వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   శిష్యులు Religious or Spiritual
WFTW Body: 

ఎఫెసీ 6:10-18లో, సాతానుతో ఆత్మీయపోరాటము గురించి చదువుతాము. కుటుంబము గురించి చెప్పిన వెంటనే ఆత్మీయపోరాటము గురించి చెప్పబడుట గమనార్హము. సాతాను ఎల్లప్పుడు కుటుంబము మీద దాడి చేయును. మనము శరీరులతో కాక అపవాదితో పోరాడాలి (ఎఫెసీ 6:12) . మనుష్యులతో పోరాడకుండుటయే సాతానుతో పోరాడుటకు మొదటి అర్హత. అనేకమంది విశ్వాసులు సాతానుచేత ఓడించబడుటకు కారణము వారు మనుష్యులతో పోట్లాడుటయే. ఏ విషయంలోను ఏ వ్యక్తితోనైనను పోరాడకూడదని అనేక సంవత్సరముల క్రితము నేను నిర్ణయించుకున్నాను. అప్పుడు సాతానుతో యోగ్యముగా పోరాడగలనని నేను కనుగొనియున్నాను. ఏ మనుష్యునితోనైనను ఎన్నటికిని పోరాడకూడదని నీవు నిర్ణయించుకొనినట్లయితే, నీవు ఎల్లప్పుడు సాతానును జయించి, దేవుని కొరకును మరియు ఆయన సంఘము కొరకును ఫలభరితమైన పనిని చేయగలవు, దేవుడు అనుగ్రహించే సర్వాంగకవచములో అనేక ఆత్మీయ ఆయుధములు ఉండును.

వాటిలో మొదటిది సత్యమను దట్టి, సత్యమనగా యధార్ధత, నిజాయితీ, నటించకుండుట మరియు అబద్ధములు చెప్పకుండుట. నీ పాపములనుండి నీవు విడుదల పొందనట్లైతే సాతానుతో పోరాడుట గురించి నీవు మరచిపోవుట మంచిది. అపవాది అబద్ధికుడు కాబట్టి నీ అంతరంగ జీవితములో యధార్ధతలేనట్లైతే సాతాను నీతో సహవాసం చేయును. కాబట్టి నీవు స్వచ్ఛమైన జీవితము కలిగియుండి మరియు ఎల్లప్పుడు మోసం లేకుండా జీవించాలి.

రెండవది, నీతి అనే మైమరవు తొడుగుకొనుట. రెండు రకాల నీతి ఉన్నది.

  1. క్రీస్తు యొక్క నీతి మనకు ధరింపజేయబడి, దేవునిచేత మనము ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడియున్నాము.
  2. మనము ఆత్మీయముగా ఎదిగే కొలది పరిశుద్ధాత్మ ద్వారా కొంచెం కొంచెం క్రీస్తుయొక్క నీతిని పొందుకొనుచు, ఆయన నీతిలో పాలివారమగుట. దీని కొరకు మనము ఎల్లప్పుడు మంచి మనస్సాక్షి కలిగియుండి మరియు దేవుడు మనకు చూపించిన దానికి లోబడాలి.

