ఎఫెసు సంఘములోని పెద్దలను విడిచి వెళ్ళుచున్నప్పుడు పౌలు వారిని పిలిచి ఏమి చెప్పియున్నాడో అపొ.కా. 20:17-35లో చూడండి. పౌలు వారితో 3సం||లు (31వ వచనము) ఉండి మరియు రాత్రింబగళ్ళు వారికి బోధించాడు. 3సంవత్సరములంటే 1000 దినముల కంటే ఎక్కువ. అనగా రోజుకు కనీసము రెండుసార్లు బోధించినను 2000 ప్రసంగములు అక్కడ చెప్పియుంటాడు.
ఎఫెసులో ఒకప్పుడు గొప్ప ఉజ్జీవము వచ్చింది మరియు అక్కడి క్రైస్తవులు మాంత్రిక విద్యకు సంబంధించిన అనేక పుస్తకములు తెచ్చి అందరియెదుట కాల్చివేశారు. వాటి విలువ సుమారు 5లక్షల రూపాయలు. పౌలు శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లయినను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచినవి. దయ్యములు కూడా వదలిపోయెను. ఎక్కడాలేని విధముగా దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించారు (అపొ.కా. 19:11,12,19). చివరిగా పౌలు అక్కడి పెద్దలకు ఏమి గుర్తు చేశాడు? అతడు చేసిన ప్రసంగములనుగాని లేక అద్భుతములనుగాని వారికి గుర్తు చేశాడా? లేదు.
వారియొద్ద ఉన్న మొదటిరోజు నుండి పూర్ణమైన వినయభావముతో అతనేలాగు నడుచుకున్నానోనని గుర్తు తెచ్చుకొనమని వారికి చెప్పాడు (అపొ.కా. 20:19). వారు ఒకవేళ అతని ప్రసంగములను మరచిపోయినను, వారి మధ్య అతడెలా జీవించాడో దానిని వారు మరచిపోలేరు. అతని జీవితవిధానము వారినెంతో ప్రభావితం చేసింది. అతనిలో ఉన్న కనికరము మరియు నిష్కాపట్యమును వారు ఎన్నటికీ మరువలేరు. తన అవసరము నిమిత్తమును తనతో ఉన్నవారి అవసరము నిమిత్తమును తన చేతులతో కష్టపడి పనిచేశాడు ఎందుకనగా ఇతరులకు భారముగా ఉండకుండునట్లును మరియు ఇతర క్రైస్తవ సేవకులకు మాదిరిగా ఉండుటకును ఆవిధముగా చేశాడు (అపొ.కా. 20:34,35). అతడు ఎవని వెండినైనను, ధనమునైనను, వస్త్రములనైనను ఆశించలేదను విషయము వారు ఎన్నటికినీ మరువలేరు (33వ వచనము)!
దేవుని సంకల్పమంతటినీ రాజీపడకుండా వారికి ప్రకటించానని పౌలు గుర్తు చేశాడు (అపొ.కా. 20:27). పేరుప్రతిష్ఠలు సంపాదించుటకు అతడు మనుష్యులను సంతోషపెట్టేవాడుగా లేడు. కొందరు అభ్యంతరపడినను, తన బోధ వినువారందరు నిత్యమైన ఎన్నటికీ నశించని ఆశీర్వాదము పొందునట్లు మారుమనస్సు, విశ్వాసము గురించి బోధించాడు (అపొ.కా. 20:20,21). ఈ విషయాలను పౌలు వారికి చెప్పాడు.
పౌలువలె నీవు ఒక స్థానిక సంఘానికి కాపరిగా 3 సం||లు ఉండి వెళ్ళినట్లయితే నీ విషయములో వారు వేటిని గుర్తుపెట్టుకుంటారు? మనోహరంగా బోధించే బోధకుడుగానా లేక దీనుడవైన దైవజనుడుగా యేసువలె జీవించిన నీ జీవితమునా? వారిని అంతకంతకు దేవునిలోనికి నడిపిన వానిగాను మరియు క్రీస్తుఆత్మతో నింపబడి క్రీస్తువలె జీవించుటకు వారిని ప్రొత్సహించిన వాడిగాను నిన్ను గుర్తుపెట్టుకుంటారా? లేక కరపత్రాలను ఎలా పంచిపెట్టాలని బోధించినవాడిగా గుర్తుపెట్టుకుంటారా? మనకున్న వరమేదైనను లేక మన పిలుపేదైనను అది మనము క్రీస్తుజీవముతో నిండినవారమై, ఆ క్రీస్తుజీవమే మన అంతరంగములో నుండి ప్రవాహించును.
స్వస్థతావరమున్నవారు ప్రభువైనయేసు చేసినట్లే చేయాలి. ప్రభువైనయేసు దీనుడై, సామాన్యముగా జీవించి, అందరితో మిళతమై, రోగుల యెడల ఎంతో కనికరముగలవాడై మరియు స్వస్థపరచక ముందుగాని, తరువాత గాని ఎవరి దగ్గర నుండియైనను డబ్బును తీసుకొనలేదు. ఆయన అందరినీ ఉచితముగా స్వస్థపరిచాడు. కాని నా జీవితమంతటిలో అటువంటి "స్వస్థపరచేవాడిని" ఒక్కరిని కూడా కలువలేదు. అటువంటి వారిని మీరు కలుసుకున్నట్లయితే దయచేసి నాకు చెప్పండి. ఎందుకనగా అట్టివారిని కలుసుకోవటం నాకు చాలా యిష్టం. కాని ఇంతవరకు అట్టివారిని నేను కలుసుకొనలేదు. దానికి బదులుగా స్వస్థతావరము ఉన్నదని చెప్పుకొని, డబ్బును ప్రేమించి, మానసిక కుయుక్తులతో ప్రజలను మోసము చేసేవారిననేకులను నేను కలుసుకున్నాను. వివేచన లేని యౌవ్వనస్థులు ఈ మోసగాళ్ళను వెంబడించి, అలాంటి పరిచర్య చేయుట కొరకు ప్రయత్నించుట చాలా బాధాకారము! ఆవిధముగా రాబోయే తరము వారు కూడా తప్పుపోవుదురు. ఇది నాకు చాలా బాధను కలిగిస్తుంది.
అపొస్తలుల పరిచర్యకుగాని, ప్రవచించే పరిచర్యకుగాని, సువార్త పరిచర్యకుగాని, కాపరిపరిచర్యకుగాని లేక ఉపదేశించే పరిచర్యకుగాని మరి ఏ పరిచర్యకైనను మనము పిలువబడినట్లయితే, క్రీస్తు విధానములో దానిని చేయాలి. క్రీస్తుఆత్మతో నింపబడి, ప్రతి పరిచర్యలో కూడా క్రీస్తుఆత్మ చేత నడిపించబడాలి.
నీవు ఒక స్థానిక సంఘానికి కాపరిగా ఉండుటకు పిలువబడియున్నావని తలంచితే, దానిని యేసువలె చేయుము. యేసుమహిమ(ఆయన జీవము మరియు స్వభావము)తో నింపబడి, ఆ మహిమను ప్రకాశింపజేసేవాడుగా ఆ సంఘస్థులు నిన్ను గుర్తుంచుకొనులాగున చేయాలి.