వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము శిష్యులు
WFTW Body: 

ఏదైన ఒక విషయాన్ని గురించి ఒక వాక్యమును తీసుకొని అదే విషయమును గూర్చిన ఇతర వాక్యములను విడిచి పెట్టుట విశ్వాసుల్లోని సాధారణమైన తప్పిదము.

సాతాను మన ప్రభువును....... "ఈలాగున వ్రాయబడియున్నది" (మత్తయి 4:6 ) అను మాటతో శోధించెను. కానీ మన ప్రభువు ........ "అని కూడా వ్రాయబడియున్నది" (మత్తయి 4:7 ) అను మాటలతో శోధనను త్రోసివేసెను. వాక్యమును వాక్యముతో పోల్చి చూచుకున్నప్పుడు - అనగా....... "అని కూడా వ్రాయబడియున్నది" తో కలిపి చదివినప్పుడు మాత్రమే దేవుని యొక్క సంపూర్ణ ఉద్దేశ్యమును అర్ధం చేసుకొనగలము. "శిష్యులకు అప్పగింపబడిన గొప్ప కార్యమనే " విషయాన్ని చూద్దాం.

యేసు తన శిష్యులతో సర్వలోకమునకు వెళ్ళి "సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి " (మార్కు 16:15 ) అని ఆజ్ఞాపించియున్నాడు. " మీరు వెళ్ళి అన్ని దేశములనుండి శిష్యులను చేయుడి" (మత్తయి 28:19 ) అని కూడా వారికి ఆజ్ఞాపించియున్నాడు. ఈ రెండు ఆజ్ఞలు, నెరవేర్చవలసిన ఒక గొప్ప కార్యము యొక్క రెండు భాగములైయున్నవి. దీనిని జాగ్రత్తగా చూపుట ద్వారా దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని తెలుసుకొని నెరవేర్చిన వారమగుదుము.

సువార్తీకరణ:

లోకములోనికి వెళ్ళి సువార్త ప్రతి ఒక్కరికి ప్రకటించుటమనేది మొదటి మెట్టని సృష్టమవుతుంది (మార్కు 16:15 ). ఈ ఆజ్ఞ ఏ ఒక్క విశ్వాసిని సంబోధించినది కాక, క్రీస్తు శరీరమైన సంఘమునకు ఇచ్చినది. సర్వ ప్రపంచములోని మనుష్యులందరికి సువార్తను ప్రకటించుట ఏ ఒక్క స్ధానిక సంఘమునకు గాని లేక ఏ ఒక్క మనిషి మాత్రమే చేయుట గాని మానవాతీతమైన పని. మనలో ఒక్కొక్కరికి ఈ మహాకార్యములోని ఒక చిన్న భాగము మాత్రమే చేయుట సాధ్యపడుతుంది.

కాని ఆ భాగము ఎంత చిన్నదైనా, మనము నెరవేర్చగలగాలి. ఇక్కడే అపొ. కార్యములు 1:8 లోని వాక్యమునకు సంబంధించి చూడగలము. క్రీస్తు కొరకు బలమైన సాక్షిగా ఉండాలంటే ప్రతి విశ్వాసిలోనికి పరిశుద్ధాత్ముడు దిగివచ్చి శక్తితో నింపబడియుండాలి. జాగ్రత్తగా గమనించినట్లయితే అందరు సువార్తికులుగా పిలువబడలేదు (క్రీస్తు తన సంఘమునకు కొందరినే సువార్తికులుగా ఇచ్చియుండెనని ఎఫెసీ 4:11 తేటగా చెప్తుంది), కాని అందరు తనకు సాక్షులుగా పిలువబడ్డారు.

