WFTW Body: 

నీకు సరిపోయే భాగస్వామియొద్దకు నిన్ను దేవుడు మాత్రమే నడిపించగలడు. నిజానికి ఆయన స్వరం వినినట్లయితే ఆవిధముగా చేయుటకు ఆయన ఎంతో ఆసక్తిగా ఉన్నాడు.

ఆయన బిడ్డలలోని ప్రతి ఒక్కరి యెడల దేవునికి సంకల్పము(ఏర్పాటు) ఉన్నదని బైబిలు చెప్పుచున్నది(ఎఫెసీ 2:10). ఇదే నిజమైతే, నీవు పెళ్ళి చేసుకోవాలో లేదో ఆయన ముందుగానే నిర్ణయించాడని విశ్వసించక తప్పదు. నీవు పెళ్ళి చేసుకోవాలని దేవుడు నిర్ణయించినట్లయితే, నీవు ఎవరిని పెళ్ళి చేసుకోవాలో కూడా ఆయన ఏర్పాటు చేసియుంటాడు. కాని తనకు విధేయత చూపాలని దేవుడు ఎవరినీ బలవంతము చేయడు. కాబట్టి ఒక వ్యక్తి దేవుడు ఏర్పాటును విసర్జించి లేక నిర్లక్ష్యం చేసి, దేవుని ఏర్పాటుకు వేరుగా పెళ్ళి చేసుకొనవచ్చును.

నీవు రక్షణ(నూతన జన్మ) పొందిన తరువాత నీ బాగస్వామిని ఎన్నుకొనుటయే ముఖ్యమైన నిర్ణయము. ఒకసారి నిర్ణయము తీసుకున్న తరువాత మరలా వెనుకకు తీసుకొనుటకు అవకాశము లేదు గనుక ఈ విషయములో నీవు పొరపాటు చేయకూడదు. ఒకవేళ ఉద్యోగరీత్యా ఏదైనా పొరపాట్లు చేస్తే తరువాత సవరించుకోవచ్చును. అలాగే వేరే నిర్ణయాలు కూడా మార్చుకోవచ్చును. కాని దేవుని చిత్తము కాని పెళ్ళి చేసుకొనినట్లయితే, సరిదిద్దుకోవటానికి వీలుపడదు. అప్పుడు నీవు వివాహ జీవితాన్ని శ్రేష్టమైనదిగా చేసుకొనుటకు మాత్రమే ప్రయత్నించవచ్చును. వివాహజీవితములో దేవుని చిత్తమును తెలుసుకొనకపోవుట విచారకరము.

తొందరపడి దేవుని చిత్తప్రకారం కాకుండా వారి యిష్టప్రకారము పెళ్ళి చేసుకున్న వాళ్ళు తీరుబడిగా ఇప్పుడు పశ్చాత్తాపపడుచున్నారు. నిశ్చయముగా ఈ విషయములో వారు యౌవ్వనస్థులకు హెచ్చరికగా ఉన్నారు.

దేవుని చిత్తానికి వ్యతిరేకముగా పెళ్ళి చేసుకోవటము కంటే చేసుకోకుండుట మంచిది. వివాహ విషయములో దేవుని చిత్తమును తప్పిపోయిన వారు, తరువాత పశ్చాత్తాపపడితే దేవుడు వారిని కనికరించి వారిని ఆశీర్వదించవచ్చేమో గాని దేవుని చిత్తములో ఉన్న వారికున్న సంపూర్ణ సంతోషము, సమాధానమును వారు అనుభవించలేకపోవచ్చును.

