వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   పునాది సత్యము
WFTW Body: 

క్రొత్తనిబంధనలో రక్షణ మూడు కాలములలో అనగా భూత, వర్తమాన మరియు భవిష్యత్తుకాలములలో చెప్పబడింది. మనము క్రొత్తగా జన్మించినప్పుడు పాపము యొక్క శిక్షంతటినుండి, తీర్పునుండి ఇప్పటికే రక్షణ పొందియున్నాము. ఇప్పుడు మనము పాపముయొక్క శక్తి (పాపస్వభావము) నుండి రక్షణ పొందాలి. ప్రభువు మహిమలో తిరిగి వచ్చినరోజున మనము అక్షయమైన శరీరము ధరించుకొని, పాపమే లేని పరలోకమునకు వెళ్ళి సంపూర్ణ రక్షణ పొందుతాము. రక్షణలోని ప్రతి విషయములోను దేవుడే మనలో పనిచేస్తాడు, " మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షణ పొందియున్నారు. ఇది మీ వలన కలిగినదికాదు దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడవీలులేదు(ఎఫెసీ 2:8,9 ).

"రక్షణ దేవునిలోనుండి మాత్రమే వస్తుంది" (యోనా 2:9 ) అని యోనా విశ్వసించి, నోటితో ఒప్పుకొనినప్పుడే చేప కడుపులోనుండి యోనా విడుదల పొందియున్నాడు. "అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేలమీద కక్కెనని" తరువాత వచనములో చెప్పబడింది. తనను తాను కొంచెము కూడా రక్షించుకొనలేనని యోనా ఒప్పుకునేవరకు దేవుడు వేచియున్నాడు. ఏ ఒక్కపాపము నుండియైనను లేక ఎటువంటి బాధ, శ్రమ, పరిస్థితులనుండియైనను మనలను మనము కొంచెము కూడా రక్షించుకొనలేము(రక్షంచబడలేము) అని మనము ఒప్పుకొనే వరకు ఆయన మనకొరకు వేచియుంటాడు. అప్పుడు యోనాను విమోచించినట్లే మనలను కూడా దేవుడు విమోచిస్తాడు. యోనావలే మనము కూడా అతికష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనము సణగక లేక గొణగకుండా ఉండి దేవుని నమ్మి, ప్రార్ధించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రక్షణ‍అంతయు ప్రభువులోనుండి వస్తుందని నోటితో ఒప్పుకుంటే వెంటనే మనము కూడా విడుదల పొంది రక్షించబడతాము.

రక్షింపబడుట అంటే మనలను మనము బాగు(వృద్ధి) చేసుకొనుట కాదు. అది మనలను కేవలము బాహ్యవిషయములలో మార్పు తెస్తుంది. అడుగువాటన్నిటికంటే ఊహించువాటన్నిటికంటే అత్యధికముగా చేయగల దేవునిశక్తి మన ఆత్మలో హృదయములో పనిచేయుట ద్వారా మన అంతరగమంతయు మార్పు చెందుతుంది.

మనుష్యుడు ఏవిషయములోనైనను, ఎన్నటికినీ అతిశయింపకుండునట్లు దేవుడు మనిషిలో పనిచేస్తాడు. మనము సమస్త పాపమునుండి సంపూర్ణరక్షణ పొందవలెనని కోరినట్లయితే, దేవుడు పాపము మీద మనకు అనుగ్రహించిన జయమును బట్టిగాని లేక దేవుడు మనలోగాని, మనద్వారాగాని చేసిన దేనినిబట్టియైనను అతిశయించుటనుండి మనము రక్షణ పొందాలి. మన దృష్టిలో మనము ఎంత చిన్నవారముగా ఉంటమో అంత సమృద్ధిగా మన ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశించెదము(2 పేతురు 1:11). మన దృష్టిలో మనము చిన్నవారమై యున్నామనుటకు ఒక రుజువు ఏమిటనగా, ఇతరులు ఏమతస్థులైనను లేక ఏమతశాఖకు చెందినవారైనను లేక మనకు ఉన్న వాక్యపు వెలుగు వారికి లేకపోయినను వారిని తృణీకరించము. అతిదుష్టుడైన వ్యక్తిని చూచి కూడా మనలో మనము ఈ విధముగా అనుకుంటాము "నేనెమైయున్నానో అదంతయు దేవుని కృపను బట్టియే".

ప్రభువైనయేసు ఎల్లప్పుడు తన గురించి "నేను మనుష్యకుమారుడను" లేక "నేను ఒక సామాన్యమైన వ్యక్తిని" అని చెప్పేవారు. అన్ని సమయములలో మనము కూడా దానినే గుర్తించవలసియున్నది. మనము పాపముయొక్క శిక్షంతటినుండి, తీర్పంతటినుండి కేవలము దేవుని కనికరము మరియు కృప ద్వారానే రక్షింపబడియున్నాము. మనము పాపముయొక్క శక్తినుండి రక్షింపబడి, విడుదల పొందినను అదంతయు కేవలము దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన కనికరము మరియు కృపద్వారానే పొందియున్నాము. కాబట్టి అతిశయయించుటకు మనకు ఏమున్నది? ఒక్కటిగూడా లేదు(ఏమియు లేదు). ఒక ఉదాహరణను గమనించండి :- నీవు వేసిన(గీసిన) అందమైన పటమును చూసి ఇతరులు మెచ్చుకొనినప్పుడు నీవు గర్వించునట్లు శోధించబడుదువు, కాని వేరేవారు వేసిన పటమును(బొమ్మను) ఇతరులు మెచ్చుకొనినప్పుడు నీవు గర్వించునట్లు కనీసము శోధనకూడా నీకురాదు. మన జీవితములలో రక్షణ కార్యమంతయు కేవలము దేవుడే చేయుచున్నాడు. మనలను మనము బాగు చేసుకొనినచో లేక పరిశుద్ధపరచుకొనినచో దానిని బట్టి మనము గర్వించవచ్చును. కాని దేవుడే మనలను బాగుచేసి మరియు తన పరిశుద్ధతతో నింపి మనలను పరిశుద్ధపరిచినయెడల దానిని బట్టి మనమెలాగున గర్విస్తాము?

