వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   నాయకుడు పునాది సత్యము
WFTW Body: 

2 కొరింథీ 4:6 లో సువార్తను పౌలు వివరించుచున్నాడు. అనేకులు ఈ సువార్తను గ్రహించి, అనుభవించకుండునట్లు సాతాను(ఈ యుగసంభంధమైన దేవత) వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసియున్నాడు. ఈ భూమిమీద దేవుని మహిమనే అనగా క్రీస్తునే నిజమైన స్వాస్థ్యము(ఐశ్వర్యము)గా కలిగియుండగలమని పౌలు చెప్పుచున్నాడు (4:6). ఆదికాండము 1వ అధ్యాయములో వెలుగు కలుగమని పలికిన దేవుడే మంటిఘటములైన మన హృదయములలో కూడా ప్రకాశించమని పలుకుచున్నాడు (ఆదికాండము 1వ అధ్యాయము) మరియు (2 కొరింథీ 4:7). జీవితాంతం మనం మంటి ఘటములవలె ఉంటాము. దేవుని మహిమయే (క్రీస్తే) ఈ పాత్రలో ఉన్న ఆకర్షణీయమైన విషయము.

పాతనిబంధనలో అబ్రాహాము మరియు దావీదు సిరి సంపదలు కలిగియున్నారు. అది ఈ లోక మహిమ ఎందుకనగా మనుష్యులందరు దానిని బట్టి అతిశయిస్తారు. కాని క్రొత్తనిబంధనలో పౌలులాంటి బీదవారిని మరియు ఆకర్షణగాలేనివారిని దేవుడు వాడుకున్నాడు. పౌలు 4 అడుగుల 11 అంగుళాల ఎత్తనియు, బట్టనెత్తి గలవాడనియు, పొడుగాటి ముక్కును కలిగి, ఎల్లప్పుడు జబ్బుతో ఉండేవాడనియు చెప్పుతుంటారు. అతడు నిలువబడి మాట్లాడుచున్నప్పుడు ఎక్కువ ఆకర్షనీయంగా కనబడేవాడుకాదు. కాని అతడు అభిషేకం పొందియున్నాడు కాబట్టి “భూలోకమును తలక్రిందుచేయునట్లు” గా దేవుడు అతనిని వాడుకొన్నాడు (అపో.కార్యములు 17:6). నిజానికి ఆదాము కాలమునుండి తలక్రిందులుగా ఉన్న లోకమును పౌలు సరిచేసియున్నాడు. అతడు బలహీనమైన పాత్రయేగాని క్రీస్తు మహిమతో నింపబడియున్నాడు. నీకు కూడా నీలో ఏమికలిగియున్నావనునది చాలా ముఖ్యమైయుంది. ఈనాడు అనేకులు దైవజనులమని చెప్పుకొంటూ సినీ తారలవలే స్టేజీమీదనుండి మాట్లాడుచున్నారు. కాని అపొస్తలుడైన పౌలునుండి నిజమైన దేవుని సేవకునిగూర్చి ఆవిధముగా చూడము. అతడు బంగారు పాత్రకాదు. అతడు మట్టి పాత్రయే. కాబట్టి మీలో ఉన్న బలహీనతలనుబట్టిగాని లేక పరిమితులనుబట్టిగాని నిరాశపడవద్దు. కాని నీవు దేవునియెదుట మంచి మనస్సాక్షి కలిగి ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి, అభిషేకం కలిగి క్రీస్తుతో నింపబడునట్లు చూచుకొనుము.

