మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్ధబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధికలోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు(2 పేతురు 2:1-3).
ఇక్కడ అబద్ధబోధకులను తెలుసుకొనుటకు రెండు మార్గాలున్నవి - లైంగికపాపము మరియు ధనాపేక్ష(2 పేతురు 2:2,3). ముఖ్యంగా ఒక బోధకుని సిద్ధాంతములను బట్టి ఒకడు అబద్ధప్రవక్తా లేక నిజమైన ప్రవక్తా అని చెప్పలేము. ఎందుకనగా సిద్ధాంతములన్నియు బాగుగా ఉన్న అబద్ధబోధకులు చాలామంది ఉన్నారు. ఒక బోధకుడువచ్చి గీత లేక ఖురాన్ గురించిచెప్పి, ప్రభువైనయేసు దేవుడుకాదని చెప్పిన యెడల, నిజమైన క్రైస్తవుడెవరు మోసపోరు. కాని ఎవరైనా బోధకుడు వచ్చి క్రైస్తవవిశ్వాసములో ఉన్న ముఖ్యసిద్ధాంతములన్నియు బోధించినట్లయితే, చాలామంది క్రైస్తవులు అతడు అబద్ధబోధకుడని తలంచరు. లైంగికపాపము మరియు ధనము గురించి అత్యాశ కలిగియుండుట అబద్ధబోధకునికి ఉండే రెండు ముఖ్యమైన గుర్తులని పేతురు చెప్పుచున్నాడు(2 పేతురు 2:2,3). వారి కళ్ళు వ్యభిచారముతో నిండియుండును. కాబట్టి సహోదరీలను హెచ్చరిస్తున్నాను, "ఏ బోధకుడైనను అపవిత్రమైన కళ్ళు కలిగి, నిన్ను వ్యభిచారపు చూపుతో చూచిన యెడల అతనికి దూరముగా ఉండుము". అతడు అబద్ధబోధకుడు మరియు సహోదర, సహోదరీలకు ఒక హెచ్చరిక, "తన పరిచర్యకు మీ డబ్బును ఇవ్వమని అడిగి, బైబిలులోని లేఖనాలను చూపించి మిమ్ములను బలవంతపెట్టినయెడల, అట్టి బోధకులకు దూరంగా ఉండండి". సువార్త ప్రకటించుట ద్వారా ధనవంతులైన వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. లైంగిక అపవిత్రత మరియు అధికలోభులై, మీవలన లాభము సంపాదికొనచూచుట అను రెండు ముఖ్యమైన లక్షణములు అబద్ధబోధకులు కలిగియుంటారు. బోధకులలో ఈ విషయాలను మీరు గమనించిన యెడల, మీరు అనేక అబద్ధప్రవక్తల నుండి కాపాడబడతారు.
దేవుడు ఏవిధంగా శిక్షిస్తాడో పేతురు చెప్పుచున్నాడు.
1. నోవహు కాలంలో పాపము చేసిన దూతలను
2. నోవహు కుటుంబము తప్ప మిగిలిన భక్తిహీనులందరినీ
3. సొదొమ, గోమొఱ్ఱా పట్టణాలను
4. అబద్ధప్రవక్తయైన బిలామును
అలాగే అబద్ధప్రవక్తలను శిక్షిస్తాడు (2 పేతురు 2:4-16).
"నీతిని ప్రకటించిన నోవహు" అని నోవహు పిలువబడ్డాడు(2 పేతురు 2:5). నోవహువంటి ఈ దినములలో అటువంటి బోధకులు దేవునికి అవసరమైయున్నారు. పేతురు వారి లక్షణాలను మరలా చెప్పుచున్నాడు - వ్యభిచారము మరియు ధనాపేక్ష(లోభత్వమందు సాధకము చేయబడినవారు)(2 పేతురు 2:14). బిలాము విషయములో దేవునిగురించి అతని కంటే గాడిద ఎక్కువగా ఎరిగియున్నది. అలాగే ఈనాటి అబద్ధబోధకులున్నారు. వీరు పశువులకంటే ఎక్కువగా చెడిపోయి ఉన్నారు.
ఒకప్పుడు వీరికి నీతిమార్గము తెలిసియుండవచ్చును. అయితే వారు ఆ మార్గమునుండి తొలగియున్నారు(2 పేతురు 2:21).కుక్కవలె వాంతికి తిరిగినట్లును, కడుగబడిన పందివలె బురదలో దొర్లుటకు మళ్ళినట్లు ఉంటుంది(2 పేతురు 2:22). ఆరంభములో యధార్ధముగా పరిచర్యను మొదలుపెట్టి, అబద్ధప్రవక్తలవలె మారినవారు ఈనాడు లోకములో అనేకులున్నారు. కాని వారు దేవుని స్వభావములో పాలివారు కాలేదు.
వారు దేవుని జీవములోను, స్వభావములోను అంతకంతకు ఎక్కువగా పాలుపొందుచూ, రూపాంతరము పొందకుండా వీరు కేవలము కడుగబడిన పందులవలె ఉన్నారు. దేవునిస్వభావమును అనుభవ పూర్వకముగా పాలుపొందకుండా, వీరు కుక్కలవలె ఉన్నారు. అనగా వారు కేవలము బాహ్యంగానే పవిత్రముగా ఉన్నారు. వారు వ్యక్తిగతముగా దేవునితో నడువలేదు. కాబట్టి కొంతకాలానికి వారు వాంతి చేసిన దానిని తిని వెనుకకు దిగజారియున్నారు.