మనము కొన్ని గృహములలోనికి వెళ్లినప్పుడు అక్కడ మనకు సౌకర్యముగా ఉన్నట్లు అనిపించదు. అయితే మరికొన్ని గృహములలోనికి వెళ్లినప్పుడు, మనము అందులో ప్రవేశించినప్పటినుండి, అది మనకు స్వంతమైనట్లు సౌకర్యముగా అనిపించును. ఈ అనుభవాన్ని వివరించుట కష్టము, కాని మనకందరకు అది తెలియును. ఒక క్రైస్తవ కుటుంబము యేసుప్రభువు స్వంతమైనట్లు సౌకర్యముగా నుండునట్లు అనుకొనేదిగా ఉండవలెను. దాని అర్ధము ఆయన అక్కడ చూచే ప్రతి విషయమును గూర్చి సంతోషించగలిగేటట్లు ఉండవలెను. ఆయన నీవు చదివే పుస్తకముల విషయములో, నీవు తెప్పించుకొనే పత్రికల విషయములో, భార్య భర్తల మధ్య సంభాషణలు, నీవు మాట్లాడే విషయములు, నీవు టి.వి. లో చూచే ప్రతిదాని విషయములో సంతోషించ గలిగి యుండవలెను. అనేక క్రైస్తవ గృహములలో, బైబిలు వాక్యములు వారి గోడలపై వ్రేలాడదీసి యుండును. కాని యేసుప్రభువు అక్కడ సౌకర్యముగా స్వంతమైనట్లుగా ఉండలేరు.
దేవుడు ఆదాము హవ్వలను ఎటువంటి గొప్ప ఉద్దేశ్యముతో ఒక దగ్గరకు చేర్చాడో నీకు తెలుసా? ఒక తండ్రిగా వారియెడల ఎటువంటి అద్భుతమైన ప్రణాళికలు ఉండెను. నేనొక తండ్రిని మరియు నా కుమారుడు వివాహము చేసి కొనుచుండగా ఈనాడు నేను ఎటువంటి ఉద్దేశ్యము కలిగియున్నానో నాకు తెలియును. కాని దేవుడు ఆదాము హవ్వలను కలిసియుండునట్లు ఒక దగ్గరకు తీసుకువచ్చినప్పుడు దేవుడు అనుకొనిన దానికి నేను అనుకొనేది ఒక చిన్న భాగము మాత్రమే. ఆయనకు ఎల్లప్పుడు మొదటి స్థానము కలిగియుండే ఒక చక్కని గృహమును వారు కలిగియుందురని ఆయన ఆశించారు. కాని ఎంత త్వరలో దేవుడు నిరుత్సాహము చెందెను. ఆయన వారి యెడల కోపించలేదు కాని, విచారించారు. ఈనాడు సమాధానములేని, కేవలము గొడవలు, తగవులతో నుండిన అనేక క్రైస్తవ కుటుంబములను చూచి దేవుని హృదయము ఇంకా ఎక్కువ విచారముతో నిండి యుండునని నేను నమ్ముచున్నాను. వారు ఇబ్బందులలో నుండినప్పుడు మాత్రమే వారు ఆయన వైపు తిరుగుదురు. ఈలోకపు జనులు వారు ఏదైనా సమస్యలను ఎదుర్కొనినప్పుడు మాత్రమే దేవుని వైపు తిరుగుదురు. కాని క్రైస్తవులుగా మనము వ్యత్యాసముగా నుండవలెను. దేవుడు మనమేదైనా క్లిష్టపరిస్థితిలో నుండి నప్పుడు ఫోన్ చేసే అత్యవసర సమయపు టెలిఫోన్ నంబరు కాదు. అలా కాదు. దేవుడు అన్ని వేళలా మన జీవితములలో కేంద్రముగా నుండవలసినవాడు.
మనమేదైనా యంత్ర సామగ్రి కొనినప్పుడు మనకు యివ్వబడే “తయారీ దారుని సూచనలు” కలిగియుండే పుస్తకము వంటిది దేవుని వాక్యము. మనందరము ఏదైనా విధ్యుత్తుతో పనిచేసే వస్తువును కొనినప్పుడు ఆ సూచనలు పుస్తకములో నుండిన సూచనలను ఉన్నదున్నట్లు పాటించుటకు జాగ్రత్త కలిగియుందుము. నీవు కొనిన వస్తువుకు ఏదైనా సమస్య వచ్చి నీవు తయారీదారుని యొద్దకు తీసుకువెళ్లినట్లయితే, అతడు నిన్ను అడిగే మొదటి ప్రశ్న “తయారీదారుని సూచనల పుస్తకములో ఉన్నదాని ప్రకారము ఖచ్చితముగా చేసారా?” అని అడుగును. వాస్తవానికి, చాలా గ్యారంటీ కార్డులపై, సూచనలను సరిగా పాటించక పోయినట్లయితే గ్యారంటీ చెల్లుబాటు అవ్వదని స్పష్టముగా వ్రాయబడియుండును.
