WFTW Body: 

ఇశ్రాయేలు దేశచరిత్ర అంతటిలో దేవుడు తన శాశ్వతమైన ప్రేమను వారిమీద ముద్రించవలెనని కోరియున్నాడు. దేవుడు వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు (యిర్మియా 31:3 ; ద్వితి.కా 4:37). దానికి జవాబుగా వారు కూడా తిరిగి ఆయనను ప్రేమించవలెనని చెప్పెను (ద్వితి.కా. 6:5). కాని వారు కేవలము మనవంటివారైయున్నారు. వారు ఎల్లప్పుడు దేవునిప్రేమను అనుమానించిరి. అయినను దేవుడు వారిని ప్రేమించుచునే ఉన్నాడు. దేవుడు వారిని మరచిపోయెనని వారు ఫిర్యాదు చేసినప్పుడు, ఆయన జాలిగల మాటలతో ప్రత్యుత్తరమిచ్చెను. “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురుగాని నేను నిన్ను మరువను” యెషయా 49:15. ఒక ఎదిగిన బిడ్డనుగూర్చి తల్లి ఎల్లప్పుడు ఆలోచించకపోవచ్చును. కాని తనకు చంటిబిడ్డ ఉన్నట్లయితే, ఆమె మేలుకొనియున్నప్పుడు ఆ బిడ్డగూర్చి ఆలోచించని సమయముండదు. రాత్రిలో ఆమె నిద్రపోవుటకుముందు, తన ప్రక్కలో బిడ్డ నిద్రపోవుచున్నాడో లేదో అని చివరిగా ఆలోచించి, నిద్రపోవును. మధ్యరాత్రి ఆమె మేలుకొనినట్లయితే, తన బిడ్డను చూచును. ఉదయకాలమున ఆమె లేచినవెంటనే పాలు త్రాగే తన బిడ్డను గూర్చియే మొదటిగా ఆలోచిస్తుంది. ఆమె తన చంటిబిడ్డను గూర్చి అంతశ్రద్దగా జాగ్రత్త తీసుకొనును. అదేవిధముగా దేవుడు తన బిడ్డల విషయము జాగ్రత్తవహించునని ఆయన చెప్పుచున్నాడు.

హోషేయ గ్రంధముకూడా దీనినే చెప్పుచున్నది. హోషేయ తన వ్యక్తిగత జీవితములో వెళ్ళిన బాధాకరమైన అనుభవము ఇశ్రాయేలీయులయెడల దేవుని వైఖరికి ఉపమానముగా ఉన్నది. ఒక అపనమ్మకమైన భార్యవిషయములో నమ్మకముగా ప్రేమించే భర్తప్రేమవలే దేవుని ప్రేమ ఉన్నది. అవిధేయురాలైన తన పెండ్లికుమార్తె విషయములో నమ్మకముగా ఉండిన దైవికమైన ప్రేమికునిగూర్చిన సత్యము తెలుపుటకు దేవుడు పరమగీతమును బైబిలులో ఉంచెను.

మన విషయములో దేవుని పనులన్నియు ఆయన ప్రేమమీదనే ఆధారపడియుండును గనుక మన విశ్వాసము ఈ విషయముమీదనే స్థిరముగా ఉండవలెను. “ఆయన ప్రేమతో శాంతము వహించును” (జెఫన్యా 3:17) అనునది “దేవుడు నీకొరకు ప్రేమతో మౌనముగా ప్రణాళిక వేయుచున్నాడు” అని తర్జుమా చేయబడినది. దేవుడు మన జీవితములలో అనుమతించె ప్రతివిషయము మనలను ప్రేమించే దేవుని హృదయమునుండి వచ్చుచున్నవని మనము గుర్తించియున్నామా? నీ జీవితములో మరియు నాజీవితములో వచ్చుచున్న ప్రతిపరీక్ష మరియు సమస్యలద్వారా చివరకు మనకు మేలు కలుగవలెనని ప్రణాళిక వేసియున్నాడు. దేవునియొక్క అతిశ్రేష్టమైనదానిని పొందుటకు, కొన్నిసార్లు మన ప్రణాళికలను దేవుడు నిరర్ధకము చేయును. భూమిమీద దానిని మనము పూర్తిగా గ్రహించలేకపోవచ్చును. ఇది తప్ప వేరే కారణమేదియులేదని మనము గుర్తించి మరియు సమస్తమును మనలను ప్రేమించే దేవుని యొద్దనుండి వచ్చుచున్నవని గుర్తించినప్పుడు మనలోని చింతలను, భయములను మరియు కఠినతలంపులనే తెగులును తీసివేయును. విశ్వాసులు ఈ సత్యమందు స్థిరపడనందున వారి మనస్సులలో చింతలు మరియు అభద్రతలు ఉన్నవి మరియు వారు బైబిలులో ఉన్న “మన జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము” మరియు “చెప్పనశక్యమును మరియు మహిమాయుక్తమునైన సంతోషమును” ఎరుగని వారైయున్నారు.

పాతనిబంధనలోని దేవునిగూర్చిన లేఖనములను చదివినప్పటికిని, ప్రభువైనయేసు కాలములో ఉన్న మతాసక్తిగలవారిని, వారి తప్పుడు అభిప్రాయములను గూర్చి ఖండించే పరిచర్య ప్రభువు చేసెను. ప్రభువైనయేసు రోగులను స్వస్థపరచుట, దుఖములో ఉన్న వారిని ఆదరించేమాటలతో ఆదరించుట, పాపభారముతో ప్రయాసపడుచున్నవారికి ఆయన ఆహ్వానము, తన శిష్యులయెడల దీర్ఘశాంతము మరియు చివరిగా సిలువలో ఆయన మరణము ఇవన్నియు కూడా దేవుని హృదయములోని ప్రేమను వెల్లడించుచున్నవి. తన శిష్యులతో తండ్రి వారిని ప్రేమించియున్నాడనియు మరియు వారి ప్రతి అవసరమునుగూర్చి జాగ్రత్త వహించుచున్నాడనియు అనేక పర్యాయములు ఆయన చెప్పెను. తండ్రియందు వారి అపనమ్మికను యేసు అనేకసార్లు గద్దించెను. భూసంబంధమైన తండ్రులే తమ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగియుండగా, పరలోకపుతండ్రి వారికంటే మరిఎంతో ఎక్కువగా ఇచ్చును (మత్తయి 7:9-11). తప్పిపోయిన మరియు తిరుగుబాటు చేయుపిల్లలయెడల, దేవుని యొక్క గొప్పక్షమించే వైఖరిని తప్పిపోయిన కుమారుని ఉపమానములో చూడగలము. ఆయన తరములో దేవునిగూర్చి తప్పుడు అభిప్రాయములు కలిగిన వారిని ఉపమానముద్వారా మరియు తన వ్యక్తిగత జీవితముద్వారా తిరుగులేని విధముగా సరిదిద్దెను. లోకము దేవునిప్రేమను ఎరుగునిమిత్తము, ఆయన సిలువకు వెళ్ళకముందు చివరిప్రార్ధన చేసెను (యోహాను 17:23). మన విశ్వాసము వేరే దానిమీదకాక కేవలము దేవుని శాశ్వతమైన మరియు మార్పులేని ప్రేమమీదనే ఉండునట్లు దేవుడు తన సత్యవాక్యమును, లోతుగాను మరియు నిత్యమునిలిచియుండునట్లుగాను మన హృదయములలో ముద్రించునుగాక.