దేవుని మహిమార్ధమును మరియు మనము అతిశ్రేష్టమైన మేలు పొందునట్లును దేవుడు మనకొరకు ఏర్పాటు చేసిన వ్యక్తినే పెళ్ళి చేసుకోవటము తప్పనిసరి. దేవుడు ఆదాముకు భాగస్వామిని కలుగజేసినప్పుడు పదిమంది స్త్రీలను చేసి, నీకిష్టమైన స్త్రీని ఎన్నుకొనమని దేవుడు చెప్పలేదు. ఈ విషయములో ఆదామునకు ఎన్నుకొనుటకు లేదు. దేవుడు ఒకే స్త్రీని చేసి, ఆదామునకు ఇచ్చాడు. తనకు విధేయులైన పిల్లలందరికీ, ఒకే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేశారు. అటువంటి విషయాలు సిద్ధాంతాలుగా అర్ధము చేసుకోవటము కష్టమే. దేవుని సర్వాధికారమును, మానవుని స్వంత చిత్తమును ప్రక్కన పెట్టి చూస్తే అది అర్ధం చేసుకొనుట కష్టముగా ఉంటుంది. అయినా వాక్యము బోధించేది అదే. ఆయన చిత్తమును మనము అంగీకరిస్తే, ఆదాముకు హవ్వ ఏలాగో అలాగే అన్ని విషయములలో మనకు సరిపోయే వ్యక్తిని దేవుడు మనకొరకు సిద్ధపరచినట్లు కనుగొనగలము.

ఇస్సాకుకు వధువును వెదుకుటకు వెళ్ళిన అబ్రాహాము సేవకుడు ఈ సంగతిని గ్రహించాడు. కాబట్టి దేవా, మంచిగా ఉన్న అమ్మాయిలను కొంతమందిని నాకు చూపించు, వారిలోనుండి ఇస్సాకుకు సరిపోయే అమ్మాయిని ఎన్నుకుంటాను అని అతడు ప్రార్ధన చేయలేదు. కాని ప్రభువా, నీవు ఎవరినైతే ఇస్సాకుకు భార్యగా ముందుగానే నియమించినావో ఆమె యొద్దకు నన్ను నడిపించుము(ఆదికాండము 24:14-44) అని ప్రార్ధించాడు. అతని ప్రార్ధనకు దేవుడు జవాబిచ్చినప్పుడు, దేవుడు నన్ను నడిపించాడని అంటున్నాడు(ఆదికాండము 24:27). ఈమాట యేదో భక్తిని వ్యక్తపరస్తూ ఈరోజుల్లో కొంతమంది అనే మాట కాదు. ఇది నూటికి నూరుపాళ్ళు నిజమైన మాట. ప్రతి క్రైస్తవ దంపతులు దేవుడు మమ్ములను జతకలిపియున్నాడనే నిశ్చయత కలిగియుంటే ఎంత బాగుండును?

ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, మిత్రుల ద్వారానో లేక తల్లిదండ్రుల ద్వారానో దేవుడు నీకొరకు ఏర్పరిచిన వ్యక్తి దగ్గరకు ఆయన నిన్ను నడిపించవచ్చును. బైబిల్లో, ఇస్సాకు మరియు రిబ్కాల విషయములో మాత్రమే దేవుని స్పష్టమైన నడిపింపు కనిపిస్తుంది. అబ్రాహామునకు గాని లేక అతని సేవకునికిగాని రిబ్కాను గురించి ఏమియు తెలియదు. కాబట్టి ఇస్సాకు పెళ్ళి కేవలము తల్లిదండ్రుల ద్వారానే ఏర్పాటు చేయబడలేదు. పెళ్ళికాక ముందు ఇస్సాకు మరియు రిబ్కా ఒక్కసారి కూడా కలుసుకోలేదు గనుక అది వారు కూడా నిర్ణయించుకున్నది కాదు. అది దేవుడే నిర్ణయించాడు.

ఆయన బిడ్డలను ఆయనే ఏకము చేశాడనేది ముఖ్యము కాని ఏ పద్దతి ద్వారా దేవుడు ఈ వివాహాన్ని ఏర్పాటు చేశాడన్నది కాదు. ఆ వ్యక్తి దేవుని చేత ఏర్పాటుచేయబడిన వ్యక్తియేనా అనేది ముఖ్యము గాని ఆ వ్యక్తి యొద్దకు తల్లిదండ్రుల ద్వారానా లేక స్నేహితుల ద్వారానా లేక మనమే నడిపించబడ్డామా అనేది ముఖ్యము కాదు.