్మీయతండ్రి. దేవునిఎదుట పిల్లల ఆత్మీయ స్థితికి తండ్రులుభాద్యులు. మన సంఘము శరీరానుసారముగా ఉన్నట్లయితే, నాయకులుగా మనయొక్క ఓటమిని దేవుడు చూపిస్తున్నాడు. సహోదర, సహోదరీలను నిందించుటకు బదులు, మనమే మనలను తగ్గించుకోవాలి. మన పిల్లలు లోకానుసారముగా ఉండుటను మనము చూచినట్లయితే, దాని ద్వారా తండ్రులుగా మన ఓటమిని దేవుడు చూపించుచున్నాడు. మన పిల్లలను నిందించుటకు బదులు, మనలను మనము తగ్గించుకోవాలి. మనము (సంఘపెద్దలు) జీతానికి పనిచేస్తే, మన సహోదర, సహోదరీలు ఓడిపోయినప్పుడు వారిని విమర్శస్తాము. కాని మనము దైవజనులమైతే, మనము దీనులమై ఈలాగు ప్రార్ధించుదము, "ప్రభువా! నేను ఓడిపోయాను నన్ను క్షమించుము".

తన ద్వారా క్రీస్తు యొద్దకు వచ్చిన అన్యజనులు, "పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరమగు అర్పణ అగునట్లు" పౌలు ఎంతో భారము కలిగియున్నాడు (రోమా 15 : 16 ). పాతనింబంధనలో, ప్రజలు తెచ్చిన అర్పణలో కళంకమేదైనను ఉన్నదేమో అని యాజకుడు పరీక్షించును (ద్వితీ. కాం. 17 : 1). అది యాజకుని భాద్యత. కళంకమున్న అర్పణను అతడు దేవునికి అర్పించకూడదు (అది దేవుని దృష్టిలో ఎంత తీవ్రమైన పాపమో మలాకీ 1, 2అధ్యాయలలో చదవండి). ఇప్పుడు క్రొత్తనిబంధనలో, సంఘములో పరిచర్య చేయుటకు ప్రభువు చేత పిలువబడినవారందరికి ఇటువంటి పని ఉన్నది. వారు దేవునిఎదుట ఉంచే ప్రతివ్యక్తి, దేవునికి ప్రీతికరముగా ఉండాలి. "ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన యెదుట నిలబెట్టవలెనని" (కొలస్సీ 1 : 28) పౌలు ప్రయాసపడియున్నాడు.

క్రీస్తు న్యాయపీఠము ఎదుట, సమస్తము బయలుపరచబడును. దేవునికొరకు మనము గొప్ప సేవ చేయుచున్నామని ఇప్పుడు అందరు అనుకొనినను, ఆ దినమున మన పరిచర్య పనికిరానిదిగాను లేక శరీరానుసారముగాను ఉండినయెడల ఏమి ప్రయోజనము? మనుష్యుల ఘనతతో తృప్తిపడేటంత బుద్ధిహీనుడుగా ఉన్నాడు సార్దీస్ సంఘపెద్ద. మనపిల్లల ద్వారా మనకు ఘనతను కోరుచున్నామా? వారి విషయములలో అన్నియు మంచిగా జరుగుచుండవచ్చును. దానిని బట్టి దేవునికి స్తోత్రము. కాని దానిని ఇతరులు చూచి, దానిని బట్టి ఇతరుల నుండి వచ్చే ఘనతను కోరుచున్నామా? మనము ఎంత గొప్ప తండ్రులమో ఇతరులు గుర్తించాలని కోరుచున్నామా? మన పిల్లలను మనము మనఘనత కొరకు పెంచుచున్నామా లేక దేవుని ఘనత కొరకా? మన పిల్లలు నిజమైన క్రైస్తవులుగా ఉండాలని నిశ్చయముగా వారిని పెంచుతాము. కాని దానిని దేవుడొక్కడే చూస్తే మనకు చాలునా? మరి దేవుడు చూచినట్లయితే, మనుష్యుల అంగీకారమెందుకు? మన పిల్లలు లోకానుసారులని ఇతరులు అనుకొనినను ఫరవాలేదు. చివరకు మనము దేవునికే లెక్క చెప్పాలి. మన గురించి మరియు మన సంఘము గురించి తక్కువ అభిప్రాయము కలిగియుండుట మంచిది.

