న్యాయాధిపతులు గ్రంధములో 3 నుండి 16 అధ్యాయములలో దేవునిచేత నియమించబడిన పదముగ్గురు న్యాయాధిపతుల గురించి చదివెదము. పదునాలుగవ న్యాయాధిపతియైన సమూయేలు గురించి మొదటిసమూయేలు గ్రంధములో చదివెదము. ఈ న్యాయాధిపతులలోని అనేకుల పేర్లు ఎక్కువగా ప్రసిద్ధి చెందలేదు.
కాలేబు తమ్ముడైన కనజుయొక్క కుమారుడగు ఒత్మీయేలు మొదటి న్యాయాధిపతి (న్యాయాధిపతులు 3:9). “యెహోవా ఆత్మ అతనిమీదికి దిగివచ్చెను గనుక అతడు ఇశ్రాయేలునకు న్యాయాధిపతి అయ్యెను” (న్యాయాధిపతులు 3:10) అని చెప్పబడినది. ఈ విధముగా న్యాయాధిపతుల గ్రంధములో అనేకసార్లు జరిగినది. దేవుని ప్రజలను నడిపించుటకు ఆయన ఆత్మ గిద్యోను మీదకును మరియు సమ్సోనుమీదకును వచ్చెను (న్యాయాధిపతులు 6:34; 14:6). ఆత్మాభిషేకము మాత్రమే వారు ఇశ్రాయేలును పరిపాలించే శక్తిని ఇచ్చెను. ఈనాడు కూడా దేవుని ప్రజలను అటువంటి అభిషేకము మాత్రమే మార్గము చూపించి నడిపించును.
మనము క్రొత్తగా జన్మించి యుండవచ్చును మరియు అది నిశ్చయముగా పరిశుద్ధాత్మ పనియైయున్నది. అయినప్పటికినీ పరిశుద్ధాత్మ మనమీదకును, మనలోనికిని వచ్చి(నింపబడి) మరియు మనము ప్రభువును సేవించునట్లు శక్తిని ఇవ్వవలసియున్నది. ఎదో ఒక కూటములో ఉద్రేకపూరితమైన అనుభవమును బట్టి తృప్తి పడవద్దు. అన్యభాషలలో మాట్లాడుటను బట్టి కూడా తృప్తి పడవద్దు. నీవు భాషలలో మాట్లాడినప్పటికినీ, పరిశుద్ధాత్మతో నింపబడి యుండకపోవచ్చును. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడువరకు తృప్తిపడవద్దు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడనియెడల ఎన్నటెన్నటికీ దేవుని పని చేయలేము. పరిశుద్ధాత్మ మూలముగా పుట్టి, 30 సం||లు పరిశుద్ధాత్మకు విధేయుడై మరియు పరిపూర్ణ జీవితము జీవించిన ప్రభువైన యేసు కూడా తండ్రిని సేవించుటకు ముందు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందవలసి వచ్చెను. ఆయన యొర్దాను నదిలో ప్రార్ధించినపుడు, దేవుని ఆత్మ ఆయన మీదకు దిగివచ్చియున్నది. ఎంత తెలివితేటలున్నా లేక ఎన్ని స్వాభావికమైన వరములున్నా, ఈ అభిషేకము క్రింద జీవించాలి. ఈ అభిషేకమును ఒక సమయములో కలిగియుండి మరొక సమయములో పోగొట్టుకొన వచ్చుననుటకు సమ్సోను ఒక ఉదాహరణగా మరియు హెచ్చరికగా ఉన్నాడు.
ఒత్నీయేలు ఇశ్రాయేలును పరిపాలించినంతకాలము సమాధానము ఉండెను (న్యాయాధిపతులు 3:11). తరువాత ఒత్నీయేలు చనిపోయాడు. ఇశ్రాయేలు కుమారులు మరలా దేవుని దృష్టిలో కీడు చేసారు. మరియు వారు కీడు చేసినప్పుడు వారు 18 సం||లు మోయాబు రాజునకు దాసులగునట్లు దేవుడు అనుమతించెను (న్యాయాధిపతులు 3:14).
