వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   నాయకుడు
WFTW Body: 

నెహెమ్యా 1 : 1 - 3లో చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నెహెమ్యా ఎంతో శ్రద్ధ కలిగియున్నట్లు చూస్తాము. ఇది దేవుడు వాడుకొనే వారిలో ఉండే ప్రధానమైన లక్షణము. అతడు దేవుని ప్రజల విషయములో ఆసక్తికలిగియున్నాడు కాబట్టి దేవుడు అతనికి భారాన్ని ఇచ్చాడు. దేవుని చేత నీవు వాడబడవలెనంటే, ఇతరుల విషయములో నీకు శ్రద్ధాసక్తులు ఉండాలి. అటువంటి శ్రద్ధాసక్తులు లేనివారిని దేవుడు ఎన్నటికినీ వాడుకొనడు. నెహెమ్యా హనానీయను ఇట్లడిగాడు, "అక్కడ పరిస్థితులు ఏవిధముగా ఉన్నవి?" అతడు ప్రాకారములు పడద్రోయబడినవనియు మరియు గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవనియు చెప్పాడు. పడిపోయిన ప్రాకారములు మరియు కాలిపోయిన గుమ్మముల విషయములో నెహెమ్యా శ్రద్ధకలిగియున్నాడు. అతడు ఆ వార్త వినినప్పుడు అనేకదినములు ఏడ్చి, బాధపడి మరియు ఉపవాసముండి ప్రార్ధించాడు. దేవుని సంఘము యొక్క పరిస్థితి చూచి, దానికొరకు భారముకలిగిన వారికొరకే ఈనాడు దేవుడు చూచుచున్నాడు.

నెహెమ్యా పాతనిబంధనలో జీవించాడు. మనలో ఇప్పుడు జీవింపజేసే పరిశుద్ధాత్మ నివసించునట్లు, అతనిలో నివసించలేదు. ఇప్పుడు ఉన్నట్లు సమృద్ధిగా పూర్తి బైబిలుగాని, సంఘ సహవాసముగాని, ఇతరపుస్తకములుగాని లేక టేపులు మరియు కూటాలుగాని అతనికి లేవు. సిలువను గురించి అతనికి ఏమియు తెలియదు. అయినప్పటికీ అతనిలో ఎంతో భారమున్నది. అతడు "పూర్తికాలపు సేవకుడు కాదు. అతడు ఉద్యోగము చేయుచున్నాడు. తన్నుతాను పోషించుకొని, సేవ చేశాడు. దేవుని నామము మహిమపారచబడలనే భారముకలిగిన, స్వార్ధములేని వ్యక్తిగా నెహెమ్యా మాదిరిగా ఉన్నాడు. అతని మాదిరిని మనము సవాలుగా తీసుకున్ననట్లయితే, దేవుడు మన జీవితముల ద్వారా కూడా కొంత నెరవేర్చగలడు.

రాజుయెదుట అతడు ఎప్పుడైనను విచారముగా లేడు (నెహెమ్యా 2 : 1). అతడు ముభావముగా ఉండే వ్యక్తికాదు. అతడు ఎల్లప్పుడు సంతోషముగా ఉండుటయే రాజు చూశాడు. కాని ఇప్పుడు విచారముగా ఉన్నాడు. కాని తన గురించి అతడు విచారముగా లేడు. యెరూషలేము యొక్క పరిస్థితిని బట్టి అతడు విచారముగా ఉన్నాడు. ఓ, అటువంటివారు ఈనాడు కూడా సంఘములో ఉందురు గాక.

దేవుడు ఇచ్చే అతిశ్రేష్టమైన దానికంటే తక్కువ దానితోనే తృప్తిపడే క్రైస్తవులను చూచాను. అనగా 25%, 50% మరియు 75%. తనతరములో దేవునియొద్దనుండి అతిశ్రేష్టమైన దానికొరకు అత్యాసక్తితో కోరిన ఎలీయా వలె ఉండుము. అతడు పట్టువదలలేదు. కాబట్టి రెట్టింపు ఆత్మను పొందాడు.

నెహెమ్యా యెరూషలేము వెళ్ళి బహుశా మూడు రోజులు ఉపవాసముండి ప్రార్ధించియున్నాడు (నెహెమ్యా 2 : 11). రాత్రియందు లేచి, అతనితో కొందరిని తీసుకొని వెళ్ళాడు. అక్కడ శత్రువులు అడ్డగిస్తారేమోనని, దేవుడు తన మనస్సులో ఉంచిన సంగతిని వారితో చెప్పలేదు (నెహెమ్యా 2 : 10). దేవుని పని విషయములో భారములేని వారిని సమకూర్చుటవలన ప్రయోజనములేదని అతనికి తెలుసు. కాబట్టి కొంతమందిని మాత్రమే తీసుకొనివెళ్ళి, పడిపొయిన వాటిని చూచారు.

నెహెమ్యా ప్రజలను సమకూర్చి, నడిపించగలవాడు. అతడు కూడా పని చేశాడు కాబట్టి ప్రజలు అతనితో సంతోషముగా పని చేశారు. ఎవరైతే ఉపవాసముండి దేవుని నామము మహిమపరచబడునట్లు ప్రార్ధిస్తారో, ప్రజలను సమకూర్చి వారిని ప్రోత్సహిస్తారో మరియు ఎవరైతే వారి స్వహస్తాలతో కూడా పని చేస్తారో అటువంటి నాయకుడే ఈనాడు దేవునికి కావాలి.

