సత్యము ఒక పక్షివంటిదని దానికి రెండు రెక్కలున్నవని ఒకరు చెప్పారు- ఆ రెండు రెక్కలు ఏవనగా: "వ్రాయబడియున్నది", మరియు "మరియొక చోట వ్రాయబడియున్నది". మీరు ఒక రెక్కనే కలిగియుండిన యెడల మీరు నిరంతరము వలయాకారములో తిరుగుచు బహుశా తప్పిపోయే అవకాశమున్నది. కాని మీరు రెండు రెక్కలను కలిగియుండిన యెడల మీరు ముందుకు కదులుదురు. ఈ ప్రశ్నకు సమాధానమును పరిగణించండి: యేసు సిలువపైన ఎందుకు మరణించెను? ఆ ప్రశ్నకు సాధారణమైన సమాధానము: "క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను" అని వ్రాయబడియున్నది (1 కొరింథీ 15:3). కాని అది సత్యములో సగము మాత్రమే. సత్యమును పూర్తిగా పొందుటకు మనము మరో లేఖనమును చూడవలెను. "జీవించు వారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు క్రీస్తు మృతిపొందెను"(2 కొరింథీ 5:15). ఈ రెండు లేఖనములను మనము కలిపినప్పుడు మాత్రమే, మనకు సత్యము యొక్క రెండు రెక్కలు దొరుకును. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెనని మనము చదివినప్పుడు, పాపమంటే ఏమిటో మనము అర్ధము చేసుకోవలెను.
మనము దేవునిగూర్చి, లేఖనములనుగూర్చి మెరుగైన జ్ఞానమును పొందినప్పుడు పాపమంటే నరహత్య, వ్యభిచారము, దొంగతనము మొదలగునవి మాత్రమే కావని మనము గ్రహించెదము. ఒకడు తన కొరకు తానే జీవించుటయే పాపము. మన కొరకే మనము జీవించినయెడల, మనము ఎన్ని చెడు అలవాట్లను మానివేసినను మనము ఇంకను పాపములో జీవించుచున్నాము "ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను"(2 కొరింథీ 5:17). నీవు నీ జూదమాడుటను, పొగత్రాగుటను, మద్యము సేవించుటను విడిచిపెట్టియుండవచ్చును గాని, నీ కొరకు నీవు జీవించుట అనే పాపము యొక్క మూలకారణ విషయములో మారుమనస్సు పొందియుండకపోవచ్చును. కాని నీ చెవులు నిమిరి నీవు ఇంకను రక్షింపబడియున్నావని చెప్పే బోధకులు ఈనాడు అనేకమంది ఉన్నారు.
సాతాను విశ్వాసులను మోసము చేసిన అతిగొప్ప మోసాలలో ఇది ఒకటి-అది ఒక వ్యక్తి తన కొరకు తాను జీవించుట కొనసాగించినప్పటికీ రక్షింపబడి తన జీవితము చివరిలో పరలోకము వెళ్లవచ్చని వారి నమ్మించుట. తన జీవితమును నాశనము చేసే కొన్ని చెడు అలవాట్లనుండి ఒక వ్యక్తి తిరిగియుండవచ్చును. కాని అది అతడు భూమి మీద తన ప్రాణమును కాపాడుకొనుటకు ప్రయత్నించుచున్నాడని మాత్రమే అది సూచించవచ్చును. "ధూమపానము ఆరోగ్యానికి హానికరము" అనే చట్టపరమైన హెచ్చరిక సిగరెట్టు ప్యాకెట్లన్నిటి మీద ఉండును. గనుక ప్రజలు పొగత్రాగరు. అదే కారణము చేత, ప్రజలు మద్యపానము సేవించకపోవచ్చు లేక జూదమాడకపోవచ్చు. ఎయిడ్స్ వ్యాధి సోకుతుందేమోనన్న భయము చేత వారు వ్యభిచరింపకపోవచ్చు. కాని బైబిలు పరంగా అట్టివారు మారుమనస్సు పొందలేదు.
2 థెస్సలోని 1:9లో మారుమనస్సు "విగ్రహములను విడిచిపెట్టి, దేవునితట్టు తిరుగుట"గా వర్ణింపబడినది. విశ్వాసులుగా పిలువబడే అనేకమంది వారి విగ్రహాలనుండి దేవుని తట్టు తిరుగలేదు. భారతదేశములో, అన్యులలో అనేకమంది క్రీస్తును తమ దేవునిగా అంగీకరించుటకు సంతోషపడుదురు-కాని వారు అప్పటికే ఆరాధించు అనేకమైన విగ్రహాలకు అదనంగా మరొక దేవునిగా ఆయనను అంగీకరింతురు. ఇది అసాధ్యమని మనకు తెలుసు. క్రీస్తును అంగీకరించినవాడు ఇతర దేవతలను విగ్రహాలను విడిచిపెట్టవలెను.
యేసు వచ్చునప్పుడు, ఆయన గొడ్డలిని వేరుయొద్ద నుంచునని బాప్తీస్మమిచ్చు యోహాను చెప్పెను. యేసు గొడ్డలిని ఉంచుటకు వచ్చిన వేరు ఇదే:-మనకొరకు మనము జీవించుట మరియు మన స్వంత చిత్తమును చేయుటకు ఆశించుట. చెట్టునుండి అప్పుడప్పుడు మనము చిన్న చెడ్డ ఫలములను మనము కత్తిరించవచ్చును. కాని అది సమస్యలను పరిష్కారము కాదు.
