పాతనిబంధనలో ఇశ్రాయేలీయులు కేవలము మోషే మరియు ప్రవక్తలు, దేవుని యొద్దనుండి పొందుకొని వ్రాసిన దేవునివాక్యమును మాత్రమే వెంబడించగలిగియున్నారు. పాతనిబంధనలో ఎవరైనను అనగా గొప్పప్రవక్తలైన మోషేగాని లేక ఏలియాగాని లేక బాప్తిస్మమిచ్చు యోహానుగాని "నన్ను వెంబడించండని" చెప్పలేకపోయారు. దేవునివాక్యము మాత్రమే వారి త్రోవకు దీపమైయున్నది (కీర్తనలు 119:105).
కాని ప్రభువైనయేసు వచ్చి, క్రొత్తనిబంధనను ఆరంభించియున్నారు. ఇప్పుడు మనము వెంబడించుటకు వాక్యముతోపాటు ఆయన జీవితము మనకు మాదిరిగా ఉన్నది. బైబిలులో ఆయన "నన్ను వెంబడించుడి" అని చెప్పిన మొదటివ్యక్తి (మత్తయి 4:19; యోహాను21:19; లూకా 9:23). కాబట్టి క్రొత్తనిబంధనలో మనలను నడిపించుటకు వాక్యమైయున్నయేసు శరీరమును ధరించుకొని వచ్చి, వ్రాయబడిన వాక్యాన్ని తాను జీవించి, ఆయన జీవితము ద్వారా వాక్యాన్ని బయలుపరచియున్నాడు.
కేవలము వాక్యమును పరిశోధించి, జీవము పొందుటకు తనయొద్దకు రానటువంటి పరిసయ్యులను ఆయన గద్దించారు, "లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు(యోహాను 5:39,40). వ్రాయబడిన వాక్యము మాత్రమే కాదుకాని ప్రభువైనయేసుయొక్క జీవితము మన త్రోవకు వెలుగైయున్నది(యోహాను 1:4). ఒక విషయములో మనము దేవునివాక్యములో నుండి వివరణను పొందలేనట్లయితే, మనము ప్రార్ధనద్వారా యేసువైపు చూచినప్పుడు పరిశుద్ధాత్ముడు దానిని మన హృదయములలో బయలుపరుస్తాడు మరియు మనము ఎల్లప్పుడు జవాబు పొందెదము.
క్రొత్తనిబంధనలో ఇంకను పరిశుద్ధాత్మచేత ప్రేరేపించబడి పౌలులాంటి దైవజనులు కూడా "నేను క్రీస్తును వెంబడించినట్లు - మీరును నన్ను వెంబడించుడి" అని చెప్పుచున్నారు. క్రీస్తుయొక్క అడుగుజాడలలో నడుచుకొనే నిజమైనదైవజనులను మనము వెంబడించాలని చెప్పుటకు, పరిశుద్ధాత్ముడు ఆ విషయాన్ని మూడుసార్లు వ్రాయించాడు(1 కొరింథీ 4:16, 11:1; ఫిలిప్పీ 3:17).
ఒక నిజమైన క్రొత్తనిబంధన సేవకుడు వ్రాయబడిన వాక్యములోని దేవుని ప్రమాణాలను ప్రకటించుట మాత్రమేగాక పౌలువలె, "నేను క్రీస్తును వెంబడించినట్లు మీరు నన్ను వెంబడించుడి" అని చెప్పును.
కొందరు క్రైస్తవులు ఈలాగు చెప్పుదురు, "మనము ఏ మనుష్యుని వెంబడించకూడదు, ప్రభువైనయేసునే వెంబడించాలి". అది ఒక ఆత్మీయమైన మాటగా ఉన్నది. కాని అది దేవునివాక్యానికి పూర్తిగా విరుద్ధముగా ఉన్నది. ఎందుకనగా మనము చూచినట్లుగా, పరిశుద్ధాత్మచేత ప్రేరేపించబడిన పౌలు అతనిని వెంబడించమని చెప్పాడు.
