వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   యౌవ్వనస్తులు సంఘము
WFTW Body: 

మీ స్థానిక సంఘ పెద్దల మీద, మీకు నమ్మకమున్న యెడల, అన్ని విషయములలో వారికి లోబడుట చాలా సులభము. కాని ఒకవేళ మీ సంఘ పెద్దల మీద నమ్మకము లేనట్లయితే, అప్పుడు ఏయే విషయములలో వారికి లోబడవలెనో లేక ఏయే విషయములలో వారికి లోబడనవసరములేదో ఎరుగు నిమిత్తము, సంఘ విషయములను మరియు వ్యక్తిగత విషయములను వేరుచేయవలెను.

సంఘ విషయములు:

సంఘ కూటములను నడిపించుట, ఆత్మీయముగా ఎటువంటి గురి(లక్ష్యము)తో సంఘము వెళ్ళుచున్నది, సంఘ పరిచర్యలో దేని గూర్చి నొక్కిచెప్పుచున్నారు, సంఘము ద్వారా నిర్వహించే కార్యక్రమములు మొదలగునవి సంఘ విషయములు. ఇటువంటి విషయములలో పెద్దలకు సంఘస్థులు లోబడవలెను. దేవుడు ఆ సంఘములొ నిన్ను ఉంచియున్నాడనే నిశ్చయత నీకున్నట్లయితే, వారు పరిపక్వతచెందిన సహోదరులనే గౌరవము నీకు లేనప్పటికీ, లేక వారిలో నీకు నమ్మకము లేనప్పటికీ, దేవుడు నిన్ను ఉంచిన ఆ సంఘమునకు వారు కాపరులు గనుక నీవు లోబడవలెను.

తండ్రియైన దేవుడు, యేసును యోసేపు మరియు మరియ ఇంటిలో ఉంచినందున వారు యేసువలె పరిపూర్ణులు కానప్పటికీ మరియు పరిపక్వతయు లేనివారైనప్పటికీ, ఆయన వారికి లోబడియుండెను. ఆవిధముగా ఆయన నూతనమైనదియు జీవముగల మార్గమును, తన శరీరము ద్వారా నజరేతులో తన మొదటి 30 సం||ల జీవితమును ఆరంభించెను. ఈ నూతనమైన మరియు జీవముగల మార్గమును తెరచుటకు, యేసు ఇంటిలో ఉన్న అసంపూర్ణులైన అధికారులకు లోబడుట అనే మొదటిమెట్టును మనమెప్పుడును మరచిపోకూడదు. మిగిలిన మెట్లన్నియూ తరువాత వచ్చినవి.

ఏ సంఘములో కూడా నీవు జగడమునకు కారణము కాకూడదు - ఎందుకనగా సహోదరులమధ్య విరోధము కలిగించువారిని - వారికి వారే ఎంతో ఆత్మీయులనుకొనినను లేక ఆసక్తిగలవారమనుకొనిననూ దేవుడు వారిని ద్వేషించును (సామెతలు 6:16-19) . దేవుడు ఏర్పరచుకొనిన నాయకులను ఎదిరించుట ఎల్లప్పుడు సాతాను సంబంధమైనది. అది కోరహు మార్గము (యూదా 11 , సంఖ్యా 16) మరియు అది ఎల్లప్పుడు గర్వమునకును, అహంకారమునకును ప్రతిఫలము. ఒకవేళ అటువంటి ప్రత్యేకమైన సంఘములో దేవుడు నిన్ను ఉంచిన విషయములో నిశ్చయత లేనట్లయితే, అప్పుడు ఆ సంఘమును విడిచి వేరొక సంఘములో చేరే విషయము మొదట దేవునియొద్ద కనిపెట్టవలెను. కాని నీవు ఒక సంఘములో ఉండి అక్కడ గందరగోళమును సృష్టించకూడదు, ఎందుకనగా దేవుడు దానిని సహించడు.

ఎటువంటి బాధ్యతలేకుండా, ఆహారము భుజించుటకు హోటలునకు వెళ్ళినట్లు సంఘమునకు అప్పుడప్పుడూ వెళ్ళకూడదు. ఎందుకనగా సంఘము హోటలు కాదు కాని ఒకగృహము అయిఉన్నది. గనుక స్థానిక సంఘమునకు నిన్ను నీవు అప్పగించుకొనవలెను. లేకపోయినట్లయితే నీవు ఆత్మీయముగా అభివృద్ధిచెందలేవు. ప్రతియొక్క సంఘము అసంపూర్ణమైయున్నది గనుక నీవు ఎన్నటికీ పరిపూర్ణమైన సంఘమును కనుగొనలేవని గుర్తుంచుకొనవలెను. ప్రస్తుతము నీవు గ్రహించినంత వరకు దేవుని వాక్యమునకు దగ్గరగా ఉన్న సంఘమును చూడవలెను.

