ఒక నిజమైన దేవుని సేవకునియొక్క గుణలక్షణమేమిటనగా అతడు తన్నుతాను పవిత్రపరచుకొనుచూ ఉంటాడు (2 తిమోతి 2:20,21). క్రొత్త నిబంధనలో రెండు రకాలుగా కడుగబడుట ఉన్నవి. అందులో మొదటిది: దేవుడే మనలను పవిత్రపరుస్తాడు. ప్రభువైన యేసురక్తము ప్రతిపాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తదుర్నీతినుండి పవిత్రులనుగా చేయును (1 యోహాను 1:7,9). పాపముయొక్క నేరారోపణ అంతటినీ దేవుడు పవిత్రపరుస్తాడు. దానిని మనము చేయలేము. ప్రభువైన యేసురక్తము మాత్రమే మనలను పవిత్రపరచును. రెండవది: మనము చేయవలసిఉంది(తన్ను తాను పవిత్రపరచుకొనుట 2 తిమోతి 2:21). ఇవి ఒక నాణెమునకు ఉన్న రెండు ప్రక్కలు. గతపాపములన్నిటినుండి దేవుడు పవిత్రపరచియున్నాడు మరియు ఇప్పుడు మనం చేయుచున్న పాపములను మనము ఒప్పుకొనుటద్వారా పవిత్రపరచబడతాము.
ఇతరులను గాయపరచే ఛలోక్తులు(జోక్స్) వేసే అలవాటు నీకు ఉండవచ్చును. ప్రభువైనయేసు మాత్రం ఒక్కసారికూడా అలా చెయ్యలేదు. అప్పుడు ఇలా చెప్పండి, “ఓ యేసుప్రభువా, నా చెడ్డ అలవాటును ఒప్పుకొనుచున్నాను. నీ సహాయముద్వారా ఈ చెడ్డ అలవాటును విడిచిపెడతాను” లేక ఇతరుల విషయాలన్నియు తెలుసుకోవాలనే కోరిక నీకు ఉన్నట్లయితే, దానిని ఒప్పుకొని, పవిత్రపరచుకోవాలి. ఆ విధంగా ఒక వ్యక్తి తనను పవిత్రపరచుకొనినట్లయితే, అతడు పరిశుద్ధపరచబడిన పాత్రగా ఉండి, తనయజమానుడు వాడుకొనుటకు అర్హుడైయుండును.
నా జీవితములోను మరియు నాద్వారా దేవుడు చేయగలగిన ప్రతి సత్కార్యము చేయుటకు యోగ్యమైన పాత్రగా నేనుండాలని అనేక సం||లనుండి నాకు గొప్ప కోరిక ఉన్నది. మనం 80 లేక 90 సం||లు జీవించవచ్చును. మన జీవితాల్లోని ప్రతి సం||ము దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. అటువంటి జీవితం నీవు జీవించాలంటే ప్రతిరోజు నీపాపాలను ఒప్పుకొని, పవిత్రపరచుకోవాలి. నీలోని పనికిరాని విషయాలను చూపించమని ప్రభువును అడిగి, వాటినుండి పవిత్రపరచుకొనుము. ఆవిధంగా నీవు ఎల్లప్పుడు పవిత్రపరచుకొనుచూ ఉండుము. నీవు దీనిని తీవ్రంగా తీసుకున్నట్లయితే, నీవు యజమానునికి వాడబడే పాత్రగా ఉంటావు. సంఘములో అనేక పనికిరాని పాత్రలు ఉన్నాయి.
ఒక ఇంటిలోని అనేక పాత్రలతో క్రైస్తవులను పౌలు పోలుస్తున్నాడు, “గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమేగాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్రపరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును (2 తిమోతి 2:20,21).
కాని ఉపయోగపడుట గురించి మాత్రమే ఆలోచన చేయవద్దు. దేవునిచేత వారు వాడబడుచున్నారని చాలామంది సంతోషంగా ఉంటారు. ఒక ఇంటిలో బంగారు పాత్రలకంటే కఱ్ఱ పాత్రలనే ఎక్కువగా ఉపయోగిస్తారు. కాని ఏ పాత్రలకు విలువ ఎక్కువ ఉంటుంది? నీవు కేవలం వాడబడటం గురించేనా లేక ఆత్మీయంగా నీవు ఎంత వృద్ధిపొంది ఎంత పరిణితి చెందియున్నావనే దానిగురించి ఆలోచిస్తున్నావా? ఆయన పనిలో నీవు ఎంతగా వాడబడుచున్నావనే దానికన్నా నీవు ఆత్మీయంగా ఏమైయున్నావనేది ముఖ్యమైయున్నది. దేవుడు తనపనిలో చాలామందిని (అపవాదినికూడా) వాడుకుంటాడు. పౌలు శరీరములో ఒకముల్లు, సాతాను దూతగా ఉంచబడింది. పౌలును దీనుడుగా ఉంచుటకు దేవుడు వాడుకున్నాడు. దేవుడు బిలామును వాడుకున్నాడు. సొలోమోనును లేఖనములు వ్రాయుటకు కూడా దేవుడు వాడుకున్నాడు కాని తరువాత అతడు నరకానికి వెళ్ళాడు. కాబట్టి దేవుడు నిన్ను వాడుకొనుచున్నాడని నీవు అతిశయించవద్దు. ప్రభువైన యేసునామములో ప్రవచించి మరియు అద్బుతాలుచేసిన వారిని క్రీస్తుదినమందు వారిని నాయొద్దనుండి పొండని చెప్పును (మత్తయి 7:22,23). కాబట్టి దేవునిచేత వాడబడుట ముఖ్యమైన విషయంకాదు. నీవు ఎంతవరకు క్రీస్తును సంపాదించుకొని, క్రీస్తుని కలిగియున్నావు? నీవు బంగారు పాత్రవేనా?
