మన శరీరావయవములను అదుపులో పెట్టుకొనుట గూర్చి క్రొత్తనిబంధనలో చెప్పబడింది. ఆత్మశక్తి చేత శరీరక్రియలను చంపనియెడల, దేవుని జీవాన్ని సమృద్ధిగా అనుభవించలేమని రోమా 8 : 13లో పౌలు చెప్పుచున్నాడు. I కొరంథీ 9 : 27లో బహుమానము పొందునట్లు తన శరీరమును ఎలా నలుగగొట్టుకున్నాడో పౌలు చెప్పుచున్నాడు. మనము ఎల్లప్పుడు పరిశుద్ధులముగా ఉండాలంటే మనము ఎంత పరిశుద్ధతను అనుభవించినప్పటికినీ పౌలువలే జీవితాంతము వరకు మనము కూడా శరీరమును అదుపులో పెట్టుకోవాలి.
మనము వినేమాటల విషయములో మన చెవులను అదుపులో పెట్టుకొనుట నేర్చుకోవాలి. కొండెములు మరియు నిందలు వినుటకు మన సమయాన్ని వెచ్చించలేము. ఎందుకంటే అప్పుడు మనము దేవుని స్వరాన్ని వినలేము.
ఈ దినములలో మనము ఏది చూడాలో లేక ఏది చదవాలో అనే విషయములో మన కళ్ళకు నేర్పాలి. తమ కళ్ళను అదుపు చేసుకోనందువలన ఒకరికంటే ఎక్కువమంది సువార్తికులు మరియు దేవుని సేవకులు వ్యభిచారములో పడిపోయారు. ఈ విషయములో క్రమశిక్షణలేనందువలన, ఎంతో మంది ఆలోచనలలో తప్పిపోయారు. "వ్యర్ధమైనవాటిని చూడకుండ నా కన్నులను త్రిప్పివేయమని" ఎల్లప్పుడు ప్రార్ధించాలి (కీర్తనలు 119 : 37).
మన నాలుక కూడా పరిశుద్ధాత్ముని యొక్క ఆధీనములో ఉండాలి. మానవుని నాలుక (మాటలు) క్రైస్తవసంఘములో మరణాన్ని విస్తరింపజేసినంతగా ఇంకొకటేదియు చేయదనుకుంటున్నాను. యెషయా దేవునిపరిశుద్ధతను చూచినప్పుడు, తాను అపవిత్రమైన పెదవులు కలిగియున్నాడని ఒప్పించబడ్డాడు. దేవుని వెలుగులో తనను తాను చూచుకోనంతవరకు, అతడు ఈ విషయాన్ని గుర్తించలేదు.
ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గురుతుపట్టిన యెడల నీవు నానోటివలె ఉందువని దేవుడు యిర్మీయాతో చెప్పారు (యిర్మీయా 15 : 19).
ఈ ప్రవక్తలు తన నోటిని (నాలుకను) అజాగ్రత్తగా వాడినట్లయితే దేవుని ప్రవక్తలుగా ఉండుటను పోగొట్టుకొనేవారు. వారు అజాగ్రత్తగా మాట్లాడుటను, వ్యర్ధమైన మాటలను, కొండెములను, నిందలుమోపుటను, విమర్శించుటను విసర్జించారు. లేనట్లయితే వారు వారి పరిచర్యను పోగొట్టుకొనేవారే. ఈనాడు అనేకమంది ప్రవక్తలు లేకపోవటానికి ఇది ఒక కారణము కావచ్చును.
మన పెదవులమీద దేవుడు తన వాక్యాన్ని ఉంచినట్లయితే, ఆయన సేవకు మాత్రమే వాడబడునట్లు పెదవుల (మాట్లాడుట) విషయములో జాగ్రత్తపడాలి. మన శరీరఅవయవాలను ఒక రోజు దేవుని కొరకు మరియు మరియొక రోజు మన ఇష్టప్రకారము వాడలేము. దేవునికి ఏదైతే ఇస్తామో, అది నిత్యత్వానికి ఆయనదే.
డాక్టరు మన నాలుకను చూచి, మన శరీరముయొక్క ఆరోగ్యస్థితిని తెలుసుకొనినట్లే, మన ఆత్మీయస్థితి తెలుసుకొనగలమని యాకోబు చెప్పుచున్నాడు (యాకోబు 1 : 26). ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపములేనివాడని ధైర్యముగా చెప్పుచున్నాడు (యాకోబు 3 : 2).