పాతనిబంధన దేవాలయము, అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకుని దేవునికి అర్పించిన ప్రదేశములో, మోరీయా పర్వతము మీద కట్టబడెను (2 దినవృత్తా. 3:1). ఆ సమయములో అబ్రాహాముకు ఒక్క కుమారుడు మాత్రమే మిగిలియుండెను. అతడు తన ప్రియకుమారుడైన ఇస్సాకు. దేవుడు ఆ దినమున అబ్రాహాము జీవితములో ఇస్సాకు ఒక విగ్రహముగా మారెనా అని చూచుటకు అబ్రాహాము యొక్క భక్తిని పరీక్షించెను. ప్రభువుని సేవించుటకు అతడు తన విగ్రహారాధన అంతటినుండి వెనుదిరగవలెనని అబ్రాహాముతో చెప్పెను. కాబట్టి అతడు తన కుమారుని బలిపీఠము మీదపెట్టి అర్పించవలసివచ్చెను. దేవుడు ఇస్సాకును తీసుకొనిపోలేదు ఎందుకనగా అబ్రాహాము తనతో నడచుటకు ఆటంకముగా ఉండబోయే ఇస్సాకు పట్ల అతనికున్న అసహజమైన అనుబంధము నుండి అతనిని వేరుచేసెను. దేవుడు మనలోకూడా అదే చేయవలెను. మనకు ఎంతో అమూల్యమైన దానిని మనము విడిచిపెట్టవలెను. ధనికుడైన యౌవ్వన అధికారి విషయములో అది అతని డబ్బు. దేవుడు అబ్రాహామును ఇస్సాకును త్యజించమని అడిగినట్లే, ఆయన ధనికుడైన యౌవ్వన అధికారిని తన డబ్బును త్యజించమని అడిగెను. మనకు తెలిసినంతవరకు ఆ ధనికుడు "అవును ప్రభువా, అంతయు తీసుకొనుము" అని చెప్పియుండిన యెడల, దేవుడు అబ్రాహాముతో ఇస్సాకును ఉంచుకోమని చెప్పినట్లు, అతనితో తన డబ్బును ఉంచుకోమని చెప్పియుండవచ్చును కాని అతడు దానిని మొదట ఇచ్చివేయవలసియుండెను.
"ప్రభువా, నా జీవితములో ఎటువంటి ఇస్సాకులున్నప్పటికీ, వాటినన్నిటినీ బలిపీఠముమీద పెట్టి వాటినన్నిటినీ నీకు సమర్పింతును. నీకు నాకు మధ్య వచ్చే ఎటువంటి విగ్రహాలు నా జీవితములో నాకు వద్దు. నా కొరకు నేను జీవించాలని కోరుకొనుటలేదు. నేను నిజముగా నీకొరకు మాత్రమే జీవించాలనుకొనుచున్నాను. నేను దేవునిమహిమ కొరకు జీవించాలనుకొనుచున్నాను. నా జీవితమును నేను వృథాచేయదలచుకోలేదు" అని చెప్పుటకు మనందరికీ కృప ఉండును గాక.
లోకములో శ్రేష్టమైన వార్త ఇదే: మన స్వంత ఆశలకు ఆశయాలకు బానిసలుగా ఉండి మన భూసంబంధమైన జీవితాలను వృథా చేసుకోనక్కరలేదు, కాని దేవుని మహిమకొరకు జీవించుటకు స్వేచ్ఛగా నుండి ఆ విధముగా ప్రయోజనకరమైన జీవితాలను జీవించవచ్చును. మనకొరకు మనము జీవించుట అంటే బంధకములోను సంకెళ్ళలోను జీవించుట. దేవుని మహిమకొరకు జీవించుట అంటే ఆకాశములో ఎగురు పక్షిరాజులవలే యుండుట. సువార్త యొక్క శుభవార్త ఏమిటంటే యేసు ప్రతి సంకెళ్ళను తెంచి మిమ్ములను విడుదల చేయగలడు-ఈ రోజే! గతంలో నీవు నిష్‍ప్రయోజనమైన వాటికొరకు ప్రయాసపడుచు ఎంతో సమయమును వృథా చేసియుంటే, దాని గూర్చి ఇప్పుడు నీవు ఏమియు చేయలేవు. కాని ఈ రోజు ఏది శ్రేష్టమైనదో అది చేయుటకు నీవు కొనసాగిపోవచ్చును.
మనముందు ఇంకా సమయముంది గనుక, మనము ప్రభువుతో చెప్పవలసినదేమిటంటే: "ప్రభువా, గతించిపోయిన నా జీవితపు సంవత్సరాల గురించి నేనేమి చేయలేను. కాని మిగిలిన జీవితమంతా నీ కొరకే జీవించాలని కోరుకొనుచున్నాను. నా జీవితమును వెదకి నేను పూజించే విగ్రహము ఎక్కడైనా ఉన్నదేమో చూడుము. నేను నా జీవితములో ఉన్న ప్రతి విగ్రహము నుండి వెనుదిరిగి నిన్ను మాత్రమే ఆరాధించి సేవించాలనుకొనుచున్నాను. ప్రభువైనయేసు, నా కొరకు నేను జీవించుటయనే ఈ దాగియున్న విగ్రహారాధన నుండి ప్రత్యేకముగా మారుమనస్సు పొందెదను".
ప్రభువు మనందరికీ సహాయపడును గాక!