"పవిత్రరాలైన కన్యకనుగా క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మును ప్రధానము చేసితినని" 2 కొరింథీ 11:2,3లో పౌలు చెప్పుచున్నాడు. ఆ మార్గము(జీవితము)లో ప్రభువైనయేసు కంటే ఇంకెవరినీ వారు ప్రేమించకూడదని పౌలు ఆసక్తితో ఉన్నాడు.
అబ్రాహాము సేవకుడు రిబ్కాను 40 మైళ్ళు నడిపించి ఇస్సాకుయొద్దకు చేర్చియున్నాడు. మార్గమధ్యములో ఎవరైనా అందమైన యౌవ్వనస్థుడు రిబ్కాప్రేమను పొందాలని ప్రయత్నించినట్లయితే ఎలియేజరు ఏమి చేసియుండెడివాడు? "ఆమె నా యజమానుని కుమారునికి కొరకు ఏర్పరచబడియున్నది కాబట్టి నీవు వెళ్ళిపో" అని చెప్పియుండెడివాడు. "ఈ మనుష్యులెవరిచేతనైనను నీవు ఆకర్షింపబడకు" అని ఆమెతో చెప్పియుండెడివాడు.
ఆ విధముగా కొరింథీసంఘమును ప్రభువైనయేసు కొరకు కాపాడవలెనని పౌలు కోరియున్నాడు. అది అతని అత్యాసక్తి. "నీవు క్రీస్తు కొరకు ఏర్పరచబడి, ఎన్నుకొనబడి, నిర్ణయించబడియున్నావు. నీవు లోకముకొరకుగాని, ధనముకొరకుగాని లేక లోకఘనతకొరకుగాని బ్రతుకలేవు. ఇతరులు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆకర్షించవచ్చును. నీవైతే దేవుని కొరకే జీవించాలని నేను కోరుచున్నాను".
దేవునిప్రజలు క్రీస్తుకొరకు పవిత్రమైన కన్యకవలె కాపాడబడుటకు ఒక నిజమైన దేవునిసేవకుడు ఆయన ప్రజల విషయములో అటువంటి ఆసక్తి కలిగియుంటాడు.
"సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రతనుండియు తొలగిపోవునేమో అని భయపడుచున్నానని" చెప్పుచున్నాడు.
నీవు భక్తిలో వెనక్కు తగ్గియున్నావని ఏవిధముగా తెలుస్తుంది? నీవు తప్పిపోయావని నీకు ఏవిధముగా తెలుస్తుంది? తప్పుడు సిద్ధాంతమును నీవు నమ్మినప్పుడు తెలుస్తుందా? 3వ వచనము ప్రకారము ప్రభువైనయేసుక్రీస్తు యెడల నీ భక్తి, ప్రేమ కోల్పోయినప్పుడే నీవు తప్పిపోయావు. తప్పిపోవుటకు గుర్తు అదియే. ప్రభువైనయేసుక్రీస్తు యెడల భక్తిని, ప్రేమను కోల్పోయిన ప్రతివిశ్వాసి ఇప్పటికే తప్పిపోయియున్నాడు. ప్రభువైనయేసుక్రీస్తు యెడల భక్తిలోను, ప్రేమలోను విశ్వాసులను కాపాడుటయే దేవుని సేవకులపని. అది ఎంతో ముఖ్యమైయున్నది. ప్రభువైనయేసును పూర్ణహృదయముతో ప్రేమించుటనుండి విశ్వాసులను ఎలాగైనా తప్పించాలని సాతాను ప్రయత్నిస్తాడు. ప్రభువైనయేసుక్రీస్తు యెడలనున్న ప్రేమను కోల్పోయి, సువార్త చెప్పుట, బోధించుట, సంఘము కట్టుట మొదలగు పరిచర్యలు చేసినప్పటికీ ఏమి ప్రయోజనం?
"మొదటిప్రేమ కోల్పోయి ఎన్ని మంచి పనులు(పరిచర్యలు) చేసినను ఏమి ప్రయోజనం? నీ సేవ నాకు అవసరం లేదు" అని ప్రభువైనయేసు ఎఫెసీ సంఘానికి చెప్పియున్నాడు. నీవు క్రీస్తును మొదటిప్రేమతో ప్రేమిస్తూ మరియు ఇతరులను కూడా ఆ విధముగా నడిపించుము.