వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము
WFTW Body: 

మన కూటములలో దేవుడు ఉన్నయెడల, ఆయన మనతో శక్తివంతముగా మాట్లాడుటను వినెదము. ప్రవచనమనగా అర్ధమిదియే.

పాతనిబంధన కాలములో, ప్రవచనమనగా "భవిష్యత్తులో జరుగబోయేవి ముందుగా చెప్పుట" మరియు ప్రజలు ఏమి చేయవలసియున్నదో దానిని చెయ్యుటకు వారిని నడిపించుట. కాని ఇప్పుడు క్రొత్త నిబంధనలో ప్రవచనమనగా హెచ్చరించుట (ప్రజలను సవాలు చేయుట, గద్ధించుట మరియు సరిచేయుట), ఓదార్చుట (ఆదరించుట మరియు ప్రోత్సహించుట) మరియు క్షేమాభివృద్ధి కలుగజేయుట (విశ్వాసులు సంఘముగా కట్టబడుటకు) (1 కొరింథీ 1:3).

సంఘము కట్టబడుటకు ప్రవచించుట అనునది ఆత్మయొక్క ముఖ్యమైన వరము. ప్రవచనా వాక్యము “చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైయున్నది”(2 పేతురు 1:19). సంఘములో ఎల్లప్పుడు ఈ వెలుగులేనియెడల, సాతానుయొక్క తంత్రములను తప్పించుకొనుట అసాధ్యము. అలాగైతే సంఘమే చీకటిలోనికి వెళ్ళును. మంచిగా ఆరంభించి అనేక క్రైస్తవ సమాజములు ప్రవచనావరము లేనందున కొంతకాలానికి దిగజారి పోవుచున్నవి.

పాతనిబంధన కాలములో ఎప్పుడైనా దేవుని సన్నిధి వారిని విడిచినయెడల “ఇకను ప్రవక్త లేకపోయెను” (కీర్తనలు 74:1,9) ఏలీ దినములలోవలె, ప్రవక్తలేని ప్రతిసారి ఇశ్రాయేలీయులు దిగజారిపోయిరి(1 సమూయేలు 3:1). సమూయేలు దినములలోవలె, ప్రవక్త ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఉన్నత స్థాయికి వెళ్ళేవారు (1 సమూయేలు 3:20). సమూయేలు ద్వారా దావీదు, ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించబడ్డాడు. అది ఇశ్రాయేలు చరిత్రలో మహిమకరమైన సమయమైయున్నది. సమూయేలు ప్రవచించినప్పుడు, “అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు” (1 సమూయేలు 3:19).

సంఘములో మనముకూడా ప్రవచించినప్పుడు అందులో ప్రతిమాట ప్రజలహృదయములలోనికి బాణమువలె వెళ్ళునట్లు ప్రార్ధించవలెను. ప్రవచనముద్వారా, “హృదయ రహస్యములు బయలుపడును” (1 కొరింథీ 14:25). ఆ విధముగా సంఘములోని ప్రతిఒక్కరు పాపముయొక్క మోసముమీద వెలుగును పొందుదురు.

“పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు ప్రతిదినము (సంఘములో) ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి” అని ఆజ్ఞాపించబడియున్నాము (హెబ్రీ 3:15). బాహ్యపాపములు ఉన్నవి మరియు కనబడని రహస్యపాపములు ఉన్నవి. కాని ప్రవచనాత్మ పాపముయొక్క మోసమును మరియు సాతాను తంత్రములను బయలుపరచి, వాటినుండి మనలను కాపాడును.

పాతనిబంధనలో దాని ఉదాహరణ చూస్తాము. ఆరాము రాజు ఇశ్రాయేలుతో యుద్దము చేయుటకు, తన సైనికాధికారులతో రహస్యముగా ప్రణాళిక వేసినప్పుడెల్లను, ఎలీషా ప్రవచనము ద్వారా ఇశ్రాయేలు రాజునకు బయలు పరచబడినది (2 రాజులు 6:8-12).ఆ విధముగా దేశమును రక్షించుటకు సైన్యమును ఎక్కడ ఉంచవలెనో ఇశ్రాయేలు రాజు తెలుసుకొనుటద్వారా దేశము అనేకసార్లు కాపాడబడినది.

ఆవిధముగా రాబోయే రోజులలో సాతాను ఎక్కడెక్కడ మనలను పడగొట్టుటకు ప్రయత్నిస్తున్నాడో ముందుగా సంఘ కూటములలో ప్రవచనము ద్వారా ప్రభువు మనలను హెచ్చరించును. కాబట్టి అట్టి విషయాలలో మనము జాగ్రత్త పడగలము. తన గురించి చెప్పబడిన ప్రవచనములనుబట్టి సాతానుకు వ్యతిరేఖముగా మంచిపోరాటము పోరాడవలెనని, పౌలు తిమోతిని ప్రోత్సహించెను (1 తిమోతి 1:8).

బెంగుళూరు సంఘములోని సహోదర సహోదరీలు, వారికి వ్యతిరేఖముగా సాతాను తంత్రములను ముందుగానే కూటములలో ప్రవచనములద్వారా వారికి తెలియజేయబడినవి. వ్యక్తిగత, కుటుంబ మరియు సంఘ జీవితమునకు కావలసిన జ్ఞానమును, ప్రవచనాత్మకమైన వాక్యముద్వారా సంఘములోని ప్రతిఒక్కరికి ఇవ్వబడినది. సామెతలు 24:3,4 లో ఇట్లు చెప్పుచున్నది “జ్ఞానమువలన ఇల్లు కట్టబడుచున్నది. వివేచనవలన అది స్థిరపరచబడును. తెలివిచేత దానిగదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును”. అభిషేకించబడిన బోధకులు దేవుని వాక్యమును బోధించుటద్వారా సంఘములో తెలివి కలుగును. కాని జ్ఞానముతో ఇల్లు కట్టబడిన తరువాత, ఇంటిలో తెలివిచేత సామానులు అమర్చబడును.

మన సంఘములలో కేవలము బైబిలును మాత్రమే తెలుసుకొని ఉంటే అది గోడలు, పైకప్పు మరియు క్రింద బండలు కూడాలేని (అనగా ఇల్లు లేని) ఖాళీ స్థలములో ఖరీదైన సామానులు అమర్చినట్లు ఉండును. అందువలన క్రొత్త నిబంధనలో మొదటిగా జ్ఞానమును వెదకి, వెంటాడవలెనని హెచ్చరించబడియున్నాము. “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను. ఆయన ఎవనిని గద్దింపక అందరికినీ ధారాళముగా దయచేయును” (యాకోబు 1:5). జ్ఞానముద్వారా సంఘము కట్టబడును. "ప్రవచనావరము" ద్వారా దేవుని జ్ఞానము సంఘములోనికి వచ్చును.

అందువలన ప్రతిసంఘ కూటములో “విశేషముగా ప్రవచనావరమును అపేక్షించాలి” (1 కొరింథీ 14:1,5). సువార్త మరియు బైబిలును గూర్చిన కూటములు మంచివేకాని క్రీస్తుకు పవిత్రమైన సాక్షిగా సంఘము కట్టబడుటకు ప్రవచనాత్మకు మొదటి స్థానము ఇవ్వవలెను.