వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   యౌవ్వనస్తులు
WFTW Body: 

హెబ్రీ 6:1-3లో పరిపూర్ణులమగుటకు సాగిపోవాలని పత్రిక వ్రాసినవాడు చెప్పుచున్నాడు. 5వ అధ్యాయంలో పాలు త్రాగుట గూర్చి మరియు బలమైనఆహారం తినుటనుగూర్చి వివరించాడు. ఇక్కడ మొదటిగా ప్రాథమికబోధ మరియు ఆత్మీయాభివృద్ధిని కలుగజేసే బోధ; పునాది మరియు దానిమీద కట్టడము. పక్వానికి వచ్చిన క్రైసవులు మరియు పసిబిడ్డలవంటి క్రైస్తవులు మధ్య ఉన్న తేడాను ఇవన్నియు వివరించుచున్నవి. శోధించబడిన సమయంలో ఈ తేడాను బాగుగా చూడవచ్చును. శోధన వచ్చినప్పుడు, పక్వానికి వచ్చిన పరిశుద్ధులు క్రీస్తువలె స్పందిస్తారు కాని పసిబిడ్డలవంటివారు మనుష్యరీతిగా స్పందిస్తారు.

అనేకమంది విశ్వాసులు దైవికంగా కాకుండా మానవపద్దతిలోనే స్పందిస్తారు. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఉదాహరణకు మీరు ఇతరులతో కూర్చున్నప్పుడు ఇతరులను ఇబ్బందిపెట్టే జోకు నీవేశావనుకో, నీవు వెంటనే ప్రభువైనయేసు అటువంటి జోకు వేశేవాడేనా అని ప్రశ్నించుకుంటావా? ఇటువంటి ప్రశ్నలు నీవేసుకొననట్లయితే నీ ప్రవర్తనమీద నీవు వెలుగును పొందలేవు మరియు నీవు ఆత్మీయపసిబిడ్డవలె ఉంటావు. ఆయా పరిస్థితులలో ప్రభువైనయేసు ఎలా స్పందిస్తున్నాడో అని ప్రతిరోజు అనేకసార్లు ప్రశ్నించుకొనుట మంచిది. అలాగున నీవు పరీక్షించుకొని, నీ మీద నీవు వెలుగు పొందనియెడల, ఆత్మీయంగా వృద్ధిపొందలేవు. అప్పుడు నీవు పునాదితోనే జీవిస్తావు గాని దానిమీద ఏమియు కట్టబడదు. నీవు ఎల్లప్పుడు కేవలం పాలు త్రాగుచూ ప్రాథమిక తరగతిలోనే ఉంటావు. కాని నీవు పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటూ, స్పందిస్తూ మరియు ఆత్మీయ పాఠాలు నేర్చుకోవటానికి ఆసక్తిగా ఉన్నట్లయితే త్వరగా పరిపక్వత చెందుతావు.

మరొక వివరణ: సంపూర్ణులమగుటకు సాగిపోవుటను పర్వతం (1000మీటర్లు ఎత్తు)ను ఎక్కుటతో పోల్చవచ్చును. మనం క్రొత్తగా జన్మించినప్పుడు ఈ పర్వతాన్ని ఎక్కుటను ఆరంభిస్తాం. ఎంత సమయం పట్టినా మనం నిరంతరం క్రీస్తుతో నింపుకొనుచూ, ఆయనను వెంబడిస్తూ పర్వతశిఖరాన్ని చేరుకొనుటయే మన గురి. "నేను క్రీస్తును వెంబడించినట్లు మీరు నన్ను వెంబడించుడని" ఇతర సహోదరసహోదరీలతో మనం చెప్పవచ్చును (1 కొరింథీ 11:1). మనం వందమీటర్లు మాత్రమే ఎక్కినను అలాగు చెప్పగలం.

పునాది అంటే ఏంటి? పాలు అంటే ఏంటి? ప్రాథమిక తరగతిలో ఏమి నేర్చుకుంటాము? మొదటిగా మారుమనస్సు, విశ్వాసము (హెబ్రీ 6:1). అనగా పాపములను మాత్రమేగా నిర్జీవక్రియలను కూడా యదార్ధముగా ఒప్పుకొనుట. పాతనిబంధనలో మంచిక్రియలు(సత్ర్కియలు) మరియు చెడ్డ క్రియలు ఉండేవి. కాని క్రొత్తనిబంధనలో సత్ర్కియలు, చెడ్డక్రియలు మరియు నిర్జీవక్రియలున్నవి. నిర్జీవక్రియలంటే చెడు ఉద్దేశ్యంతో చేసే మంచిపనులు. ఉదా: వాక్యాన్ని బోధించుట మంచిపని. కాని ఆపరిచర్యను ఘనతకొరకుగాని లేక డబ్బుకొరకుగాని చేసినట్లయితే అది నిర్జీవక్రియ అవుతుంది. మనం కానుకను సంతోషంగా ఇవ్వనట్లయితే అది నిర్జీవక్రియ అవుతుంది. ఇటువంటి అనేక ఉదాహరణలున్నవి. మనం చేసే పరిచర్య ఇతరులకు మేలు చేసినప్పటికీ, విశ్వాసం మరియు సంతోషం లేకుండా చేసినట్లయితే అది నిర్జీవక్రియ ఆవుతుంది. ఇటువంటి క్రియల విషయంలో మనం మారుమనస్సు పొందాలి. స్వార్ధంతో కూడిన వైఖరివిషయంలో మనం మారుమనస్సు పొందాలి.