నెహెమ్యా 5 : 1 - 13, బీదలను, కుంగిపోయినవారిని మరియు అప్పులపాలైనవారిని గురించి నెహెమ్యా జాగ్రత్త వహించాడు. అప్పిచ్చినవారితో మాట్లాడి వారి అప్పులనుండి విడిపించాడు. 18వ వచనములో అతడు అధికారిగా ఉన్నప్పటికీ అతడు కష్టపడి పని చేయుచూ మరియు 150 మంది యూదులను మరియు ఇతరులను అతని భోజనపుబల్ల యొద్ద కూర్చుండనిచ్చెను. అయినప్పటికీ అతడు వారి సొమ్మును అపేక్షించలేదు. ఈ విషయములో అతడు మనకు మాదిరిగా ఉన్నాడు. నోవా మరియు పౌలువలె తన స్వంత ఖర్చులతో ఆతిధ్యమిచ్చాడు. గొప్ప త్యాగముతో జీవించిన వ్యక్తిని ఇక్కడ మనము చూచుచున్నాము. దేవుని పనికి వాడవలసిన సొమ్మును తనకొరకు వాడుకొనలేదు. ధనము విషయములో నమ్మకముగా ఉండే సేవకుడిని దేవుడు చూచినప్పుడు, దేవుడు అతనిని గొప్పగా వాడుకొనును. ఇతర సహోదరులనుండి ధనమును ఆశించే సేవకులను దేవుడు విడిచిపెడతాడు.

9వ అధ్యాయములో నెహెమ్యా ద్వారా దేవుడు చేసిన దానిని చూస్తాము. ఇశ్రాయేలీయులు ఉపవాసముండి, తమపాపములు ఒప్పుకొనుచూ, అన్యులలో నుండి వేరవుతున్నట్లుగా చూస్తాము (1, 2వ). తరువాత 3 గం||లు బైబిలు పఠనము, 3 గం||లు పాపములను ఒపుకొని దేవుని ఆర్భాటముతో స్తుతించిరి. మరలా ఉజ్జీవము వచ్చింది (3వ). అప్పుడు లేవీయులు నిలువబడి యెలుగెత్తి దేవునికి మొఱ్ఱపెట్టిరి (4వ). 6 నుండి 31వ వచనము వరకు బైబిలంతటిలోకల్లా పెద్ద ప్రార్ధన చేయబడింది. అబ్రాహాము తరువాత జరిగినట్లు లేవీయులు మరలా చేశారు. అరణ్యములో 40 సం||లు, న్యాయాధిపతుల కాలములో దేవునితీర్పు, సత్యము మరియు న్యాయమైనదేనని ఒప్పుకున్నారు. వారు మనస్సు మార్చుకొని, ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొన్నారు (నెహెమ్యా 10 : 1).

12వ అధ్యాయములో గుమ్మములను చూచుటకును మరియు స్తుతించుటకును నెహెమ్యా ప్రజలను నియమించాడు. బాబెలోను నుండి యెరూషలేముకు వెళ్ళే మార్గములో దేవుని ప్రజలను గమనించండి. వారు ఉపవాసముండుచు, ప్రార్ధిస్తూ, పాపములను ఒప్పుకొంటూ, కూటములను పెట్టుకుంటూ మరియు ఎక్కువగా దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ వెళ్ళారు.

నెహెమ్యా 13వ అధ్యాయములో దేవుని మందిరము యొక్క పవిత్రతను గూర్చిన నెహెమ్యా యొక్క ఆసక్తిని చూస్తాము. యెరూషలేము దేవాలయములో ప్రభువైనయేసు చేసినట్లే అతడు దేవాలయములోనికి వెళ్ళి శుభ్రపరిచాడు. ప్రజలు మారుమనస్సు పొందని బంధువులను దేవాలయములో ఉండనిచ్చినట్లు నెహెమ్యా కనుగొన్నాడు. ఎల్యాషీబు టోబీయాతో బంధుత్వము కలుగజేసుకొని, అతనికి ఒక్క గొప్పగదిని సిద్ధము చేశాడు (నెహెమ్యా 13 : 4). అతడు టోబీయా యొక్క సామాగ్రి అంతయు అవతలవేసి, గదులన్నియు శుభ్రము చేయుమని ఆజ్నాపించాడు (8వ). విశ్రాంతి దినమున కొందరు వస్తువులను అమ్ముటను చూచి వారిని గద్దించాడు (15వ). వారిని గద్దించి వారితో మిమ్మును పట్టుకొందుననెను (21వ). ప్రజలు దేవునికి భయపడనియెడల దేవుని సేవకునికైనను భయపడాలి. కొందరు అన్యస్త్రీలను పెళ్ళి చేసుకున్నట్లు అతడు కనుగొన్నాడు. నెహెమ్యా "వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెంట్రుకలు పెరికి వేసి, మీరు వారి కుమారులకు మీకుమార్తెలను ఇయ్యకము, మీ కుమారులకైనను, మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరిట ప్రమాణము చేయించాడు (25వ). ఈలాగున వారిని పవిత్రపరచి, కావలసినప్పుడెల్ల కట్టెల అర్పణను ప్రధమఫలములను తీసికొనివచ్చునట్లుగా నెహెమ్యా చేశాడు (30, 31వ).