వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   శిష్యులు
WFTW Body: 

ఎంతో ఉచితముగా ప్రభువు మనకు అనుగ్రహించిన పాపక్షమాపణలో ఉన్న అద్భుతమైన దేవుని ప్రేమను మనం మరచిపోకూడదు. మనం సంపూర్ణరక్షణ పొందుటకు అవసరమైన వాటన్నిటిని కల్వరిసిలువ మీద మనకొరకు ఆయన చేసి ముగించిన దానంతటిని బట్టి జీవితకాలమంతయు మనం ప్రభువుకు కృతజ్ఞతను వ్యక్తపరచాలి. ధర్మశాస్త్రములో ప్రజలున్నప్పుడు తీర్పును గూర్చిన భయముతో ప్రభువును సేవించారు. కాని మనం దేవుని కృపలో ఉన్నాము కాబట్టి కృతజ్ఞతతో నిండినవారమై సేవ చేస్తాము.

మత్తయి 18:23-35లో ప్రభువైనయేసు శిష్యులకు ఒక ఉపమానము చెప్పారు. ఒక దయగల రాజు రూ. 30కోట్లు (రూ.3000 లక్షలు) అప్పున్న తన సేవకుడిని క్షమించాడు. అది ఎంత పెద్ద మొత్తమంటే తన జీవితకాలములోగాని లేక అనేకతరాలలో కూడా తాను చెల్లించలేని అప్పు. కాబట్టి తన అప్పు కొట్టివేయబడి, క్షమాపణ పొందినందుకు అతడు ఎంతో కృతజ్ఞత కలిగియుండాలి. కాని తాను కనికరమును, దయను పొందిన రీతిగా అతడు ఇతరులను కనికరించలేదు. తాను తన యాజమానుని దగ్గర నుండి వెళ్ళిన వెంటనే తనుకు రూ.60,000/- అప్పు పడియున్న వాని దగ్గరకు వెళ్ళాడు. ఇప్పుడు రూ.60,000/- మరీ తక్కువ మొత్తము కాదు. కాని తాను క్షమించబడిన రూ.300,000,000/- అనగా సముద్రములో ఇది ఒక నీటిబొట్టులాగా ఉన్నది. కాని అతడు ఏమి చేశాడు? అతడు "వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లింపుమన్నాడు". అతడు అప్పు చెల్లించలేక పోయినందున, అతనిని చెరసాలలో వేయించాడు. ఈ విషయము రాజుకు తెలిసిన వెంటనే కనికరములేని దాసుని పిలిపించి మరియు అతనిని "చెడ్డదాసుడా" అని పిలిచి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించువరకు బాధపరచువారికి వానినప్పగించాడు. అప్పుడు ప్రభువైనయేసు ఇలాగన్నారు, "మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయుననెను" (మత్తయి 18:35).

తన సేవకుడు కృతజ్ఞతతో కనికరము చూపాలని ఆ రాజు కోరియున్నాడు. తన సేవకుడు విశేషమైన కనికరమును పొంది కూడా కృతజ్ఞత కలిగియుండ లేకపోయాడు కాబట్టి రాజు, తనను బాధించేవారికప్పగించియున్నాడు. దేవుడు కూడా అలాగే ఉంటాడు. దేవుడు మనకొరకు చేసి ముగించినదానంతటినీ బట్టి మనం కృతజ్ఞతతో ఇతరులను క్షమించాలని ఆయన కోరుచున్నాడు. ఆ కృపాసహితమైన పిలుపుకు మనం సరిగా స్పందించనప్పుడు, మనం బాధించబడినప్పుడైనా సరిగా స్పందిస్తామని ఆయన దానిని (ధర్మశాస్త్రమును) అనుమతిస్తారు. మనలను బాధపరచు వారికి అప్పగించుట ద్వారా, మనం కూడా ఇతరులను క్షమించునట్లు మనకు నేర్పిస్తారు. చాలామంది విశ్వాసులు ఇతరులను క్షమించనందున వారు దేవుని విశ్రాంతిలో ప్రవేశింపక, నిలకడలేని వారుగాను, ఎక్కువగా నిరాశలోను, ఆముదపుముఖం పెట్టుకొని, కృంగిపోయిన వారుగాను, సహనంలేని వారుగాను ఉంటారు. బాధపరచేవారు వారిలో పని చేయుచున్నారు.

ప్రభువైనయేసు నొద్దకు పరిసయ్యులు తెచ్చిన వ్యభిచారములో పట్టబడిన స్త్రీని వాళ్ళు రాళ్ళతో కొట్టనారంభించినట్లయితే, ఆ రాళ్ళు తనమీదపడునట్లు ప్రభువు ఆమెకు ముందుగా నిలువబడి, ఇట్లనేవాడు, "మొదటిగా నన్ను చంపండి". కల్వరిసిలువ మీద ప్రభువు మనకొరకు దానినే చేశాడు. మన మీద పడవలసిన "రాళ్ళు" ఆయన మీదపడి, మనకొరకు ఆయన చంపబడుటకు అంగీకరించారు. పరిసయ్యులకు వ్యతిరేకముగా ఉండే క్రీస్తుఆత్మయే క్రొత్తనిబంధన ఆత్మ. ఎవరైతే ఈ క్రీస్తుఆత్మను కలిగియుంటారో, వారు వారి జీవితకాలమంతయు యెడతెగని సంతోషము కలిగియుంటారు.

కొన్ని సంవత్సరాల క్రితం ప్రచురించబడిన "ప్రేమనే అణుబాంబు" అనే కథలో ఒక దైవజనుని కుమారుడు కమ్యూనిష్టు చేత చంపబడ్డాడు. ఆ దైవికమైన తండ్రి తన కుమారుని చంపినవానిని వెదకి, కనుగొని అతని క్షమించుట మాత్రమేగాక అతనిని తన స్వంత కుమారునిగా చేసుకొని మరియు అతనిని పెంచి, పెద్దవాణ్ణి చేశాడు. కేవలము సిద్ధాంతం మరియు లేఖనములు తెలిసిన వారికంటే అతడు ఎంతో ఎక్కువగా "నూతనమైనదియు, జీవముగల మార్గాన్ని" ఎరిగియున్నాడు. ప్రభువైనయేసు ఆ మార్గాన్ని ఒక సిద్ధాంతముగా బోధించలేదు. ఆయన దేవునిజీవముతో నిండినవాడై ఎల్లప్పుడు జీవించారు. ఆయన తనను ద్వేషించిన వారిని ఎంతగా ప్రేమించాడనగా వారు రక్షణపొందుటకు తన స్వంతరక్తము వారికొరకు చిందించాడు. మనం కూడా ప్రభువైనయేసు జీవంతో నిండినవారమై, ఆశీర్వాదానికి వారసులముగా పిలువబడ్డాము కాబట్టి ప్రభువును వెంబడిస్తూ కీడుకు ప్రతి కీడు చేయక, మనలను శపించినవారిని దీవించుదాము. ఈ లోకము ఇతరులకు కీడు తలపెట్టే వారితోను, శపించువారితోను, ఫిర్యాదులు చేస్తూ మరియు ఇతరుల గూర్చి చెడుగా మాట్లాడేవారితోను నింపబడియున్నది. మనమెక్కడికెళ్ళినప్పటికీ మేలు చేసేవారముగాను, ఆశీర్వాదముగాను ఉండెదముగాక.