ఒక ఇల్లు కాలిపోవుచున్నప్పుడు ప్రజలు అందులోని బంగారు, వెండి పాత్రలను తీస్తారు గాని మంటి పాత్రలనుకాదు. అలాగే లోకము కాలిపోవునప్పుడు జరుగుతుంది. “నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయసంపాద్యమైయుందురు; తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు” (మలాకి 3:17). ఇప్పుడు నీవు కేవలం మంటిపాత్రవై యున్నప్పటికీ నీలో ఉన్న క్రీస్తుకానిదానంతటినుండి పవిత్రపరచుకొనుచూ, అంతకంతకు క్రీస్తు ఆత్మతో నింపబడినయెడల నీవు బంగారు పాత్రవు కాగలవు.
నిన్ను నీవు పవిత్రపరచుకోవాలంటే మొదటిగా చేయవలసినవాటిలో ఒకటి, యౌవ్వనేచ్ఛలనుండి నీవు పారిపోవాలి (2 తిమోతి 2:22). 45 సం||లున్న దైవజనుడు తిమోతికూడా, యౌవ్వనేచ్ఛలనుండి పారిపోవలసియున్నది. ఈ శోధననుండి తప్పించుకొనుటకు మార్గము ఆ శోధననుండి పారిపోవటమే అని పౌలు తిమోతికి చెప్పుచున్నాడు. ఈ వయస్సులో ఆశోధన రాదని అతడు తలంచకూడదు. నీకు 45సం||లు ఉన్నవి కాబట్టి ఈ శోధన రాదనుకోవద్దు. నీవు ఆపాపములలో ఈడ్చుకొనబడి మరియు నీ పరిచర్య పాడవకుండునట్లు జాగ్రత్తపడుము.
పవిత్ర హృదయముతో ప్రభువునకు ప్రార్ధన చేయువారితో (ప్రభువునామమును పిలుచువారితో) కలసి నీతిని వెంటాడుము (2 తిమోతి 2:22). అనగా, పవిత్రత కొరకు వెదకువారితో మనం సహవాసం చేయాలి వారితో కలసి ప్రార్ధించాలి. హృదయపూర్వకంగా పవిత్రతను కోరేవారే మనకు శ్రేష్టమైన స్నేహితులు. చాలామంది విశ్వాసులకు దేవుని గురించిన ఆకలిదప్పులు లేవు. కాని మనం పవిత్రమైన జీవితం జీవించుటకు వెదికేవారితో మనం ఎక్కువగా సహవాసం చేయాలి.
ఒక వ్యక్తి శుద్ధ హృదయము కలిగియున్నాడని మనకు ఏవిధంగా తెలుస్తుంది? తమ హృదయంలో నిండియున్నదానినిబట్టి ప్రజలు మాట్లాడెదరని ప్రభువు చెప్పారు (మత్తయి 12:34). ఒక వ్యక్తి ఎల్లప్పుడు ఏ విషయం మాట్లాడుటకు ఇష్టపడతాడో అతని హృదయం దానితో నింపబడియున్నదని మనం తెలుసుకొనవచ్చును. అతడు ఎల్లప్పుడు సిరిసంపదలు, వస్తువాహనాల గురించే మాట్లాడుచున్నట్లయితే, అతని హృదయం ధనసంబంధమైన తలంపులతో నిండియున్నది. కాని, ఒక వ్యక్తి ఎక్కువగా ప్రభువైన యేసును గురించే మాట్లాడుటకు కోరినట్లయితే, అతడు ప్రభువుతో నింపబడియున్నాడని మనకు తెలుస్తుంది. క్రీస్తుని పోలి(క్రీస్తునే) జీవించాలనుకొనేవారితో నేను సహవాసం చేయాలనుకొనుచున్నాను. మనం ప్రభువును ప్రేమించినప్పుడు, ప్రభువు గురించి మాట్లాడుటకు ఇష్టపడతాం. ప్రభువుకొరకు ఫలభరితమైన పరిచర్యకు ఇదే రహస్యము.