సువార్తికుడు పనిచేయు పరిధి ఒక సాక్షిపరిధి కన్నా విస్తృతంగా ఉంటుంది. సాక్షి తాను పని చేయు స్ధలంలో, తన బంధువులకు, ఇరుగు పొరుగువారికి, తాను పనిచేయు కార్యాలయములోని తోటి కార్మికులకు, తనకు రోజూ తటస్థపడే వారికి, ప్రయాణాల్లో ఎవరితో కలిసేట్లు అతడు నడిపించబడినాడో వారికి క్రీస్తును గూర్చి ప్రకటించాల్సి ఉంటుంది. మనము ఈ లోకంలో ఏ వృత్తిలో నున్నా, పైన చెప్పబడిన విధంగా మనమందరము సాక్షులుగా ఉండవచ్చును.

దేవుని ఎరుగని వారిని చేరుటకు చేయాల్సిన విస్తృతమైన పరిచర్య కొఱకు యేసుక్రీస్తు సంఘమునకు సువార్తికులను కూడా ఇచ్చెను. అయితే సువార్తికుడి పని కేవలము ’ఆత్మలను సంపాదించుట లేక ప్రజలను క్రీస్తు యొద్దకు రాబట్టుట ’ (సాధారణముగా మనము వినుమాట) మాత్రమే కాక, క్రీస్తు సంఘమునుకట్టుట అయియున్నది (ఎఫెసీ 4:11,12 లో విశదీకరించిన విధంగా). ఈ నాటి సువార్త పరిచర్యలోని గొప్ప వైఫల్యము ఇక్కడే ఉంటున్నది. చాలా మంది ఈ రోజుల్లోని సువార్త పరిచర్య క్రీస్తు సంఘమును కట్టుటకు సంబధించి కాక ఆత్మలను రక్షించుటతోనే నిండియున్నది. ఈ ఆత్మలను తిరిగి వారు తప్పిపోవునట్లు వారి వారి మృతతుల్యమైన సంఘాలకు పంపబడుటయే అంతగా కాకపోతే ఒక రోజున ప్రభువు నోటి నుండి ఉమ్మి వేయుటకు మాత్రమే పనికివచ్చునట్లు నులివెచ్చని వారగుచున్నారు (ప్రక 3:16 ).

రెండు విధాలా, వీరు క్రీస్తు సంఘములోనికి కట్టబడుట లేదు. ఆవిధంగా సాతాను ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చబడుచున్నవి - ఆ మనిషి రెండింతలుగా నరకమునకు సంబంధించిన బిడ్డ అగుచున్నాడు (మత్తయి 23:15 ) - మొదట దేవుని ఎరుగనివానిగా ప్రారంభించాడు మరియు రెండవదిగా తాను ఇంకనూ తప్పిపోయి ఉంటూ, ఒక సువార్తికుని ద్వారా రక్షింపబడితినన్న భ్రమలో నుండెను!! ఈ విధమైన సువార్త పరిచర్య ద్వారా కట్టబడేది ఆ సువార్తికుడు డబ్బు సంపాదించాలన్న ఆశ లేక మనుషులమెప్పు పొందడమో లేక రెండూనో అయి ఉంటుంది!!

యేసు సువార్తికులను "మనుష్యులను పట్టే జాలరులని" పిలిచెను. రక్షణ పొందని ’క్రైస్తవ’ మతపెద్దలు లేక గుంపుల సహకారంతో లేక ఎన్నికల్లో ఓట్లనాశించే రాజకీయనాయకుల ప్రోత్సాహముతో చేయు సువార్త పరిచర్య, చిల్లులు పట్టిన వలతో చేపలు పట్టుటలాగుంటుంది. యేసు, తాను అన్నాను లేక కయిప లేక హేరోదు లేక పిలాతు లాంటి వారిని ఆహ్వానించి వేదికపై తనతో కూర్చొని సువార్త కూడికలను ప్రారంభించమనటం మనము ఊహించలేము! అయిననూ, ఇలాంటి సువార్తికులు ఈ విధంగా చేయుచూ మరియు ఆ మార్పు చెందని నాయకులను వేదిక మీద పోగడ్తలతో ముంచెత్తడం పరిపాటయింది.