ఒక సంఘములో నీవు ఏదైన ఒక క్రొత్త విషయమును(అక్కడ కొదువగావున్న దానిని) తీసుకొనిరావలెనని కోరినట్లయితే, దానికి సరియైన మార్గమును నీవు మొదటగా సంఘపెద్దలతో విచారించి(మాట్లాడి) మరియు వారు చెప్పిన విధముగా పూర్తిగా లోబడి చెయ్యవలెను. సంఘ పెద్దల లక్ష్యమునకు వ్యతిరేకముగా కూటములలో నీ ఉద్ధేశ్యములను(లక్ష్యములను) చెప్పుట మంచిదికాదు. ఏదైన విషయములో నీపెద్దలతో నీవు ఏకీభవించలేకపోయినట్లయితే, మరియు వారికి లోబడలేనని అనుకున్నట్లయితే లేక సంఘపెద్దలు సంఘమును తప్పుత్రోవలో నడిపించుచున్నారని నీవు తలంచినట్లయితే, అప్పుడు నీవు ఆ సంఘమును విడచి మరియు సంఘములో ఏదైతే ముఖ్యమైనదని లేక అవసరమైనదని నీవనుకొనుచున్నావో దానిని బట్టి ఒక సంఘమును నీవు మొదలుపెట్టవచ్చును.

దైవజనులైన మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియమ్ బూత్, వాచ్‍మెన్ నీ మొదలగువారు శతాబ్దములనుండి అనేక స్థలములలో వారున్న సంఘములను విడచి దేవుని చిత్తప్రకారము క్రొత్త సంఘములను ఆరంభించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించినట్లు నిన్ను కూడా ఆశీర్వదించి నీతో కూడా ఉండును. నీ మొండితనము (మూర్ఖత్వము)ను బట్టి నీవు ఆవిధముగా చేసినయెడల దేవుడు నీతో ఉండడు మరియు నీవు ధూదా మరియు యూదా మార్గములొ వెళ్ళినట్లు కనుగొనగలవు (అ.కా. 5:36,37) మరియు అనేక శతాబ్దములనుండి క్రైస్తవ్యములో అనేక వేలమంది ఉద్యమములను ఆరంభించి చివరకు గందరగోళములోను మరియు ఆశాభంగములోను ముగిసెను.

వ్యక్తిగత విషయములు:

వ్యక్తిగతముగా మీరు ఎటువంటి వస్త్రములు ధరించెదరో, మీ ధనమును మీరు ఏవిధముగా ఖర్చుపెట్టెదరో, ఎటువంటి ఇంటిలో మీరు జీవించెదరో, ఏక్కడెక్కడకు మరియు ఏవిధముగ మీరు ప్రయాణించెదరో (విమానము లేక రైలుద్వార), మీరు లేక మీ కుటుంబసభ్యులు ఎటువంటి వస్త్రములు ధరించెదరో, ఎటువంటి ఆహారమును మీరు భుజించెదరో, మీ పిల్లలకు ఎటువంటి ఆటలాడుకునే వస్తువులు కొనెదరో, మీపిల్లలు కంప్యూటర్ గేమ్స్ ఆడెదరా లేదా, మీ పొరుగింటిలోని టీ.వీ.లోని ఆటలను చూడనిచ్చెదరా లేదా, మరియు మీరు ఏ ఉద్యోగము చేయుచున్నారు, ఎక్కడ పనిచేయుచున్నారు మొదలగునవి. ఇటువంటి వ్యక్తిగత విషయములలో నీకు తోచినవిధముగా చేయుటకు నీకు పూర్తిస్వాతంత్ర్యము ఉన్నది. నీపెద్దలమీద నీకు నమ్మకము లేనియెడల ఇటువంటి విషయములలో వారికి లోబడనక్కరలేదు మరియు వారిని అడగవలసిన అవసరములేదు. ఇటువంటి విషయములలో నీకు ఏదైన సందేహము ఉన్నట్లయితే, నీ స్థానిక సంఘనాయకులకంటే వేరే పెద్దల మీద నీకు నమ్మకము ఉన్నట్లయితే వారిని అడుగవచ్చును. ఇటువంటి విషయములలో ఎల్లప్పుడూ అంతిమనిర్ణయము నీవే తీసుకొనవలెను. నీప్రవర్తనగాని, నీవస్త్రధారణగాని లేక మీ పిల్లలు గాని ఇతరులకు అభ్యంతరముగా ఉండనంతవరకూ ఇట్టి విషయములలో వేరుగ ఉండుట పెద్దలను ఎదిరించుటకాదుగాని అభ్యంతరముగా ఉన్నట్లు పెద్దలు భావించినట్లయితే, వారు చెప్పినది వినుటకు ఇష్టపడవలెను.

సంఘ పెద్దలకు ఏయే విషయములలో లోబడి వుండవలెనో మరియు ఏయే విషయములలో లోబడనవసరములేదో వివేకముకలిగి ఉండుటయే జ్ఞానము. పెద్దలందరూ ఆత్మానుసారమైన మనస్సు కలిగి మరియు నమ్మకమును పుట్టించేవారుగా ఉండరు గనుక స్థానిక సంఘపెద్దలమీద నమ్మిక లేకపోవటము తిరుగుబాటుచేసినట్లుకాదు. కాని నీవు చివరకు ఎక్కడా మరియు ఎవరికీ లోబడకుండా ఉన్నట్లయితే, నీకు నీవే ధర్మశాస్త్రము విధించుకొని(చట్టముపెట్టుకొని) మరియు సాతానుచేత కొట్టబడి మరియు నాశనము చేయబడుటకు సులభముగా దొరికిపోయెదవు. ఎల్లప్పుడు మనము జ్ఞానము కలిగి నడుచుకొనుటకు దేవుడు సహాయము చేయును గాక. ఆమెన్.