వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   క్రీస్తుయెడల భక్తి
WFTW Body: 

యేసు ప్రభువు యొక్క మాటలు పవిత్రమైనవి. ఆయన పెదవులనుండి అపవిత్రమైన మాటలుగాని లేక వ్యర్ధమైన మాటలుగాని ఎప్పుడు రాలేదు. ఆయన ఎల్లప్పుడు సత్యమే మాట్లాడెను. ఆయన నోటిలో ఎటువంటి కపటములేదు. అవసరములకు మించి డబ్బును ఇంకా ఇంకా ఎక్కువ ఎలాగు సంపాదించవలెననే సంభాషణలోనికి ఆయనను ఎవ్వరు ఎప్పుడు తీసుకొని పోలేకపోయిరి. అటువంటి విషయములలో ఆయనకు ఏమాత్రము ఆసక్తిలేదు. ఆయన మనస్సు పైనున్న వాటిమీదనేగాని భూసంభందమైనవాటి మీద కాదు. ఆయన వస్తువులను ఉపయోగించియున్నారు అనుటలో ఎటువంటి అనుమానము లేదు కాని ఆయన వాటిని ప్రేమించలేదు మరియు వాటిలోదేనినైనను అంటిపెట్టుకొనలేదు.

ఇతరులు బాధపడునట్లుగా యేసు ప్రభువు ఒక్కసారి కూడా వారిని తక్కువగాచేసి మాట్లాడలేదు లేక అపహాస్యముగా మాట్లాడలేదు. ఆయన ద్వంద్వార్దములతో గాయపరిచేవిధముగా మాట్లాడలేదు. ఆయన శిష్యుల బలహీనతలగురించి వారు లేనపుడు ఇతరులతో మాట్లాడలేదు. మూడు సంవత్సరముల తరువాత కడరాత్రి భోజనము చేయుచున్నప్పుడు కూడా మిగతా పదకొండుమంది శిష్యులకు, ఆయనను శత్రువులకు అప్పగించనున్న యూదా గురించి ఒకసారి కూడా వారికి చెప్పకపోవటము ఎంతో ఆశ్చర్యకరమైన విషయము.

యేసు ప్రభువు తన నాలుకతో ఇతరులను ప్రోత్సహించి మరియు వారికి బోధించి, దేవుని చేతిలో జీవమునిచ్చే సాధనముగా తన నాలుకను వాడెను. అలసిన వానిని మాటలచేత ఊరడించుటకును (యెషయా 50:4 ) మరియు గర్విష్టులను, అహంకారులను ఖండించుటకును వాడిగల ఖడ్గముగాను ఆయన నాలుకను ఉపయోగించెను (యెషయా 49:2 ).

రోమా శతాధిపతి మరియు కనాను స్త్రీ యొక్క విశ్వాసమును యేసుప్రభువు బహిరంగముగా మెచ్చుకొనినప్పుడు వారెంత ప్రోత్సహించబడియుందురో కదా ( మత్తయి 8:10, 15:28 ).

పాపత్మురాలైన స్త్రీ యొక్క ప్రేమను ఆయన మెచ్చుకొనుట ( లూకా 7:47 ) మరియు బేతనీయలోని మరియ నాయెడల మంచి కార్యము చేసినది ( మార్కు 14:6 ) అని ఆమెను మెచ్చుకొనిన మాటలను ఎన్నటికి వారు మరచియుండరు.

నేను నీకొరకు ప్రార్ధించెదనని యేసు పేతురుతో చెప్పినపుడు అతడు ఎంతో బలము పొందియుండును (లూకా 22:32 ). అవి కొన్ని మాటలైనప్పటికినీ వారికి ఎంతో ప్రోత్సాహమును బలమును ఇచ్చెను.

యెషయా 50:4 వ వచనము ప్రకారము ఇంకను అనేకమంది అలసినవారిని యేసు తన మాటలద్వారా ఊరడించి యుండవచ్చును ఎందుకనగా తన జీవితములో తనను కలసుకొనే అలసిపోయిన వారికి సరియైన వాక్యము ఇచ్చుటకు ప్రతిదినము తండ్రి స్వరము వినెను.

సమరీయులను నాశనము చేయవలెననియు మరియు తమకొరకు ఉన్నతస్థలములు కావలెననియు కోరినప్పుడు యోహాను మరియు యాకోబులను ప్రభువు గద్ధించెను ( మత్తయి 20:22,23 , లూకా 9:55 ). శిష్యుల యొక్క అవిశ్వాసమును బట్టి ఆయన వారిని ఏడుసార్లు గద్ధించెను.

యేసు ప్రభువు యొక్క హృదయము ఇతరులయెడల ప్రేమతో నిండినందున, ఇతరులు బాధపడినప్పటికినీ సత్యమును మాట్లడుటకు ఎన్నడూ భయపడలేదు. కఠినమైన మాటలు మాట్లాడినందుకు దయగలవాడని ఆయనకు పేరుపోతుందేమోనని ఆయన ఆలోచించలేదు. ఆయన తనను తాను ప్రేమించుకొనుటకంటె ఇతరులను ఎక్కువగా ప్రేమించెను గనుక ఇతరులకు సహాయపడుటకు తనకున్న మంచి పేరు త్యాగము చేయుటకైనను సిద్ధముగా ఉండెను గనుక మనుష్యులు నిత్యము నశింపకుండునట్లు, ఆయన సత్యమును గట్టిగా బోధించెను. ఆయన గురించి వారికి ఉన్న అభిప్రాయములకంటే వారి యొక్క నిత్యరక్షణ ఆయనకు ముఖ్యమైయున్నది.