వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   పునాది సత్యము
WFTW Body: 

మలాకీ 1:2 లో దేవుడు తన ప్రజలకు వ్యతిరేకముగా ఫిర్యాదు చేయుచున్నాడు. “నేను మీ యెడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు - ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివందురు? ”. మలాకీ ప్రవచనములో, దేవుడు తన ప్రజలతో ఏమి చెప్పినప్పటికినీ వారు ఆయనను ప్రశ్నించేవారుగా ఉన్నారని మనము చూడగలము.

ఇక్కడ వారు దేవుని ప్రేమను ప్రశ్నించారు. సైతాను మనలను పడద్రోసే మార్గాలలో ఇది ఒకటి. సైతాను హవ్వను శోధించినపుడు, మొదటగా దేవుని ప్రేమను అనుమానించే విత్తనము ఆమె మనస్సులో నాటెను. ఆ శోధన యొక్క భావమేమనగా “దేవుడు నిజముగా నిన్ను ప్రేమించుటలేదు. ప్రేమించినట్లయితే ఈ అందమైన పండు తినుటకు అనుమతించి ఉండెడివాడు? ” అదియే హవ్వ దేవుని ప్రేమను అనుమానించేటట్లు చేసినది. “బహుశా దేవుడు నన్ను ప్రేమించుట లేదు” అని ఆలోచింప మొదలు పెట్టినది తరువాత ఆమె పాపములో సులభముగా పడిపోయినది.

ప్రభువు పేతురు కొరకు ప్రార్ధించినపుడు “ సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని” (లూకా 22:31,32) అని చెప్పెను. పేతురు పాపములో లోతుగా పడినప్పటికినీ (ప్రభువును ఎరుగనని ముమ్మారు బొంకినప్పటికినీ), ఇంకను దేవుడు తనను ప్రేమించుచున్నాడని విశ్వసించునట్లు ప్రభువు ప్రార్ధించెను. అదియే విశ్వాసము - తప్పిపోయిన కుమారుడు కూడా ఇటువంటి విశ్వాసమునే కలిగియున్నాడు. అతడు తన జీవితమంతటినీ పాడుచేసుకొని మరియు అంతయు పోగొట్టుకొనిన తరువాత కూడా ఇంకను తండ్రి తనను ప్రేమిస్తున్నాడని నమ్మెను.

నీవు కూడా నీ జీవితాన్ని పాడుచేసుకున్నట్లయితే. అటువంటప్పుడు, నీ విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుడు ఇంకను నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తు పెట్టుకొనుము. ఈ లోకంలో సమస్తమును నీవు కోల్పోయినప్పటికినీ దేవుడు ఇంకను నిన్ను ప్రేమిస్తున్నాడు అనే మార్పు లేని సత్యమును విడిచిపెట్టవద్దు. ఇది జీవితములో గుర్తు పెట్టుకొనవలసిన అతి ప్రాముఖ్యమైన విషయము.

మలాకీ 1:2-5 లో దేవుడు తన సార్వభౌమాధికారము చొప్పున యాకోబును ఏర్పరచికొనిన విధానమును గూర్చి చెప్పెను. “మీ పూర్వీకుడు యాకోబును ప్రేమించుట ద్వారా నా ప్రేమను మీకు కనపరచితిని. ఏశావు యాకోబు సహోదరుడైనప్పటికినీ అతనిని విసర్జించితిని కాని మిమ్ములను ఏర్పరచుకొంటిని

దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని మనకు ఏ విధముగా తెలియును? మొదటగా, మన పాపముల కొరకు చనిపోవుటకు క్రీస్తును పంపెను. ప్రపంచములో అనేక కోట్ల మంది వుండగా, జీవ మార్గమును కనుగొను కొద్దిమందిలో మనముండునట్లు మనలను వేరు చేసెను. ఎందుకు మనలను ఏర్పరచుకొనెను? వేరే వారికంటే మనము నీతిమంతులము కాబట్టా? కాదు. మనకందరకు మారుమనస్సు పొందని స్నేహితులు మరియు బంధువులు ఉన్నారు - చెప్పాలంటే మనకంటే వారే మెరుగుగా ఉన్నారు. మనము పాపులమని గుర్తించాము కాబట్టి దేవుడు మనలను అంగీకరించెను. యేసు ప్రభువు పాపులను పిలుచుటకు వచ్చెను గాని నీతిమంతులను కాదు. మనము పాపులమై యుండగా దేవుడు మనలను పాపపు ఊబిలోనుండి లేవనెత్తెను.

ఇది దేవుడు మనలను ప్రేమిస్తున్నాడనటానికి ఎల్లప్పుడు గుర్తుంచుకొనవలసిన ఒక ఋజువుగా ఉన్నది. లోకములో అనేక కోట్లమందిలో నుండి దేవుడు నిన్ను ఏర్పాటు చేసికొని, జగత్తు పునాది వేయబడక మునుపే నీ పేరు జీవ గ్రంధములో వ్రాశియున్నాడని ఎన్నటికీ మరచిపోవద్దు. అది ఆయన యొక్క శ్రేష్టమైన సంకల్పము.

రోమా 9:11-13 లో " పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే (రిబ్కా) దేవుని యొద్ద నుండి సందేశము పొందెను. (ఆ సందేశము దేవుడు మన యొక్క మంచి, చెడ్డ పనులను బట్టి కాక ఆయన యొక్క ప్రణాళికను బట్టి మాత్రమే ఏర్పరచుకొనునని ఋజువు చేయుచున్నది. ‘పెద్దవాడు చిన్న వానికి దాసుడగునని’ ఆమెతో చెప్పబడెను దేవుని వాక్యములో ‘ నేను యాకోబును ప్రేమించితిని ఏశావును ద్వేషించితిని’ ” అని వ్రాయబడియున్నది. ఇక్కడ దేవుడు మనలను ఏర్పరచుకొనుటలో ఆయన సార్వభౌమాధికారమును చూడగలము. ఇది మన మంచి పనులను బట్టి కాదు. ఒకవేళ నీవు ముందు దేవుణ్ణి ఏర్పరచుకున్నావంటే అది నిజము కాదు. యోహాను 15:16 లో “మీరు నన్ను ఏర్పరచుకొనలేదు నేను మిమ్ములను ఏర్పరచుకున్నాను” అని యేసు ప్రభువు ఎంతో స్పష్టంగా చెప్పారు. మనము ఎన్నటికినీ దీనిని మర్చిపోకూడదు.