కొరింథీలో ఉన్న క్రైస్తవులకు పౌలు ఆత్మీయతండ్రిగా ఉన్నాడు కాబట్టి, వారిని తనను వెంబడించమన్నాడు. అతడిట్లన్నాడు, "క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమందియున్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తుయేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను"(1 కొరింథీ 4:15,16 ). తన జీవితములో మంచి మాదిరిగా లేని బైబిలు బోధకుని, అతని బోధ సరిగాను మరియు మంచిగాను ఉన్నప్పటికీ ఒకడు వెంబడించలేడు. పై వచనము ప్రకారము పదివేలమంది ఉపదేశకులకంటే ఒక ఆత్మీయతండ్రి ఎంతో శ్రేష్టము. కాబట్టి తాము వెంబడించుటకు పౌలువలె ఆత్మీయతండ్రి క్రైస్తవులందరికీ ఉండుట మంచిది. అటువంటి ఆత్మీయతండ్రిని వెంబడించుట వలన పాపమునుండియు మరియు తప్పుడు బోధలనుండియు మనము రక్షింపబడుదుము.
మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొను వేరేవారిని కూడా వెంబడించమని పౌలు చెప్పుచున్నాడు, అనగా "క్రీస్తు మాదిరిని వెంబడించుచున్నవారు". అతడిట్లన్నాడు, "సహోదరులారా, మీరు నన్ను పోలినడుచుకొనుడి. మేము మీకు మాదియైయున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి"(ఫిలిప్పీ 3:17).
మనము మన పెద్దలకు విధేయులమై మరియు వారి విశ్వాసాన్ని అనుసరించాలి. "మీ నాయకులయొక్క మాట విని మరియు వారికి లోబడియుండుడి"(హెబ్రీ 13:17). మీకు దేవునివాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి(హెబ్రీ 13:7).
మనము వేరేవారు చేసే పరిచర్యను అనుసరించము ఎందుకనగా దేవుడు తన బిడ్డలలో ప్రతిఒక్కరికీ ప్రత్యేకమైన పరిచర్యను అనుగ్రహిస్తాడు. మానవశరీరములోని అవయవములు వేరేవేరే పనులు కలిగియున్నట్లు క్రీస్తు శరీరములోని అవయవములు కూడా వేరువేరు పరిచర్యలు కలిగియుండును. ప్రభువైనయేసు తనను వెంబడించుటకు ప్రజలను పిలిచినప్పుడు వారు తనవలె అద్భుతములు చేయాలనిగాని లేక బోధించాలనిగాని ఆయన కోరుటలేదు. అది ఆయనయొక్క పరిచర్య అయియున్నది. ఆయన జీవించినట్లే వారు జీవించాలని పిలుచుచున్నాడు. అలాగే పౌలుకూడా క్రీస్తుని పోలినడుచుకొనమని చెప్పుచున్నాడు గాని వారివలె అనగా అపొస్తలులవలె ఉండుటకుగాని లేక రోగులను స్వస్థపరచుటకుగాని కాదు.
దైవజనులను అనుసరించి నడుచుకోవాలని పైవచనములలో పరిశుద్ధాత్ముడు మనకు ఆజ్ఞాపించుచున్నాడు. వారి గర్వమును బట్టి ఎవరైతే దైవజనులను అనుసరించరో వారు చివరకు శరీరానుసారులవుతారు లేక వారి సొంత ఆలోచన చొప్పున జీవిస్తారు. దాని ఫలితము చాలా దురదృష్టకరమైనదిగా ఉంటుంది.
తనను మరియు ఇతరదైవజనులను వెంబడించమని ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులకు చెప్పిన వెంటనే(ఫిలిప్పీ 3:17) కొందరిని వెంబడించవద్దని పౌలు చెప్పాడు, "అనేకులు క్రీస్తుసిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరినిగూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటియందే మనస్సు నుంచుచున్నారు"(ఫిలిప్పీ 3:18,19).
కాని వారు పౌలు మాదిరిని వెంబడించినట్లయితే, భక్తిహీనుల నుండి వారు కాపాడబడెదరు.
ఒక నిజమైన దైవజనుని తెలుసుకొనుటకు ఇక్కడ ఏడు పరీక్షలు చెప్పుచున్నాను.