మన పరిచర్యయొక్క ఫలాలు అందరికీ చూపించుకోవాలనే దురాశ మనలో ఉంటుంది. ఆ శరీరాశను పరిశుద్ధాత్మశక్తి చేత చంపనియెడల, సాతాను దానిని దుర్వినియోగపరచును. ఒకపెద్ద క్రీస్తుశరీరమనే సంఘమును గూర్చి, పరిశుద్ధతను గూర్చి, శిష్యత్వమును గూర్చి బోధించినను, తనకొరకు పేరుప్రతిష్టలు తెచ్చికోవాలని కొంచెము కోరిక ఉండినను సాతాను దానిని అవకాశముగా తీసుకొని అతనిని మోసపుచ్చును. అతడు ఒక బబులోను సంఘము మాత్రమే కట్టును.

మనము సొంత ఘనతను వెదికినయెడల క్రీస్తు శరీరమును కట్టలేము. పేరుప్రతిష్టలు కోరనివాడు మాత్రమే క్రొత్తనిబంధన సంఘమును కట్టును. అనేక సం||లు పరిచర్య చేసిన తరువాత హృదయపూర్వకముగా ప్రభువును వెంబడించేవారు ముగ్గురు మాత్రమే మీ సంఘములో ఉండినను ఆ రోజున నీవు సిగ్గుపడవు. ఒకరోజు దేవుడు నీతో "నమ్మకమైన మంచిదాసుడా, నీవు బాగుగా చేసియున్నావని" అనును.

ప్రభువు నామమునకు అవమానము తేచ్చే 3000 మంది రాజీపడేవారికంటే, క్రీస్తు కొరకు నిజమైన సాక్షులు ముగ్గురు మీ పట్టణములో ఉండిన మేలు. కాని మన సంఘములో సభ్యుల సంఖ్య పెరుగుటకు ఆత్మీయ స్థితిని తగ్గించుటకు శోధించబడుదుము. మనము దానిని పోరాడనట్లయితే, మనము కూడా సార్దీస్ పెద్దవలే చివరకు మారుదుము.

కాని ఈ మాటలను తప్పుగా అర్ధముచేసుకొని, తృప్తిపడేవారికి ఒక హెచ్చరిక. ఆయన మీ విషయములో అసంతృప్తితో ఉన్నాడుకాబట్టి దేవుడు మీయొద్దకు ఎవరినీ పంపక(చేర్చక)పోవచ్చును. "ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను" (అపొ. కా. 2 : 47 ). ఆ దినములలో అనేకులను ఆయన సంఘములో చేర్చెను (అపొ. కా. 6 : 7 ).

నీవు ఈవిధముగా ప్రార్ధించుట మంచిది: "ప్రభువా! మా సంఘములో అనేకమంది రాజీపడేవారిని చేర్చమని మేము అడుగుటలేదు. మా పట్టణములో దైవజనులుగా(దేవుని కలిగినవారిగా) జీవించాలనుకొనేవారి కొరకు ప్రార్ధించుచున్నాము. ఓ యేసుప్రభువా వీటిలో ఏదైనా ఒకటి చేయుము: (1) వారికి మేము సహాయపడునట్లు వారిని మాయొద్దకు పంపుము లేదా (2) మమ్ములను వారియొద్దకు పంపుము లేదా (3) అలా నీవు చేయకుండుటకు కారణమేమిటో మాకు తెలియజేయుము".

ఒకవేళ మీ సంఘము నులివెచ్చనిగానైనను, అక్షరానుసారముగానైనను లేక పరిసయతత్వముతోనైనను ఉన్నదని ప్రభువు చెప్పవచ్చును. నీవు ఆ పెద్దవలే ఉన్నావు కాబట్టి మీ సంఘము ఈలాగున్నదని ఆయన చెప్పవచ్చును. అప్పుడు నీవు చేయవలసిన ఒకేఒక పని ఏదనగా, పశ్చాత్తాపపడి మరియు మారుమనస్సు పొందుట.