మట్టి పాత్రలలో ఉన్న వెలుగు (2 కొరింథీ 4:6,7), గిద్యోను సైన్యములో ఉన్న వెలుగుతో నిండిన 300 మందిని గుర్తుచేయుచున్నది. 32000 మందిలోనుండి దేవునిచేత ఏర్పరచబడిన ఈ 300 మంది కడవరిదినములలో ఉన్న జయించువారికి సాదృశ్యముగా ఉన్నారు. ఈ సైనికులవలే వారు సాతానుతో పోరాడుటకు దేవుని వాక్యమనే ఖడ్గము వారికి ఉన్నది. అయితే వారు దేవుని వెలుగుతో నిండిన మట్టి పాత్రలుగా ఉన్నారు. వారిలో ఉన్న వెలుగు ప్రకాశించునట్లు, గిద్యోను సైనికులు వారి మంటి ఘటములను పగులగొట్టమని వారికి చెప్పబడింది. నీవు ఒక ఒత్తిని వెలిగించి కుండలో పెట్టినట్లయితే దాని వెలుగు సరిగా ప్రకాశించదు. కాని ఆ కుండను పగులగొట్టినట్లయితే వెలుగు ప్రకాశిస్తుంది. మనలో యేసుయొక్క జీవపు వెలుగు ప్రకాశించునట్లు మనమంటి ఘటములు ఎలా పగులగొట్టబడాలో పౌలు చెప్పుచున్నాడు. వారు శ్రమలలోను, అపాయములలోను, తరుమబడువారుగాను, పడద్రోయబడువారుగాను వెళ్లవలసివచ్చింది (8-12వ ). కాబట్టి అతని మంటి ఘటము పగులగొట్టబడింది. మరియు అతనిలో ఉన్న ప్రభువైనయేసు జీవపు వెలుగును ఇతరులు చూడకలిగియున్నారు.

చాలామంది విశ్వాసులు దీనిని గ్రహించరు. మరియు ఆసక్తి కూడా కలిగియుండరు. కాని ఈ సిలువ మార్గమే దేవునిజీవాన్ని సమృద్ధిగా అనుభవించే విధానం.

నీవు ఒక గోధుమగింజను భూమిలో నాటినప్పుడు దానిపైపొర పగులగొట్టబడుతుంది. ఆవిధంగా ఆగింజలో ఉన్న జీవము విడుదలవుతుంది. క్రొత్తగా జన్మించిన మనకు కూడా ప్రాణము మరియు శరీరమనే టెంక ఉంటుంది. మనలోని దేవుని జీవము విడుదల కావాలంటే, అది విరువగొట్టబడాలి. ఆవిధంగా దేవుని జీవపు వెలుగు మనలోనుండి అనేకులలోనికి ప్రకాశిస్తుంది.

లేఖనములలో ఈ నియమాన్నే మనం చూస్తాం. ఒక స్త్రీ ప్రభువైన యేసు యొద్దకు ఒక అత్తరు బుడ్డి తెచ్చినప్పుడు దానిలో అధ్బుతమైన అత్తరు ఉన్నది. కాని ఆ బుడ్డి పగులగొట్టేవరకు దానిలో అధ్బుతమైన సువాసన ఎవరును అనుభవించలేదు. అలాగే మనం కూడా విరుగగొట్టబడుటకు దేవుడు అనేక పరిస్థితులగుండా నడిపిస్తాడు. అప్పుడు మనం ఇతరులకు ఆకర్షణీయంగా ఉండము. నీవు ఇతరులకు చాలా అందమైనవాడుగా కనబడాలని కోరవచ్చును. కాని దేవుడు “నీ కోరికను విరుగగొట్టనిమ్ము” అని అంటాడు. మనుష్యుడు, ఆత్మ, ప్రాణం మరియు శరీరమనే మూడు భాగములు కలిగియుంటాడు. క్రీస్తు జీవింపజేసే ఆత్మగా మన ఆత్మలోనికి వచ్చినప్పుడు అధ్బుతమైన క్రీస్తు మహిమ మన ఆత్మలో ఉంటుంది. కాని మన ప్రాణం, మహిమ ప్రకాశించకుండునట్లు ఆటంకపరుస్తుంది. కాబట్టి దేవుడు కొన్ని పరిస్థితులద్వారా మనలను విరుగగొట్టి, ఆయన నిత్యసంకల్పము మనము నెరవేర్చునట్లు ఆయన మనలో పని చేస్తాడు.