వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

అపొ.కా 13వ అధ్యాయములో మొదటి సువార్త దండయాత్ర అంతియొకయ నుండి పంపబడింది. బర్నబా మరియు పౌలు, అంతియొకయనుండి ధనముతో యెరూషలేము వెళ్ళి అక్కడ పేతురు జైలు నుండి విడుదల పొందుటను చూచి సవాలు చేయబడ్డారు. యెరూషలేములో ఉన్న విశ్వాసులను ధనముతో ఆశీర్వాదించుటకు వారు అక్కడికి వెళ్ళి, ఆత్మీయ ఆశీర్వాదాన్ని పొందియున్నారు. ఆవిధంగా వారు ప్రార్ధన ఏమి చేయ్యగలదో చూశారు. "నీళ్ళుపోయువారికి నీళ్ళుపోయబడును"(సామెతలు 11:25) . వారు అంతియొకయకు తిరిగి వచ్చినప్పుడు ప్రార్ధన గురించి వారు నేర్చుకున్న దానిని అక్కడి పెద్దలకు చెప్పారు (అపొ.కా 13:1,2). మరియు వారు ఉపవాసము ఉండి దేవునిని ఆరాధించవలెనని నిర్ణయించారు. వారు ప్రార్ధన చెయ్యక దేవునిని ఆరాధించారు. ఉపవాసము ఉండి కేవలము ఆరాధించుట అద్భుతమైన విషయము. దేవుడు వారితో ఇట్లన్నాడు, "నేను బర్నబాను మరియు పౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరుచుము" (అపొ.కా 13:2). ఇక్కడ దేవుడు ఏవిధముగా మాట్లాడెనో చెప్పబడలేదు. వారి ఆత్మలలో దేవుడే చెప్పియున్నారు అని గొప్ప ఒప్పుదల వారు కలిగియుండవచ్చును.

పౌలు మరియు బర్నబాను దేవుడు ఇక్కడ పిలువలేదు. దేవుడు వారిని ముందుగానే పిలిచియున్నాడు. దేవుడు ఎవరినైనను పిలిచినప్పుడు వ్యక్తిగతముగానూ, రహస్యముగానూ పిలుచును. తరువాత అది సమాజంలో స్థిరపరచబడుతుంది. కాని ఎవరైనను ఇట్లు చెప్పినయెడల, "ప్రభువు ఇట్లనుచున్నాడు", "అక్కడికి వెళ్ళుము" లేక "ఈ వ్యక్తిని పెళ్ళి చేసుకొనుము" మొదలగునవి, అది దేవునియొద్ద నుండి వచ్చినది కాదు. అటువంటి మాటలను చెత్తకుండీలో వెయ్యాలి. నీవు దేనినైనా చెయ్యాలని దేవుడు కోరినయెడల ఆయన నీతో వ్యక్తిగతముగా మాట్లాడును. తరువాత పెద్దలద్వారా ఆయన దానిని దృఢపరచవచ్చును. అయితే అది ఇంతకు ముందుగానే దేవుడు నీతో చెప్పినదైయుండాలి. పౌలు మరియు బర్నబా ఇంతకుముందే ఆయన పిలుపును విన్నారు. ప్రార్ధనకూటములో వారు దానిని గురించి ఆలోచించుచుండగా పెద్దలు దేవుని స్వరాన్ని విన్నారు, "నేను బర్నబాను మరియు పౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకించుడి". పౌలు మరియు బర్నబాలు వారి పెద్దలు దేవునినుండి వినువరకు వేచియుండి, అప్పుడు వెళ్ళారు. వారు పెద్దలచేత పంపబడ్డారు. పాతనిబంధనలోని ప్రవక్తలు దేవుడు వారిని ఎక్కడికైనను వెళ్ళమని చెప్పినట్లయితే వారు అక్కడికి వెళ్ళేవారు. కాని క్రొత్తనిబంధనలో క్రీస్తుశరీరమనే సంఘమునుండి పంపబడాలి.

1964వ సంవత్సరము మే నెల 6వ తారీఖున దేవుడు నన్ను క్రైస్తవ పరిచర్యకు పిలిచియున్నాడు. అప్పుడు నేను నావికాదళంలో పనిచేస్తున్నాను మరియు సువార్తికుల బృందంతో కూటములు జరిగించుచున్నాము. నేను లేఖనములు చదువుచుండగా యెషయా 49వ అధ్యాయం ద్వారా దేవుడు నన్ను స్పష్టంగా పిలిచియున్నాడు. నా ప్రక్కన ఉన్నవారు దేవుడు నాతో మాట్లాడినది వినలేదు. దేవుడు వ్యక్తిగతముగా నన్ను పిలిచారు. ఒక గంట తరువాత దేవుని పిలుపు గురించి ధ్యానించి మరియు నావికాదళంలో ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయవలెనని తలంచుచుండగా మాతో ఉన్న ఒక దైవజనుడు(ఇండియాలో ఆయనను నేను ఎక్కువగా గౌరవించాను) నాయొద్దకు వచ్చి మరియు ఇట్లడిగాడు, "నీవు నావికాదళమును ఎప్పుడు విడిచిపెట్టుచున్నావు?" నన్ను ఆశ్చర్యపరిచిన ప్రవచనాత్మకమైన మాట అది. దేవుడు నాతో మాట్లాడిన దానిని బహిరంగముగా దృఢపరచారు. దేవుడు నిన్ను పిలిచినట్లయితే మొదటిగా వ్యక్తిగతముగా నిన్ను పిలుస్తారు. తరువాత వేరే దైవజనులద్వారా దానిని దృఢపరుస్తారు. కాని మొదటిగా ఆ పిలుపును నీవు వినాలి. ఈ విధానమును క్రొత్తనిబంధనలో చూస్తాము.

అపొ.కా 13:36లో, "దావీదు దేవుని సంకల్పం చొప్పున తమ తరమువారికి సేవచేసి నిద్రించెను" అని చదువుతాము. మనం కూడా దేవుని సంకల్పం చొప్పున మన తరమువారికి సేవచేయుటకు పిలువబడియున్నాము. కాబట్టి నీవు భూలోకమును విడిచి వెళ్ళకముందే దేవుని సంకల్పం అంతయు నేరవేర్చుటకు నిశ్చయపరుచుకొనుము. ఆ విధముగా చేయుటకు నీవు దావీదువలె ఉండాలి. అతని గురించి దేవుడు ఇట్లన్నాడు, "నేను దావీదును కనుగొంటిని అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చెను" (అపొ.కా 13:22) .