వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   శిష్యులు
WFTW Body: 

ఒక కారణన్నిబట్టి దేవునిఅంగీకారము 30సం||ల వయస్సులో ప్రభువైనయేసు మీద ఉన్నది. అదేమనగా ఆయన జీవితకాలమంతయు నమ్మకముగా శోధనను జయించారు. తనకొరకు తాను కాకుండా తండ్రి కొరకే జీవించాడు. తన్నుతాను సంతోషపరచుకొనుటకు ఆయన ఏమియు చేయలేదు (రోమా 15 : 3). బాప్తిస్మము తీసుకొన్న తరువాత తండ్రి ఈలాగు సాక్ష్యమిచ్చారు,"ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను". అంతేగాని "నేను ఆశీర్వాదించిన నాప్రియకుమారుడు" అని అనలేదు. రెండవసారి చెప్పిన ఈ సాక్ష్యములో ఏమియులేదు. మొదట ఇచ్చినదే అనగా దేవునిఅంగీకారమే ప్రభువైనయేసుకు సర్వమైయున్నది. ప్రభువైనయేసును వెంబడించుట అనగా మనము కూడా దేవునియొద్దనుండి అటువంటి సాక్ష్యమును కోరాలి.

ఆదాము సంతానముగా, మనకొరకు మనమే బ్రతికే స్వభావముతో మనము పుట్టాము. ప్రతీది కూడా మనచుట్టూనే తిరుగుతూ, మనకు సేవ చేయాలని ఆశిస్తాము. మనము రక్షణపొందినప్పుడు, దేవుడు కూడా అనేక విధాలుగా మనలను ఆశీర్వాదించి మనకు పరిచర్య చేయాలని ఆశిస్తాము. మొదటిగా మనము పాపక్షమాపణ కొరకు తరువాత స్వస్థతకొరకు మరియు ఉద్యోగము, ఇల్లు, వివాహము, ఈలోకసంబంధమైన అభివృద్ధికొరకు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్ధిస్తాము. ఇతరుల దృష్టిలోను మరియు మనదృష్టిలోను మనము మతాసక్తి కలిగియున్నను మనకొరకే మనము జీవించే అవకాశము ఉన్నది. అందరితో పాటు దేవుడు కూడా ఒకరై, కేవలము ఆయనలో నుండి ఏమిపొందెదమా అని ఆశిస్తూ మనము ఉండవచ్చును. తప్పిపోయిన కుమారుడు తండ్రియొద్దనుండి ఆహారము పొందుటకు వచ్చియున్నాడు. అయినప్పటికీ తండ్రి ఎంతో ప్రేమతో అతనిని చేర్చుకొన్నాడు. మనకోరికలన్నియు స్వార్ధముతో ఉన్నప్పటికినీ దేవుడు ప్రేమతో మనలను చేర్చుకుంటాడు. మనము పూర్తిగా స్వార్ధముతో ఆయనదగ్గరకు వచ్చినప్పటికినీ, సంతోషముతో మనలను చేర్చుకొనునంతగా ఆయన మనలను ప్రేమించియున్నాడు. అయితే పుచ్చుకొనుట కంటే ఇచ్చేటటువంటి ఆయన స్వభావములో మనము తరువాత పాలివారమవుతామని దేవుడు నిరీక్షిస్తాడు. అయినప్పటికినీ, ఆయన బిడ్డలనేకులలో, ఇటువంటి గ్రహింపును ఆయన కలుగజేయలేకపోవుచున్నాడు. ఎల్లప్పుడు "నేను", "నాకు" మరియు "నాది" అని ఈ లోకసంబంధమైన ఆశీర్వాదాలతోనే వారు తృప్తిపొంది, అలాగే జీవించి చనిపోతారు.

మన మనస్సు మారి నూతనపరచబడి, పరిణితి చెందినప్పుడు, దేవునిలో నుండి మనము ఏమి పొందుకుంటామే అని మాత్రమేగాక, మనలో నుండి దేవుడు ఏమి పొందగలడు అని ఆలోచిస్తాము. మన మనస్సు నూతనపరచబడి రూపాంతరము పొందెదము(రోమా 12 : 2). ఇదియే సియోను పర్వతముమీద దేవుని గొఱ్ఱెపిల్లతో 144000 మంది నిలుచుటకు అర్హులుగా చేసింది (ప్రకటన 14). కోపము, మోహతలంపులు, ధనాపేక్ష మొ||లగు వాటిమీద జయము పొందుట మాత్రమే ఆత్మీయతకాదు. తనకొరకు తాను జీవించుట ఆగిపోవాలి. మన సొంతలాభము, మన సొంతసౌఖ్యము, మన సొంతచిత్తము, మన సొంతహక్కులు, మన సొంతఘనత మరియు మన సొంతఆత్మీయతను వెదుకుట ఆగిపోవాలి.

