1 థెస్స. 4:1-8లో లైంగికవిషయాలలో ఉండవలసిన పవిత్రతగురించి పౌలు మాట్లాడుచున్నాడు. 1 థెస్స. 4:4వ వచనమును రెండు రకాలుగా తర్జుమా చేయవచ్చును. ఇక్కడ ఘటము అను మాటకు మన శరీరమనిగాని లేక మన భార్యఅనిగాని అర్ధము కావచ్చును.
"పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో మీలో ప్రతివాడును ఎరిగియుండవలెను". మనము పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. కాబట్టి మన శరీరమును పవిత్రముగా ఉంచుకొనుటను మనము నేర్చుకోవాలి (1 థెస్స. 4:4,5). అనేక విషయాలలో మనకు దేవుని చిత్తము స్పష్టముగా తెలియకపోవచ్చును. కాని ఈ విషయము మనకు స్పష్టముగా తెలియును. పరిశుద్ధపరచబడుట అనగా పాపమునుండి, లోకమునుండి మరియు క్రీస్తుకానిదానంతటినుండి వేరగుట. ఇటువంటి చెడ్డవాటినుండి మన శరీరమును కాపాడుకొనుటను నేర్చుకోవాలి.
1 థెస్స. 4:4 వచనమును ఇట్లు కూడా అర్ధం చేసుకోవచ్చును. "పరిశుద్ధతతోను, ఘనతతోను మీలోని ప్రతి ఒక్కరు భార్యను సంపాదించుకోవాలి". అనగా నీ భార్యను నీవు పొందే విధానము పరిశుద్ధముగాను, పవిత్రంగాను ఉండాలి. చాలామంది అపవిత్రమైన విధానంలో భార్యలను పొందుతారు. కట్నంను ఆశించడం ఒక అపవిత్రమైన విధానం. పవిత్రమార్గములో నీవు భార్య కొరకు వెదకుచున్నావా లేక ఆమెలో ఉన్న లోకసంబంధమైన అర్హతను ప్రాముఖ్యంగా చూస్తున్నావా? కేవలం శరీర ఆకర్షణతో భార్యకొరకు చూచుట అన్యుల మార్గం. నీవు దేవుని సేవించాలని కోరినట్లయితే, దేవునియెడల నీలాంటి వాంఛగల భార్యనే నీవు కోరాలి.
ఈ విషయమందెవడును అతిక్రమించి "తన సహోదరునికి మోసము చేయకుండవలెను" అని 1 థెస్స. 4:6లో పౌలు చెప్పుచున్నాడు. అనగా "వేరొకరి భార్యతో ఎక్కువ చనువుగా ఉండకూడదు". ఎందుకనగా "ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయును". జారత్వాన్ని పాపముగా చూడని థెస్సలొనీకయులవంటి దినములలో మనం ఉన్నాము. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కాని ఈ దినాలలో సంఘాలలోని యౌవ్వనస్థులలోను మరియు క్రైస్తవ సేవకులలోను జారత్వం ఉంది. ఈ విషయంలో మనం మంచి సాక్ష్యము కలిగియుండి లోకానికి వేరుగా ఉండాలి. ఈ విషయంలో మీ శరీరమును పవిత్రముగా ఎలా ఉంచుకోవాలో మీరు ఎరిగియుండాలి. లేనట్లయితే ప్రభువు కొరకు నమ్మకముగా ఉండలేము. దేవుని ఎరిగిన సమ్సోను మరియు దావీదు దీనికి మంచి ఉదాహరణలు. ఈనాడు కూడా ఇటువంటి వారనేకులున్నారు.