వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   పురుషులు
WFTW Body: 

యోబుగ్రంధము 26 నుండి 31 అధ్యాయములలో ఇతరుల మేలుకొరకు యోబు చెప్పుచున్నాడు. ఈ అధ్యాయములను మనము చదువుచుండగా, బైబులులేని ఆదినములలో మరియు పరిశుద్ధాత్మతో నింపబడకపోయినప్పటికీ, దేవునిగూర్చి మరియు ఆయన మార్గములనుగూర్చి యోబుకున్న వెలుగు (ప్రత్యక్షత) మరియు ఆయన యొక్క ఉన్నతమైన జీవితము ఎంతో ఆశ్చర్యకరమైనది. ఈ దినములలో మనము బుద్ది తెచ్చుకొని మరియు ఉన్నతమైన జీవితము జీవించుటకు సవాలు చేయబడు నిమిత్తము ఈ అధ్యాయములలోని కొన్ని సంగతులు చదువుట మంచిది. జ్ఞానమును వెదుకక బంగారము కొరకు లోతుగా త్రవ్వు మనుష్యుడు ఎంతో బుద్దిహీనుడని చెప్పుచూ ఆరంభించుచున్నాడు (యోబు 27:1, యోబు 27:12 , యోబు 27:13). “యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు మరియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు” (28:28) ఆయన చెప్పుచున్నాడు. సామెతలు 9:10 లో ఇదే విషయమును 1000 సం||ల తరువాత సోలోమోను చెప్పుచున్నాడు. ఇటువంటి గ్రహింపును అతడు నిశ్చయముగా యోబు గ్రంధమునుండి పొందియుండును. 29వ అధ్యాయములో గతములో తాను దేవుని స్నేహితుడుగా ఏవిధముగా జీవించెనో, బీదలకు, దిక్కులేనివారికి, విధవరాండ్రకు, గ్రుడ్డివారికి, కుంటివారికి మరియు అవసరములో ఉన్నవారికి సహాయము చేసినట్లుగా చెప్పుచున్నాడు. 30వ అధ్యాయములో ఇన్ని మంచిక్రియలు చేసినప్పటికీ, ఇప్పుడు శ్రమపడుచు మరియు దేవునిచేత తగ్గించబడుటనుగూర్చి ఫిర్యాదు చేయుచున్నాడు.

31వ అధ్యాయములో తన జీవితములో ఉన్న నీతినిగూర్చి చెప్పుచున్నాడు. స్త్రీలను మోహచూపుతో చూడకుండునట్లు తన కన్నులతో నిబంధన చేసుకొని జాగ్రత్తపడెను(1వ). ప్రభువైనయేసు మత్తయి 5వ అధ్యాయములో దానిగూర్చి చెప్పుటకు 2000 సం||ల కు ముందే యోబు ఈ పాపము విషయములో వెలుగు కలిగియున్నాడు. అతడు అబద్దికుడుకాక యదార్ధవంతుడై యుండెను (5,6వ). తన భార్య విషయములో ఎప్పుడైననూ అపనమ్మకస్తుడుగా లేడు (9-12వ). తన పనివారిని కనికరముతో చూచెను, బీదలకు మరియు విధవరాండ్రకు సహాయపడెను మరియు తల్లిదండ్రులు లేని వారిని తన స్వంత బిడ్డలవలె పెంచెను(16-23వ), అతడు బంగారమును నమ్ముకొనక మరియు విగ్రహారాధికుడు కాకుండా ఉండెను (24-28వ) తనను ద్వేషించినవారి నాశనమును చూచి సంతోషించలేదు (29,30వ), పరదేశులకు ఆతిధ్యమిచ్చెను (31,32వ). అతడు పాపము చేసిన వెంటనే ఒప్పుకొనెను (33వ), ప్రజల తిరస్కారమును గూర్చి భయపడలేదు (34వ) తన భూమినిగూర్చి జాగ్రత్తపడెను (38-40వ). తన మొఱ్ఱ ఆలకించునట్టు దేవునికి మొఱ్ఱపెట్టెను (35వ).

ఈ అధ్యాయములలో యోబు ఎంతమంచి దైవజనుడనునది చూచుచున్నాము. ఆయన జీవితములోని అనేక విషయములలో ఆయనకు వెలుగు ఉన్నది మరియు ఇతరులకు ఎంతో సహాయుడుగా ఉన్నాడు. కాని ‘ఆత్మీయగర్వము’ అను విషయములో ఆయనకు వెలుగులేదు. అది ఆయన భక్తిలో ఉన్న గర్వము. దేవుడు యోబును ప్రేమించెను మరియు యోబు భూమిని విడిచి వెళ్ళకముందే, దీనత్వము అనే సద్గుణము కూడా కలిగియుండవలెనని దేవుడు తీర్మానించెను. యోబుయెడల తనకున్న గాఢమైన ప్రేమనుబట్టి, యోబును దైవజనుడుగాను మరియు దీనుడుగాను చేయుటకు, దేవుడు యోబుకు అనేక శ్రమలను అనుమతించెను.

భక్తుడైన అపోస్తలుడైన పౌలు అత్యధికముగా గర్వించకుండునట్లు, దేవుడు పౌలును కూడా శ్రమలగూండా నడిపించెను. ఆయన శరీరములో ఒకముల్లును, తనను నలుగగొట్టుటకు సాతానుదూతగా ఉంచెను (2 కొరిం 12:7). యోబుకు కూడా సాతాను దూత ఉండెను. అయితే అది ఎందుకు పొందుకొనెనది పౌలు ఎరిగియున్నాడు. కాని యోబుకు తెలియదు - దేవుడు దీనులకు మాత్రమే కృపనిచ్చును గనుక దైవజనులమీద కృపను కుమ్మరించుటకు దేవుడు వారిని దీనులుగా చేయుటకును మరియు విరుగగొట్టబడుటకును, శ్రమలద్వారా, అపార్ధము చేసుకొనబడుటద్వారా, వ్యతిరేకించబడడము ద్వారా మరియు హింసింపబడుటద్వారా నడిపించును. యోబు ఫిర్యాదు చేయుటను మనము నిందించకూడదు. ఎందుకనగా అతనికి బైబిలులేదు, పరిశుద్ధాత్మతో నింపబడలేదు మరియు అతనికి ప్రోత్సహించే సహోదరుడు లేడు. కాని పౌలు ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు. మరియు మనముకూడా చేయకూడదు.