వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   ఆత్మతో నింపబడిన జీవితం
WFTW Body: 

లోకమునుండి వేరుగుట క్రొత్తనిబంధన యొక్క ఒక ముఖ్య విషయము. సిలువలో మరణించుటకు ముందుగా ప్రభువైనయేసు, మీరు లోకసంబంధులు కాదని శిష్యులతో చెప్పారు. ప్రభువైనయేసు కూడా "లోకసంబంధికాదు". మీరు నిజముగా పరలోకసంబంధులని శిష్యులతో ప్రభువైనయేసు చెప్పారు. శిష్యులు ఈ లోకమునకు చెందినవారుకాదు కాబట్టి వారు ఈ లోకములో జీవించుట ఎంతో కష్టమని ప్రభువు చెప్పారు(యోహాను 15:19; 17:16).

ఈ లోకమాలిన్యము తనకంటకుండునట్లు జాగ్రత్తపడుట శిష్యునియొక్క బాధ్యతయైయున్నది(యాకోబు 1:27). ఎందుకనగా సంఘము క్రీస్తుయొక్క వధువు కాబట్టి ఆయనచేత ప్రేమించబడి, సంపాదించబడి మరియు పరిశుద్ధపరచబడియున్నది(ఎఫెసీ 5:25-27). కొరింథీ విశ్వాసులయెడల పౌలుకున్న దేవాసక్తి దీనిని వివరించుచున్నది. ఆసక్తితో అతడిట్లన్నాడు, పవిత్రురాలైన కన్యకనుగా క్రీస్తుకు సమర్పించవలెనియు మరియు సర్పము యొక్క కుయుక్తిచేత మోసపోవుదురేమోననియు భయపడుచున్నాను(2 కొరింథీ 11:2,3).

లోకముతో స్నేహము చేసే విశ్వాసులను యాకోబు "వ్యభిచారిణులారా" అని పిలుస్తున్నాడు(యాకోబు 4:4). లోకమునుండి వేరుగుట(ప్రత్యేకించబడుట) గురించి బైబిలులో ఎక్కువగా చెప్పబడింది.

అయితే భౌతికముగా దూరమగుట గురించి బైబిలులో చెప్పబడలేదని మనము స్పష్టముగా తెలుసుకొనవలసియున్నది. అనగా లోకస్థులనుండి బాహ్యముగా దూరముగా ఉండుట కాదుకాని హృదయములో దూరముగా ఉండుటయైయున్నది. సన్యాసులవలే మనుష్యులకు దూరముగా వెళ్ళి ఏకాంతముగా ఉండుటవలన దేవునికి దగ్గరకావచ్చని కొందరు తలంచియున్నారు. సన్యాసినులుగా ఏకాంతముగా ఆశ్రయములోగాని లేక మఠములోగాని ఉండువారు, బైబిలులో బోధించిన లోకమునుండి వేరుగుట గూర్చిన బోధను అర్ధము చేసుకొనలేదు. ప్రత్యేకమైన తెల్లనివస్త్రధారణగాని లేక కాషాయవస్త్రములు వేసుకొనుటగాని వేరుగుటకాదు. ప్రభువైనయేసు ఆవిధముగా జీవించలేదు మరియు బోధించలేదు. లోకస్థులమధ్యలో జీవిస్తూనే ఆయన లోకపుఆత్మనుండి వేరై జీవించి మరియు దానిని బోధించారు.

మనము ఈ లోకములో పరదేశులముగా ఉన్నాము. ఓడ సముద్రములో ఉన్నప్పటికీ నీరు కొంచెము కూడా దానిలో ప్రవేశించదు. ఒక విశ్వాసి ఆవిధముగా జీవించినప్పుడు ఏదొక సమయములో వ్యతిరేకత వస్తుంది. వెంటనే ఈ లోకములో అతనికి ఎంతో అసౌకర్యముగా ఉంటుంది. ఆయనను వెంబడించుటవలన తప్పకుండా ఈ విధముగా జరుగుతుందని ప్రభువైనయేసు తన శిష్యులను హెచ్చరించారు(యోహాను 16:33). ఒక క్రైస్తవుడు పరలోకమునకు చెందినవాడైతే, అప్పుడు భూమి అతనికి పరదేశముగా ఉంటుంది. అతడు నీటి ఒడ్డున ఉన్న చేపవలె ఉంటాడు. అతడు ఇక్కడ జీవించుటకు కష్టముగా ఉండుటలో ఆశ్చర్యములేదు. భూమిమీద చేప జీవించాలంటే అద్భుతమవసరమైయుంటుంది. అలాగే క్రీస్తుసంఘము భూమిమీద కొనసాగుటకు అద్భుతము అవసరమైయుంటుంది. అత్యద్భుతమైన దేవుని సర్వశక్తిమీద ఆధారపడి క్రైస్తవుడు జీవించాలని దేవుడు కోరుచున్నాడు.

తన ప్రజలకు మరియు లౌకిక‍ఆత్మకు మధ్యన పెద్ద అగాధము ఉండాలని అనగా నరకానికి మరియు పరదైసుకు ఉన్నంతదూరము ఉండాలని దేవుడు కోరుచున్నాడు(లూకా 16:26). అవి ఎన్నటికీ కలువవు. తన ప్రజలు లౌకిక‍ఆత్మనుండి స్వతంత్రులగుటయే ఎల్లప్పుడు దేవుని చిత్తము. దురదృష్టవశాత్తు అనేకమంది విశ్వాసులు ఈ పాఠము నేర్చుకొనవలసియున్నది. ఈ పాఠము నేర్చుకొనువరకు అతడు బలహీనుడైయుండి, నిరాశపడతాడు.