వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   యౌవ్వనస్తులు
WFTW Body: 

"వారు- ప్రభువా, దేవా, సర్వధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీమార్గములు న్యాయములును సత్యములునైయున్నవి; ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు" అని ప్రకటన 15 : 3, 4 వచనములలో చదువుతాము.

పాతనిబంధనలో రెండు మోషే కీర్తనలు పేర్కొనబడినవి- ఒకటి నిర్గమకాండము 15 : 1-4లో ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రమును దాటినప్పుడు, ఫరో అతని సైన్యముతో దానిలో మునిగిపోయినప్పుడు పేర్కొనబడినది. మోషే అప్పుడు ఇలా పాడెను: "యెహోవాను గూర్చి గానము చేసెదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను". ప్రకటన 6వ అధ్యాయములో క్రీస్తువిరోధి కూడా తెల్లని గుఱ్ఱము మీద రౌతుగా చిత్రీకరించబడుటను మనము చూచితిమి. ఇక్కడ జయించువారు ఆ గుఱ్ఱమును దాని రౌతును కూడా పడద్రోసినందుకు దేవునికి స్తుతిగానము చేయుటను మనము చూచెదము.

హార్‍మగెద్దోనులో జరుగు అంతిమ పోరాటములో, క్రీస్తువిరోధి అతని బలగాలు ఇశ్రాయేలు దేశమునకు వచ్చి దానిపై దాడి చేయుదురు. ఆ సమయములో, ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్ధులతో క్రిందకు దిగివచ్చును. ఆయన కాళ్ళు ఒలీవల కొండపై నిలువబడును మరియు ఆయన క్రీస్తువిరోధి యొక్క బలగాలను నాశనము చేయును. దేవుని ప్రజలు అసలు పోరాడకుండానే దానిని చూచి ఆవిజయములో పాలుపొందెదరు.

ఈనాడు కూడా మనము ప్రతి విజయమును ఆ విధముగానే పొందవలెను. మనము మానవ ఆయుధాలతో యుద్దమును గెలువము. మనము నిలకడగా నిలబడి ప్రభువును నమ్మినప్పుడు ఆయన మన శత్రువులను నాశనము చేయును. గనుక, దానిని నమ్మినవారు ఈనాడు కూడా మోషే యొక్క కీర్తనను పాడగలరు. జీవిత పోరాటములలో మనము మోషే యొక్క కీర్తనను పాడగలము. మనము "నిలకడగా నిలబడి" ప్రభువు మన శత్రువులకు ఏమిచేయునో చూచెదము.

మోషే యొక్క రెండవ కీర్తన ద్వితీయోపదేశకాండము 31 : 30 మరియు 32 : 52లో ఉన్నది. అక్కడ కూడా అతడు "జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును, తన విరోధులకు ప్రతీకారము చేయును. తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చితము చేయును" (ద్వితీయో. 32 : 43). ఈ రెండు కీర్తనలలో ఒక సత్యమును మనము చూచెదము; దేవుని ప్రజలు తమ శత్రువులపై ప్రతీకారము తీర్చుకొనరు. వారు నిలుచుండగా దేవుడు వారి కొరకు పోరాడి ప్రతీకారము తీర్చును.

ఒక దినమున మనము మహిమలో దేవుని వీణెలతో ఈ కీర్తనను పాడగలుగునట్లు మనము దీనిని ఇప్పుడే నేర్చుకొనవలెను. ఈ కీర్తనను నేర్చుకొనుటకు, జీవితపు అనుదిన పరిస్థితులు మనకు ఒక గాయక సాధన వంటివి.

దేవుని మార్గములు పరిపూర్ణమైనవని జయించువారు పాడుదురు. పరలోకములో మనము "యేసు సమస్తమును బాగుగా చేసియున్నాడు" అని పాడెదము. ఆనాడు, దేవుడు మనలను భూమిమీద నడిపించిన విధానమును తిరిగి చూచినప్పుడు, ప్రతిఒక్క విషయము(అవును, ప్రతి ఒక్క విషయము) మన మేలుకొరకే దేవుని చేత నిర్దేశింపబడెనని మనము కనుగొనెదము. ఈ రోజున అనేక సంఘటనలు ఎందుకు జరుగునో మనకు అర్ధము కాదు. కాని ఆ రోజున, మనము సంపూర్ణముగా అర్ధము చేసుకోగలము. కాని విశ్వాసముగల వ్యక్తి ఆ రోజు వరకు వేచియుండనక్కర లేదు. అతడు దానిని ఇప్పుడే ఎరిగి నమ్మును. భూమి మీద తనకు జరిగిన ప్రతిదానికి దేవుడు కారణము వివరించువరకు అతడు వేచియుండనక్కరలేదు. అతడు ఇప్పుడే, "ప్రభువా! నీ మార్గములు పరిపూర్ణమైనవి" అని పాడును.