న్యాయాధిపతుల గ్రంధములో - వారు ఏడుసార్లు వెనక్కు వెళ్లడము తరువాత దేవుడు శిక్షించుట మరలా వారిని విడిపించుటకు దేవుడు న్యాయాధిపతులను నియమించడము జరిగినది. చాలామంది విశ్వాసులు ఈవిధముగా జీవిస్తారు - ఆత్మీయముగా వెనక్కు వెళ్లడము, పశ్చాత్తాపపడుట, విడుదల పొందుట మరియు మరలా వెనక్కు వెళ్లుట, పశ్చాత్తాపపడుట, విడుదలపొందుట మరలా మరలా జరుగుతూ ఉంటుంది. ఆవిధముగా వారు ఒక వృత్తముమీద చూట్టూ తిరుగుతూనే ఉంటారు. వారు కూటానికి వెళ్ళెదరు, ఉజ్జీవింపబడెదరు మరియు సమర్పించుకొనెదరు. ఆ ఉజ్జీవ కూటము ముగియగానే మరలా వెనక్కు వెళ్లటము ఆరంభిస్తారు. మరలా ఒకరోజు ఒక అభిషేకము కలిగిన సేవకుడు వచ్చి కూటములు జరిగిస్తాడు. మరలా ఉజ్జీవింపబడతాడు.
ఈ విధముగా వృత్తముమీద నిరంతరము తిరుగుట దేవుని చిత్తమా? నిశ్చయముగా కాదు. ఈనాడు పరిశుద్ధాత్మ మనలోను మరియు మనతోను నిత్యము ఉంటాడు. ఆ దినాలలో ఒక నాయకునిమీదకు మాత్రమే పరిశుద్ధాత్మ దిగివచ్చేవాడు మరియు అందరు ఆ నాయకునిమీద ఆధారపడెడివారు. కాని ఈనాడు మనమందరము పరిశుద్ధాత్మతో నింపబడవచ్చును మరియు ఏ మనుష్యునిమీద ఆధారపడనవసరము లేదు. నిత్యము మన హృదయములు దేవుని అగ్నితో మండుచుండవచ్చును.
18 సం||లు మోయాబును సేవించిన తరువాత ఇశ్రాయేలీయులు దేవునికి మొఱ్ఱపెట్టిరి (న్యాయాధిపతులు 3:15). మరియు దేవుడు ఏహూదు అను మరొక న్యాయాధిపతిని లేపెను. అతడు రెండవ న్యాయాధిపతి. దాసత్వమునుండి విడుదల పొందునట్లు మొఱ్ఱపెట్టుటకు వారు 18 సం||లు ఎందుకు వేచియున్నారో నాకు ఆశ్చర్యముగా ఉన్నది. వారు దాసత్వమునకు వెళ్లిన తరువాత ఒక నెలలోనే ఎందుకు మొఱ్ఱపెట్టలేదు? ఒక వ్యక్తి పాపమునుండి విడుదల పొందుట కొరకు కనిపెట్టేముందు, ఎందుకు 18 సం||లు (కొందరిలో 40 సం||లు) ఓటమిలో జీవించుచున్నాడు? నాకు తెలియదు కాని అది అంతటా జరుగుచున్నది.
ఏహూదు మోయాబును జయించాడు మరియు 80 సం||లు దేశములో సమాధానము ఉన్నది (న్యాయాధిపతులు 3:30). కాని తరువాత మరలా వారు వెనక్కు వెళ్లారు. దేవుడు షమ్గరును న్యాయాధిపతిగా చేసెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోల కఱ్ఱతో హతము చేసెను. తరువాత సమ్సోను చేసినట్టు అది నిత్యముగా పరిశుద్ధాత్మ అభిషేకముతోనే అతడు చేసాడు.
అప్పుడు ఇశ్రాయేలు కుమారులు మరలా దేవుని దృష్టిలో కీడు చేసారు. గనుక దేవుడు వారిని కనాను రాజైన యాబీను చేతికి అప్పగించెను. ఇశ్రాయేలుచేత నిర్మూలము చేయబడవలసిన కనానీయులు ఇప్పుడు రాజును కలిగి, ఇశ్రాయేలీయులను పరిపాలించుచున్నారు! విశ్వాసులు పాపమును జయించాలి. కాని చాలామంది విశ్వాసులలో పాపమే పరిపాలన చేయుచున్నది. యాబీనుకు 900 ఇనుప రధములు ఉండెను మరియు అతడు 20 సం||లు ఇశ్రాయేలీయులను కఠినముగా బాధపెట్టెను. అప్పుడు వారు దేవునికి మొఱ్ఱపెట్టిరి. దేవుడు దెబోరాను న్యాయాధిపతిగా చేసెను (న్యాయాధిపతులు 4:3,4).