వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   Religious or Spiritual
WFTW Body: 

పరిసయ్యతత్వమునకు కనికరము చాలా ముఖ్యమైన విరుగుడైయున్నది. మనకు కీడు లేక హాని చేసిన వారిని క్షమించుటకంటే కూడా కనికరము మిన్నయైనది. అవసరములో ఉన్నవారికి మేలు చేయుటయే కనికరము. మంచిసమరయుని ఉపమానములో ప్రభువైన యేసు కనికరము అనగా ఏమిటో వివరించారు (లూకా 10:25-42 మరియు 37వ. గమనించండి).

ఒక ధర్మశాస్త్ర బోధకుడు - నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ప్రభువైన యేసును అడిగాడు. నీదేవుడైన ప్రభువుని పూర్ణహృదయముతో ప్రేమించి, నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించాలని ప్రభువైన యేసు జవాబిచ్చారు. అతడు నీతిమంతుడైనట్లు కనపరచగోరి - నా పొరుగువాడెవడని ప్రభువైన యేసును అడిగాడు(29వ). అతని స్వనీతి అతడు పరిసయ్యుడని బయలుపరచినది. అప్పుడు ప్రభువైన యేసు ఈ ఉపమానము చెప్పారు.

ఈ ఉపమానములో, ఒక యాజకుడు(దేవుని మందిరములో పెద్ద), రోడ్డు ప్రక్కనపడియున్న వ్యక్తిని చూచి ప్రక్కగా పోయెను. అతడు ఒక వ్యక్తి యొక్క అవసరాన్ని చూచియు వేరుగా స్పందించాడు. అతని రహస్యపాపమును బట్టే దేవుడు అతనిని శిక్షించాడని బహుశా అతడు అనుకొనియుండవచ్చును. లేదా రాత్రిలో ఇతరులతో కలసి కాకుండా అతడు ఒంటరిగా వెళ్ళుట తప్పని అనుకొనియుండవచ్చును. ఇతడు యోబుకు బోధించిన ముగ్గురు బోధకులవలె ఉన్నాడు. ఇతరులు శ్రమలలో ఉన్నప్పుడు వారికి మనము సహయపడకుండా, వారేదో తప్పు చేశారని ఎంత తొందరగా ఉహిస్తాము. ఇతరులు అవసరములో ఉన్నప్పుడు మనము ఎంత వేరుగా ఉంటాము. "నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పిగొంటిని మీరు నాకు దాహమియ్యలేదు, పరదేశినైయుంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు (మత్తయి 25:42,43). మీరు నాకు పాటలు పాడారు మరియు నాకు బోధించారు కాని మీరు ఎన్నడైనను నాకు సహయపడలేదు" అని ప్రభువు చెప్పును.

శ్రమలో ఉన్న వ్యక్తికి సహయపడుటకంటే, యెరూషలేములో కూటానికి సమయానికి వెళ్ళుటలో ఆ యాజకుడు ఆసక్తి కలిగియున్నాడు. కూటాలన్నిటికి సమయానికి వచ్చే వారిలో కొందరు నరకానికి వెళ్ళవచ్చును. తరువాత లేవీయుడు (దేవుని మందిరములో ఒక సహోదరుడు) అలాగే ప్రక్కగా వెళ్ళాడు. అతడు దేవుని చేత పరీక్షింపబడ్డాడు. మతాసక్తి గల ఇద్దరు దేవుని స్వరము వినుటకు కూటానికి వెళ్ళారు. కాని వారు మార్గములో ఉన్నప్పుడే దేవుడు వారితో మాట్లాడియున్నాడని వారు గ్రహింపులేకుండా ఉన్నారు. వారి మార్గములో తటస్థించి శ్రమలలో ఉన్న వ్యక్తితో వారు సరిగా స్పందించలేదు కాబట్టి వారి పాటలు, ప్రార్ధనలు మరియు మతము అన్నియు వృధాయే. దైవజనులు పొందే శ్రమలను చూచేవారిని పరీక్షించుటకే దేవుడు ఆ శ్రమలను అనుమతించును(వాడుకొనును).

మనము కూడా ఏదొక సమయములో ఆ ఇద్దరివలె ప్రవర్తించాము కాబట్టి మనలో ఎవరము కూడా వారిమీద రాయి వేయలేము. ఉపమానములో ఉన్న యాజకునివలె లేక లేవీయునివలె ఉన్నామని గ్రహించినట్లయితే, అప్పుడు మనము మారుమనస్సు పొంది రాబోయే దినాలలో వేరుగా ఉండుటకు ప్రయత్నించెదము. ఆ యాజకుడువలె మరియు లేవీయుడువలె మనము కూడా దేవుని ప్రతినిధులముగా ఉండుటకు ఈ భూమి మీద దేవుని చేత ఉంచబడ్డాము. మనము ఆయనను సరిగా వ్యక్తపరచనందుకు మారుమనస్సు పొందుదాము.

చివరకు, తృణీకరించబడిన ఒక సమరయుడు(యాజకుడు మరియు లేవీయునివలె మంచి సిద్ధాంతములేని డినామినేషన్ కు చెందిన ఒక సహోదరుడు), ఆ వ్యక్తికి సహయపడుటకు దేవుని చేత వాడబడ్డాడు. ఆ సమరయుడు ఒక పెద్దగాని లేదా బోధకుడుగాని కాదు. ఎవరికి తెలియకపోయినను ఇతరులకు మేలు చేస్తూ, అటువంటి అవకాశముల కొరకు ఎదురు చూస్తూ ఉండే సామాన్యమైన వ్యక్తి అతడు. అతడు కొట్టబడిన వ్యక్తిని తీర్పు తీర్చలేదు. అటువంటి పరిస్థితి అతనికైనను రావచ్చు అని అనుకొన్నాడు కాబట్టి కనికరము గలవాడైయున్నాడు. ఒక అవసరములో ఉన్న సహోదరుని కొరకు తన సమయమును మరియు డబ్బును ఖర్చుపెట్టి తన్నుతాను ఉపేక్షించుకున్నాడు.

శరీరము అను తెరద్వారా ఏర్పడిన నూతమైనదియు, జీవముగల మార్గమును చూచుచున్నాము:- క్రీస్తు ప్రత్యక్షపరచిన ప్రేమ మార్గము. శరీరధారియైయున్న క్రీస్తులో కనికరము ప్రత్యక్షపరచబడినది. శరీరమను తెరద్వారా మంచితనము వ్యక్తపరచబడినది.