హెబ్రీ 10:5, “దేవుడు బలియు అర్పణయు కోరుటలేదని” చదువుతాము. ఎల్లప్పుడు దేవుడు నీ అర్పణలను కోరుచున్నాడని బోధకులచేత బోధించబడేవారికి నేను ఈ వచనాన్ని చెపుతుంటాను. కాని దేవుడు ఏమి కోరుచున్నాడని వాక్యము చెప్పుచున్నది? ఆయన మన శరీరములను కోరుచున్నాడు. పాతనిబంధనలో, “లేవీయులకు నీ దశమభాగము ఇవ్వమని” ఎక్కువగా చెప్పబడినది. క్రొత్తనిబంధనలో, “మీ శరీరములను సజీవయాగముగా దేవునికి సమర్పించుకొనుడని” చెప్పబడినది (రోమా 12:1). ఎల్లప్పుడు దశమభాగం చెల్లుంచుడని బోధించే సంఘం పాతనిబంధనసంఘం. క్రొత్తనిబంధన ముఖ్యముగా మన శరీరములను అనగా మన కళ్లను, మన చేతులను, మన నాలుకలను మొదలగు వాటిని సమర్పించాలని కోరుచున్నది. ఈనాడు దేవుడు మనలను వస్తుసంబంధమైన అర్పణలు ఇవ్వమని కోరుటలేదుగాని మన శరీరములను సమర్పించాలని కోరుచున్నాడు.
పాతనిబంధనలో పస్కా దినమందు గొఱ్ఱెపిల్ల వధించబడినట్లు క్రొత్తనిబంధనలో ప్రభువైనయేసు దేవుని గొఱ్ఱెపిల్లగా మన అందరికొరకు వధించబడ్డాడు. అనగా ఈ లోకములో దేవుని పరిచర్యకు కానుకలు(ధనము) ఇవ్వవద్దనికాదు. తప్పుకుండా మీరు ఇవ్వవచ్చును కాని సంతోషముగా ఇచ్చువారిని దేవుడు కోరుచున్నాడు (2 కొరింథీ 9:7). ఏది ఏమైననూ, దేవుడు మొదటిగా నీ దేహమును కోరుచున్నాడు. సాధారణముగా తమ శరీరములను సమర్పించువారు మిగతావన్నియు చాలా సులభంగా ఇస్తారు. కాని ప్రతిదానిని ఇష్టపూర్వకముగాను, సంతోషంగాను ఇవ్వాలి.
ప్రభువైనయేసు ఈ లోకానికి వచ్చినప్పుడు, తన తండ్రికి దశమభాగములను మరియు అర్పణలను సమర్పించుటకు రాలేదు (హెబ్రీ 10:5). తన శరీరమును సజీవయాగముగా ఇచ్చుటకు ఆయన వచ్చియున్నాడు. మరియు క్రొత్తనిబంధన మధ్యవర్తిగా, ముఖ్యముగా మనంకూడా మన శరీరములను సజీవయాగముగా సమర్పించాలని బోధించారు.
చాలామంది దేవునికి కానుకలు ఇచ్చి మరియు సేవచేస్తారు అనేకవందల కరపత్రాలు పంచియున్నామనియు, కష్టమైన ప్రదేశములలో అనేక సంవత్సరములు మిషనరీ సేవలు చేసామనియు, అనేక గంటలు ప్రార్ధించామనియు లేక అనేక రోజులు ఉపవాసం ఉన్నామనియు నీవు గొప్పలు చెప్పుకోవచ్చును ఇవన్నియు కూడా మంచి అర్పణలే. కాని నీవు ఇంకను కోపపడుచూ ఉండి మరియు మోహచూపులు చూస్తూ ఉంటే నీవు చేసిన వాటికి దేవునియెదుట విలువ ఉండదు. అనగా దేవుడు కోరే శరీరమును నీవు ఇవ్వలేదు. అప్పుడు దేవుడు నీతో ఇట్లనును; “కానుకలు మరియు అర్పణలు నాకు ఇవ్వడం గురించి మర్చిపోయి, మొదటిగా నీ కళ్ళను మరియు నాలుకను నాకు ఇవ్వుము. నాకు నీ శరీరం కావాలి”. నీ శరీరానికి బదులుగా అర్పణలు ఇవ్వకు. దేవునికిచ్చిన అర్పణలకు ఎక్కువ విలువనిచ్చువారు పాత నిబంధనలో ఉన్నారు. క్రొత్తనిబంధనలో దేవుడు నీ శరీరమును కోరుచున్నాడు. హెబ్రీ పత్రిక క్రొత్తనిబంధనలో ఒక ముఖ్యమైన పుస్తకం. నీవు క్రొత్తనిబంధనలో జీవించాలనుకుంటే హెబ్రీ పత్రికను ధ్యానించు.
ప్రభువైనయేసు పరలోకంలో ఉన్నప్పుడు ఆయనకు శరీరము లేదు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, తండ్రి ఆయనకు శరీరాన్ని ఇచ్చారు. ఆ శరీరంతో ఆయన ఏమి చేయాలి? ఆఫ్రికాలాంటి కష్టమైన దేశానికి మిషనరిగా వెళ్ళి, తండ్రియెడల తన ప్రేమను వ్యక్తపరచవలెనా? లేక రోజుకు నాలుగు గంటలు ప్రార్దించి మరియు వారానికి రెండు రోజులు ఉపవాసము ఉండవలెనా? వాటిలో ఏదియూ కాదు. ఆయన ఇట్లనుచున్నాడు, “దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చియున్నాననియు, బలులు అర్పణలు ఇచ్చుటకుకాదు” (హెబ్రీ 10:7). ప్రభువైనయేసు ఆవిధముగా శరీరాన్ని సమర్పించియున్నారు. మనంకూడా అలాగే చెయ్యాలి. మన శరీరాలను సజీవయాగముగా ఇచ్చినప్పుడు మన కళ్ళతోను, చేతులతోను, నాలుకలతోను, కోరికలతోను మొదలగువాటితోను ఆయన చిత్తమే చేసెదము. ప్రతిరోజు దేవుని చిత్తమే చెయ్యాలని కోరెదము.