వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   నాయకుడు
WFTW Body: 

మలాకీ 2:5-6 లో మలాకీ తనకాలములో ఉన్న లేవీయులను పాతకాలములో ఉన్న లేవీయులతో పోల్చుతున్నాడు. వారి సమస్తమును విడిచి ప్రభువును వెంబడించిన ఆదిమ అపోస్తలులను ప్రభువు ఈనాడు మనకు జ్ఞాపకము చేయుచున్నాడు. "వారితో మిమ్మును పోల్చుకొనుడని" ప్రభువు మనతో చెప్పుచున్నాడు. "దేవుని జీవమును మరియు సమాధానమును వారిలోనికి తీసుకురావలెననునదియే నేను లేవీయులతో చేసిన నిబంధన యొక్క ఉద్దేశ్యమని దేవుడు చెప్పుచున్నాడు. నాయెడల వారిలో భయభక్తులు పుట్టించుటకే వారికి దేవుని జీవమును మరియు సమాధానమును ఇచ్చితిని. వారు యధార్థత కలిగి నుడుచుకున్నారు". నిజమైన దేవుని సేవకులకు ఉండవలసిన ఏడు లక్షణములను లేవీయులు కలిగియున్నట్లుగా మనము 5,6 వచనములలో చూడగలము.

1. దేవునియెడల వారు భయభక్తులు కలిగియున్నారు.

దేవునియెడల భయభక్తులే జ్ఞానమునకు మూలము (అనగా అ, ఆ లు).

2. దేవుని నామము ఘనపరచబడాలని వారు కోరియున్నారు.

"నీ నామము పరిశుద్ధపరచబడునుగాక" అని ప్రార్ధించమని ప్రభువైనయేసు నేర్పించారు. మనదేశములో ప్రభువైనయేసు నామము ప్రకటించబడునట్లు, మహిమపరచబడునట్లు మనలో గొప్ప ఆసక్తి ఉండాలి.

3. వారు దేవుని సత్యమంతటినీ బోధించారు.

ప్రజలలో వారికి గుర్తింపురాదని అనేకమంది బోధకులు దేవుని సంకల్పమంతటినీ బోధించరు. కొన్ని విషయాలలో వారు రాజీపడతారు. ఒకసారి కూటములలో ఒక్కడినే మాట్లాడుటకు నన్ను ఆహ్వానించారు. వారిలో కొందరు అభ్యంతరపడతారని, ఆ కూటములలో నీటిబాప్తిస్మము గురించి మాట్లాడవద్దని ఒకవారము ముందుగా వారు నన్ను అడిగియున్నారు. అట్లయినట్లయితే వేరోక బోధకుని పిలుచుకొనమని వారికి వ్రాసియున్నాను. నేను ఏది మాట్లాడవలెనో లేక ఏది మాట్లాడకూడదో, కూటములు నిర్వహించేవారే చెప్పినట్లయితే అటువంటి ఆహ్వానాన్ని అంగీకరించనని వారికి చెప్పాను. దేవుని సేవకునిగా, ఆయన నా హృదయములో ఏ విషయాన్ని ఉంచితే దానినే మాట్లాడెదను.

4. వారు పాపాన్ని ద్వేషించారు.

వారు అబద్ధములు చెప్పలేదు లేక మోసగించలేదు. వారి హృదయాలలో పాపాన్ని ద్వేషించారు.

5. వారు దేవునితో నడిచారు.

వారు ప్రతిదినము దేవునితో నడిచారు.

6. వారు యధార్ధముగా జీవించారు.

ధనము విషయములోను, ప్రవర్తన విషయములోను వారు కపటము లేకుండా యధార్ధముగా ఉన్నారు.

7. వారు దోషమునుండి అనేకులను త్రిప్పియున్నారు.

ఒక మంచిబోధకుడు ఏవిధముగా ఉండవలెనో ఈ వచనములలో బాగుగా వివరించబడింది.

"యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను"(మలాకీ 2:7). మనము మొదటిగా ప్రభువు దగ్గరకు వెళ్ళి, ప్రార్ధించి, వాక్యాన్ని పొందుకొని అప్పుడు ప్రజలదగ్గరకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలి. ప్రసంగీకుడు తన నోటిలో దేవుని వాక్యాన్ని కలిగియుండాలి. కాని ఈనాడు అనేకులున్నట్లుగానే ఆ లేవీయులు మార్గము తప్పి, వారి బోధద్వారా ధర్మశాస్త్రము విషయములో అనేకులను అభ్యంతరపరచారు(మలాకీ 2:8,9).