పునాదిలో ఇంకను విశ్వాసము, నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుట, ఆత్మీయవరాలను పొందుట(హస్తనిక్షేపణ) క్రీస్తురాకడలో మృతుల పునరుత్ధానంకొరకు ఎదురుచూచుట మరియు తీర్పుకు సిద్ధపడుట (2 కొరింథీ 5:10). ఇవన్నియు ప్రాథమిక పాఠాలు. ఎవరైతే వీటితోనే తృప్తిపడతారో వారు ప్రాథమిక తరగతిలోనే ఉన్న క్రైస్తవులు. వారి ఇల్లు ఇంకను పునాది దగ్గరే ఉంది. మన జీవితంలోని ప్రతి విషయంలో (అనగా ఆత్మ, ప్రాణం, దేహం, హృదయం, మనస్సాక్షి, మనస్సు, ఉద్రేకాలు, చిత్తము) మనం అంతకంతకు యేసువలె రూపాంతరం పొందుచూ సంపూర్ణులం కావాలి.

హెబ్రీ పత్రిక వ్రాసిన రచయిత యొక్క భారమేంటనగా, క్రైస్తవులు పాలు త్రాగే స్థితి నుండి బలమైన ఆహారం తినే స్థాయికి ఎదగాలి. పునాది మీద కట్టబడాలి. ప్రాథమిక తరగతి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలి. భూలోకంలో ఏ ఒక్కరుకూడా పసిబిడ్డవలె ఉండాలని కోరరు. ప్రాథమిక తరగతులు చదివి మానివేయరు. భవనం లేకుండా కేవలం పునాదితోనే ఎవరును తృప్తిపడరు. కాని అనేకమంది విశ్వాసులు దానితోనే తృప్తిపడుచున్నారు. అయినప్పటికీ చాలామంది బోధకులు మరియు పాస్టర్లు పసిబిడ్డలవలె ఉన్నారు. దాని ఫలితంగా చాలా సంఘాలు ఆత్మీయ పసిబిడ్డలతో నిండియున్నాయి.

"సంపూర్ణులమగుటకు సాగిపోదామని" హెబ్రీ 6:1లో చెప్పబడింది. మనం ప్రాథమిక సిద్ధాంతాలతోనే పట్టబడినట్లయితే, మనబోధ ద్వారా పసిపిల్లలనే తయారుచేస్తాము. క్రొత్తనిబంధనలో ముఖ్యమైన బోధ కేవలం పాపక్షమాపణ గూర్చి కాదు అప్పుడు "అనేక పసిబిడ్డలను" తయారు చేద్దామని వాక్యములో ఉండేది. కాని మనం సంపూర్ణులమగుటకు సాగిపోవాలని హెచ్చరించబడ్డాము. బిడ్డలందరును ఎదిగి పెద్దవారు కావాలి.

సంఘములు పసిబిడ్డలతో నిండియున్నందున, సంఘాలలో పోట్లాటలు కోర్టు వివాదాలు, నాయకులు వ్యభిచారంలో పడిపోవుట, డబ్బుకొరకు ఆరాటపడుట మరియు ఒకరితో ఒకరు పోట్లాడుట మొదలైనవి జరుగుచున్నవి. పిల్లలెప్పుడు పోట్లాడతారు. మనం ఆత్మీయంగా ఎదిగినట్లయితే, మనం పోట్లాడము, సంఘంలో పదవి కొరకుగాని, ఘనతకొరకుగాని మన పోరాడుచున్నట్లయితే మనమింకను పిల్లలమే. దురదృష్టవశాత్తు క్రైస్తవ్యంలో అనేకమంది నాయకులు పిల్లలుగానే ఉన్నారు. పిల్లలతో సంఘం కట్టుట, గోడలు మరియు కప్పు లేకుండా కేవలం పునాదితో ఇల్లు కట్టినట్లుంటుంది.