మనము పొందిన "పరిశుద్ధత" యొక్క నాణ్యత ఎలాగుంది? మనమేదొకటి చేసి నైతికముగా వృద్ధిపొందామా? కొద్దిగా పట్టుదల ఉన్నట్లయితే దానిని ఎవరైనను చేయగలరు. ఆవిధముగా వృద్ధిని సంపాదించినట్లయితే మనము దేవునిలో నుండి(అనగా ఆయన జీవమునుగాని లేక స్వభావన్నిగాని లేక పరిశుద్ధతనుగాని) కొంచెము కూడా పొందనట్లే. కాని నిజముగా దేవుడు మన జీవితములలో పనిచేసినట్లయితే, దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించే నిత్యజీవమనే కృపావరమును మరియు దేవుని స్వభావాన్ని ఉచితముగా పొందియుంటాము (రోమా 6:23 ). ఎట్టి పరిస్థితులలోను దేవునిస్వభావాన్ని మనము కలుగజేయలేము. మనమేమైయున్నామో (దేనిగా మార్పుచెందామో) అదంతయు కేవలము దేవుడు ఉచితముగా ఇచ్చే కృపావరము ద్వారా అయినట్లయితే, ఇంక మనలో ఎటువంటి అతిశయము ఉండదు. ఒకవేళ నీవు పాపము మీద జయముపొంది గర్వించినట్లయితే, అప్పుడు దానిని నీవే సంపాదించావన్న మాట! అలాగయినట్లయితే నీ జయము దేనికిని పనికిరాదు మరియు అది నకిలీ జయము. దానిని ఎంత త్వరగా విసర్జిస్తే అంత మంచిది. దానికి బదులుగా దేవుని జీవములోను, స్వభావములోను పాలివాడవగుచు (పొందుకొనుచూ) అంతకంతకు వృద్ధిని పొందుము. క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడవై ఆయనలో అగపడవలెనని కోరుచున్నట్లుగా పౌలు చెప్పుచున్నాడు (ఫిలిప్పీ 3:9 ).

సువార్త సందేశమంతయు రోమా పత్రికలో ప్రతి అధ్యాయములో క్రమముగా వివరించబడింది. కొన్ని అధ్యాయములు ఇక్కడ క్లుప్తంగా వ్రాయబడినవి.

* 1 నుండి 3 అధ్యాయములు :- మానవుని యొక్క పాపమును గూర్చి వివరించబడింది.

* 4వ అధ్యాయము :- విశ్వాసము ద్వారా ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుట (దేవుడే మనలను నీతిమంతులమని ప్రకటించియున్నాడు).

* 5వ అధ్యాయము :- ప్రభువైనయేసు యొక్క ప్రశస్తరక్తము ద్వారా దేవునియొద్దకు ధైర్యముతో మనము వెళ్ళెదము.

* 6వ అధ్యాయము :- మనము పాపమునకు దాసులము కాకుండునట్లు మన పాపశరీరము నిరర్ధకము చేయబడి, మన ప్రాచీనస్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది.

* 7వ అధ్యాయము :- మన క్రీస్తునే జీవించునట్లు ధర్మశాస్రము నుండియు మరియు అక్షరానుసారమైన స్థితినుండియు విడిపించబడియున్నాము.

* 8వ అధ్యాయము :- ఇప్పుడు మనము ఆత్మలో జీవిస్తూ, ప్రతిదినము పరిశుద్ధాత్మ చేత శారీరక్రియలను చంపెదము.

ఈ రక్షణను మనము అనుభవించుట ద్వారా "క్రీస్తులో అత్యధిక విజయము పొందుచున్నాము" (రోమా 8:37). ఈ రక్షణ అంతయు పొందిన తరువాత, ఇదంతయు మనమే సంపాదించుకున్నామని ఆలోచించుట చాలా ప్రమాదకరము. రోమా 8వ అధ్యాయము తరువాత 9 నుండి 11 అను మూడు అద్భుతమైన అధ్యాయములు ఉన్నవి. ఆరంభము నుండి అంతమువరకు రక్షణకార్యమంతయు దేవుడే చేస్తాడు. రోమా 9 నుండి 11 అధ్యాయములలో దేవుడు పాతనిబంధనలోని ఇశ్రాయేలు విషయములో వ్యవహరించిన విధానము చెప్పబడినప్పటికినీ, దానిని పరిశుద్ధాత్ముడు మనకు అన్వయించుకోవాలని కోరుచున్నాడు.