ఇంకనూ ఆ వలలతో పట్టబడిన చేపలు సముద్రంలోనికి (మృతతుల్యమైన సంఘములు) తిరిగి వెళ్ళుటకు వదలబడుతూ, ఆ తదుపరి సువార్త కూడికల్లో మరొకసారి సముద్రంలోనికి వదిలిపెట్టబడటానికి పట్టబడుతూ ఉంటాయి!! ఈ రోజుల్లో, పెక్కు మంది సువార్తికులు వివిధ శాఖల సమ్మిళిత క్రైస్తవ కూడికలు నిర్వహించి అందులో ప్రతి సువార్తికుడు ఎత్తబడిన చేతులను పంచబడిన నిర్ణయపు కార్డులను లెక్కవేయుటలాంటి ప్రక్రియ అనేక మార్లు జరపబడుచు ఉన్నది. అట్టి సువార్త పరిచర్య పరలోకములోని దేవదూతలకు సంతోషమివ్వకపోవచ్చును కాని, సాతాను అనుచరులకు సంతోషమునిస్తుంది! ఎందుకంటే రెండింతలు నరక పాత్రులుగా చేయబడిన వారిని గూర్చి దేవదూతలు ఏవిధంగా సంతోషించగలరు? ఈ నాటి సువార్త కూడికల్లోని గణాంకములు పూర్తిగా మోసపూరితమైనవి.

యేసు పాపములను క్షమించి, రోగములను స్వస్థ పరచుననే విషయాన్ని ప్రకటించుటలో, సూచనలు మరియు అద్భుతములు తోడైననూ, ఆ సువార్త పరిచర్య ద్వారా ఎంతమంది శిష్యులుగా చేయబడి క్రీస్తు సంఘములోనికి కట్టబడితిరి అన్న ప్రశ్న ఇంకా మిగిలిపోతుంది.

మన ప్రభువునాటి అపొస్తలులు ఈవిధమైన సువార్త పరిచర్యను చేయలేదు. మార్పు చెందిన వారిని స్థానిక సంఘములలో ఉంచి వారిని శిష్యులుగా చేసి, వారు ఆత్మీయంగా బలపడులాగున చేసిరి.

ఎఫెసీ 4:11 లో వ్రాయబడిన అయిదు పరిచర్యలు (అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు మరియు బోధకులు ). వాటి ప్రాధాన్యత క్రమమును 1 కొరింథీ 12:28 లో పోందు పరచబడియున్నది. దేవుడు సంఘములో మొదట అపొస్తలులు, రెండవవారు వ్రవక్తలు, మూడవ వారు బోధకులు, తరువాత స్వస్థపరచు వరములు (సువార్తికులను సూచించును, ఎందుకనగా క్రొత్త నిబంధన కాలమందు సువార్తికులందరికి స్వస్థపరచు వరము ఉండినది కావున) మరియు ప్రభుత్వములు చేయువారిగాను (ఎవరైతే నావను నడుపుదురో అట్టి వారిని, అంటే కాపరులును, పాదిరులును) నియమించెనని మనకు చెప్పబడినది.

దేవుని దృష్టిలో అపొస్తలుల పరిచర్య ప్రవక్తల మరియు బోధకుల పరిచర్యలు క్రీస్తు సంఘమును కట్టుటకు ఒక సువార్తికుని పరిచర్య కన్నా ప్రాముఖ్యమైనవని ఇందునుబట్టి అర్ధమవుతుంది. ఒక సువార్తికుడు ఎప్పుడైతే అపొస్తలులు, ప్రవక్తల మరియు బోధకుల పరిచర్యలకు లోబడినట్టి స్థానమును ఎంచుకొంటాడో అప్పుడే తాను తన పరిచర్యలో తగిన స్థానములో నుండగలగుతాడు. అప్పుడే తన పరిచర్య ద్వారా క్రీస్తు సంఘమును కట్టుటకు సహయపడుతుంది. ఇచ్చటే నేటి 20 వ శతాబ్దపు సువార్త సేవ దేవుని వాక్యము నుండి వేరైపోతుంది.