దేవుని విషయములో నుండిన అధ్బుత విషయమేమంటే, మనయొక్క చిక్కు పడిపోయిన జీవితముతో ఆయన యొద్దకు ఎప్పుడువెళ్లినా, ఆయన అప్పటికిని దానిని బాగు చేయుటకు యిష్టపడును. ఆయన ఒక సంవత్సరపు గ్యారంటీ కాదు! అది జీవితకాలమంతా ఉండేది! నీ యొక్క విరిగిన జీవితముతో ఆయన యొద్దకు నీవు వచ్చినట్లయితే, దానిని ఆయన సరి చేయును. అది దేవుని విషయములో అధ్బుతమైన విషయము - ఆయన ప్రేమ గలిగిన తండ్రి. నీయింటిని అయన కొరకు ఒక పరిశుద్ధ స్థలముగా తయారు చేయుమని నిన్ను ఆడుగునది ఒక ప్రేమ కలిగిన తండ్రి అని నీవు తెలిసికొనుట ఎంతో ప్రాముఖ్యమైయున్నది. ఆయన మన జీవితాలయెడల మొదటి దినము నుండి కూడా ఎంతో ఆసక్తి కలిగి యుండెను మరియు యేసుప్రభువు తిరిగి వచ్చు దినము వరకు మనము సంతోషముగా ఉండవలెనని ఆయన కోరుచుండెను.
నేను సంతోషము యొక్క చిన్న భాగమును నా యొక్క వివాహ జీవితములో నా భార్యతో కలసి ఎన్నో దశాబ్ధములు రుచి చూచితిని. ఎక్కడైతే యేసు నీ జీవితమునకు కేంద్రముగా ఉండునో, ఎక్కడైతే నీ యింటిలో ప్రతిది యేసుకు సంతోషము కలిగిస్తుందా లేదా అనే దానిపై నిర్ణయింపబడుతుందో - నీవు డబ్బు ఖర్చు చేసే విధము, నీ సమయమును వెచ్చించే విధము మరియు నీవు ప్రతిదానిని చేసే పద్ధతి అది నిన్ను ఎంతో అద్భుతముగా జీవింప చేసేదిగా ఉంటుందని నేను చెప్పగలను. నీవు అట్లు జీవించినట్లయితే, అప్పుడు నీవు నీ జీవితము చివరకు వచ్చినప్పుడు, లేక దానికి ముందు క్రీస్తు తిరిగి వచ్చినట్లయితే, నీవు ఆయన ముందు నిలువబడుదువు, ఆయన భళా, మంచిదాసుడా! అనును. అప్పుడు ఇతరులు నీ గూర్చి ఏమనుకొన్నారు అనేది లెక్కలోకి రాదు.
మానవుని యొక్క ఒక లక్షణము బయటకు కనబడు దానిని బట్టి తీర్పు తీర్చుటయై యున్నది. నా మట్టుకు నేను, ఒక అక్షరానుసారమైన వాక్యము ప్రకారము జీవించిన వాడిగా ఉన్నంత కాలము అట్లు చేసితిని. కాని దేవుడు చూచేది హృదయమునని ఇప్పుడు ఎంతో స్పష్టముగా చూచుచున్నాను. మీ హృదయములు ఎల్లప్పుడు పవిత్రముగా ఉండవలెనని మీరు జ్ఞాపకముంచుకొనవలెనని నేను కోరుచున్నాను. మీ గృహము ఒక భవనమా లేక ఒక గుడిసా అనేది రెండవ విషయం - బయటకు కనబడునది రెండవ విషయముగా నుండును. మీ హృదయమును దేవుడు చూచును. గనుక మీ హృదయములు కలసి ఉండి దేవుడు నివసించుటకు ఒక పరిశుద్ధ స్థలముగా నుండునట్లు జాగ్రత్త పడుడి.