1. అతడు దీనుడైయున్నాడా - ఎప్పుడైనను అతని దగ్గరకు వెళ్ళి సులభముగా మాట్లాడవచ్చునా? దీనత్వమును తనయొద్దనుండి నేర్చుకొనమని ప్రభువైనయేసు చెప్పారు(మత్తయి 11:29). ప్రభువైనయేసు యొద్దనుండి దీనత్వమును నేర్చుకొనినవాడే నిజమైన దైవజనుడు.
2. అతడు ధనాపేక్షనుండి విడుదలపొందియున్నాడా? మరియు నీకు తెలిసినంత వరకు అతడు ఎవరినైనను ధనమును అడుగనివాడుగా ఉన్నాడా? తన పరిచర్యకు కూడా ఒక్కరిని కూడా డబ్బును అడిగి తీసికొనని ప్రభువైనయేసు మాదిరిని అతడు వెంబడిస్తాడు. దేవుని ప్రేమించువాడు సిరిని ప్రేమించడనియు మరియు దేవుని అనుసరించువాడు సిరిని ద్వేషించుననియు ప్రభువైనయేసు చెప్పారు(లూకా 16:13).
3. అతడు తన జీవితములో పరిశుద్ధముగా ఉన్నాడా? నీకు తెలిసినంత వరకు ముఖ్యముగా స్త్రీల విషయములో తన వైఖరి సరిగా ఉన్నాదా? ఒకదైవజనుడు మోహపుతలంపులను మానుకొనుటయేగాక అతడు వాటినుండి పారిపోవును(2 తిమోతి 2:20-22).
4. అతడు వివాహితుడై మరియు పిల్లలను కలిగియున్నట్లయితే, అతని పిల్లలను దైవమార్గములో పెంచియున్నాడా? ఒక వివాహితుడైన దైవజనుడు విశ్వాసులైన పిల్లలను కలిగియుండి వారిని క్రమశిక్షణలో పెంచుతాడు(1 తిమోతి 3:4,5; తీతు 1:6).
5. అతనితో పనిచేసే సహపరిచారకులు దేవునియెడల భయభక్తులు కలిగిన దైవజనులేనా? దైవజనులు ఇతర దైవజనులను తయారుచేస్తారు. తన ఆత్మీయతండ్రియైన పౌలుతో ఉండుటద్వారా తిమోతి దైవజనుడైయున్నాడు(ఫిలిప్పీ 2:19-22).
6. స్థానిక క్రొత్తనిబంధన సంఘమును అతడు కట్టియున్నాడా (లేక ఇతరులతో కలసి కట్టుచున్నాడా)? ఆయన సంఘమును కట్టుటకు ప్రభువైనయేసు వచ్చియున్నారు(మత్తయి 16:18). సంఘముకొరకు ఆయన తన్నుతానే బలిగా అప్పగించుకొని, మరణించియున్నాడు(ఎఫెసీ 5:25). దైవజనులు ప్రజలను క్రీస్తు యొద్దకు తెచ్చుట మాత్రమేగాక వారితో స్థానిక సంఘమును కట్టుదురు.
7. అతడు నిన్ను తనకు కాకుండా క్రీస్తుకే అంటుకట్టుచున్నాడా? నీవు ఇతరులకు మాదిరిగా ఉండునట్లు, ఒక దైవజనుడు నిన్ను క్రీస్తులోనికి నడిపించును(ఎఫెసీ 4:15; 2 కొరింథీ 4:5).
పైనున్న వాటిలో ఒకదానిలోగాని లేక ఎక్కువ వాటిలోగాని అనేకమంది క్రైస్తవ నాయకులు పడిపోవుచున్నారు గనుక వారిని వెంబడించలేము.
పైనున్న లక్షణములు ఒక నాయకునిలో నీవు కనుగొనినట్లయితే, అతడు నిన్ను క్రీస్తులోనికి నడిపించి మరియు పాపమునుండియు మరియు తప్పుడు బోధలనుండియు నీవు రక్షింపబడునట్లు నీ ఆత్మీయతండ్రిగా అతనిని వెంబడించుము.