శిష్యులు ప్రార్ధించుట నేర్పుమని ప్రభువైనయేసును అడిగినప్పుడు, ఆయన "నేను", "నాకు" లేక "నాది" అనేమాటలు లేని ప్రార్ధన వారికి నేర్పించారు (లూకా 11 : 1-4). మొదటిగా తండ్రినామమును గూర్చి మరియు ఆయనరాజ్యము మరియు చిత్తము గూర్చి చెప్పి తరువాత మనకొరకు ఏలాగో అలాగే మన తోటి విశ్వాసులకొరకు లోకసంబంధమైన మరియు ఆత్మీయ క్షేమముకొరకు ప్రార్ధించమన్నారు (అనగా "నాకొరకు" "నాకొరకు" అని కాకుండా "మాకొరకు" "మాకొరకు" అని అర్ధము). ఈ ప్రార్ధనను మనము కంఠస్థం చేసి, ఒక పిట్టలాగా మరలా మరలా చెప్పటం చాలా సులభము. కాని హృదయపూర్వకముగా ఆ ప్రార్ధనచేయుటకు మనము స్వయాన్ని విడిచి మన హృదయములో దేవుడే కేంద్రముగా ఉండాలి. మనలను మనము ఎల్లప్పుడు విమర్శించుకొనినట్లయితే, సొంతసౌఖ్యమును మరియు సొంతహక్కులను అనగా సొంతసుఖమునే కోరే నియమము మనలో ఉన్నట్టు కనుగొనగలము(రోమా 7 : 22).

దేవునిరాజ్యమును మొదటి వెదకుడని ప్రభువైనయేసు చెప్పారు అనగా మనము స్వార్ధాన్ని విడిచి, దేవునినే మనము కేంద్రముగా కలిగియుండాలి. భూమిమీద తండ్రిచిత్తము నెరవేర్చుటకు పరలోకములో ఉన్న సౌఖ్యాన్ని ప్రభువు వదులుకున్నారు. అపొస్తలుడిగా ఉండి ప్రభువుకొరకు అనేక శ్రమలను భరించుటకు పౌలు, తార్సులో సుఖవంతమైన క్రైస్తవ వ్యాపారవేత్తగా ఉండుటను విడిచిపెట్టాడు. ప్రతి అపొస్తలుడు కూడా దేవునినే కేంద్రముగా కలిగియుండే త్యాగపూరితమైన జీవితాన్ని జీవించారు. ఈనాటి "సంచారము చేసే బోధకులకు" వేరుగావారు, భూమిమీద దేవుని రాజ్యము విస్తరించుటకు వారు అన్నిటిని విడిచిపెట్టారు.

మనము కోపముమీద మరియు మోహతలంపులమీద జయము పొందినప్పటికీ, మనము ఇంకను స్వంతసుఖమునే కోరుచున్నట్లయితే అది నిజమైన పరిశుద్ధతకాదు. చాలామంది దీనిని గ్రహించలేకున్నారు. అందువలన సాతాను వారిని మోసము చేయగలగుచున్నాడు. చాలామంది క్రైస్తవులు వారి సుఖముకొరకు మరియు ఆస్థిసంపాదనకు వేరే దేశాలు వెళ్ళుచున్నారు. అయినప్పటికీ వారు వారి జీవితాలలో దేవుని ఆశీర్వాదాలు కలిగియుండవచ్చును గాని దేవుని అంగీకారము పొందలేరు ఎందుకనగా ఎవరైనను దేవునిని మరియు సిరిని సేవింపలేరు (అనగా సంపదలు, సౌఖ్యములు మొ||నవి). మనమీద మరియు మనపిల్లలమీద దేవుని ఆశీర్వాదము ఉండుటనుబట్టి, దేవుడు మన విషయములో సంతోషముగా ఉన్నాడనుకొంటే, అప్పుడు సాతాను మనలను మోసగిస్తాడు. దేవుని ఆశీర్వాదము మరియు దేవుని అంగీకారము ఈ రెండు ఒకటికాదు. మనము చనిపోయిన తరువాత, " అతడు దేవునికి ఇష్టుడైయుండెను" అనే హానోకు సాక్ష్యమును కలిగియుండాలి(హెబ్రీ 11 : 5). మూడు మాటలే -అయినను భూమి మీద అంతకంటే శక్తివంతమైన సాక్ష్యమును కలిగియుండలేము. ప్రభువైనయేసు మరియు పౌలు ఈ సాక్ష్యమునే కలిగియున్నారు. కేవలము "దేవుడు నన్ను ఆశీర్వాదించాడు" అనే సాక్ష్యమేమియు గొప్పదికాదు ఎందుకంటే అనేకమంది అవిశ్వాసులు కూడా అట్టి సాక్ష్యాన్ని కలిగియున్నారు. ఆయన ఆశీర్వాదాన్ని మాత్రమేగాక దేవుని అంగీకారాన్ని కూడా కోరేవారి కొరకు దేవుడు చూచుచున్నాడు.