తరువాత సమాధాన సువార్తవలనైన సిద్ధమనస్సు తొడుగుకొని నిలువబడుట. సాతానును జయించుటకు సువార్తను ప్రకటించుట ఒక మార్గమని నీకు తెలియునా? ఎవరైతే సోమరియై మరియు ఇతరులకు సువార్త ప్రకటించరో, వారు సులభంగా సాతాను చేత జయించబడతారు. కాని ఎవరైతే చురుకుగా ప్రభువు యొక్క పరిచర్య చేస్తారో వారు కాపాడబడెదరు. నా యొక్క యౌవ్వన దినములలో, ఖాళీ సమయములలో దేవునివాక్యము చదువుటద్వారాను, ఇతర విశ్వాసులతో సహవాసం చేయుటద్వారాను మరియు ఆయనను గూర్చి సాక్ష్యము చెప్పుటద్వారాను అనేక శోధనలనుండి తప్పించబడ్డాను. నేను ఒక ఉద్యోగం చేసియున్నాను. కాని ప్రతివారములో రెండుసార్లు నేను నివసించియున్న కొచ్చిన్ పట్టణములోని వీధులలో కొన్ని గంటలు సువార్తను ప్రకటించువాడను. అక్కడ నావికదళంలో నేను పనిచేసిన రెండు సంవత్సరములలో దాదాపు ఆ పట్టణములోని ప్రధాన రహదారులన్నిటిలో సువార్త చెప్పియున్నాను. సువార్త ప్రకటించుట, కరపత్రములు పంచుట, కొన్ని గృహములలో కొద్దిమందికి సువార్త చెప్పుట ద్వారా నేను అనేక శోధనలనుండి కాపాడబడియున్నాను. మనం ఏ పని చేయకుండా ఖాళీగా ఉండినట్లైతే అనేక శోధనలు వచ్చును. ఖాళీగా ఉన్న మనస్సులో సాతాను ఎక్కువగా పని చేస్తాడు. దేవునితో మనష్యులను సమాధానపరచే, సమాధాన సువార్తను ప్రకటించుటకు మనం ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలి. సాతానును జయించుటకు ఇది సహాయపడుతుందో లేదో మీరు పరీక్షించి చూడండి.

దేవుని సర్వాంగకవచములో విశ్వాసమనే డాలు నాల్గువది. దేవునియొక్క ప్రేమను మనము అనుమానించేటట్లు చేయుటయే సాతాను యొక్క అత్యంత గొప్ప ఆయుధము. ఏదేను తోటలో హవ్వ మీద ప్రయోగించిన ఆయుధము ఇదే. అందమైన పండు తినకూడదని చెప్పాడు కాబట్టి దేవుడు తనను ప్రేమించుటలేదు అనే అనుమానము హవ్వలో కలుగునట్లు సాతాను అనుమానమనే విత్తనమును ఆమెలో విత్తియున్నాడు. ఆ ఆయుధంతో ఆమె పడిపోయింది. ప్రతి పరిస్థితిలోను దేవుడు మనలను ఎంతో ప్రేమించుచున్నాడనియు మరియు అతిశ్రేష్టమైన మేలులు మనకు చేయాలని కోరుచున్నాడనియు నమ్ముటయే విశ్వాసము. మరియు మనం ఓడిపోయినప్పటికిని ఆయన ప్రేమిస్తూనే ఉంటాడని మనము తెలుసుకోవాలి. అప్పుడు దుష్టునియొక్క అగ్నిబాణములన్నిటిని అర్పగలము.

ఐదవది ఆత్మఖడ్గము, దేవునివాక్యము ద్వారా ప్రభువైనయేసు ఎల్లప్పుడు సాతానును జయించాడు. హవ్వవలె ఆయన సాతానుతో మాట్లాడలేదు. కేవలము దేవుడు చెప్పిన దానిని ఆయన సాతానుతో చెప్పాడు. ఆవిధముగా ఆయన ఎల్లప్పుడు జయించాడు. మనము శోధింపబడునప్పుడు "నేను సహింపగలిగినంత కంటే ఎక్కువగా నన్ను శోధింపబడనియ్యడు" (I కొరింథీ 10:13) , "పాపము నా మీద ప్రభుత్వము చేయదు" (రోమా 6:14) , "నేను తొట్రిల్లకుండునట్లు ప్రభువైనయేసు నన్ను కాపాడగలడు" (యూదా24). ఇటువంటి వచనములను మనము సాతానుతో చెప్పినప్పుడు ప్రభువైనయేసువద్ద నుండి పారిపోయినట్లు మనవద్ద నుండి కూడా సాతాను పారిపోవును (యాకోబు 4:7) .

చివరిగా మన ఆయుధం, ఎల్లప్పుడు ఆత్మ‍అనే నూనెతో నింపబడాలి. దానిని ఏ విధముగా చేయగలము? "ఆత్మవలన ప్రతి సమయమందును, ప్రతివిధమైన ప్రార్ధనను, విజ్ఞాపనను చేయుటద్వారా చేయగలము" (ఎఫెసీ 6:18) . ఆత్మలో ప్రార్ధన చేయుట అనగా అన్యభాషలలో మాట్లాడుట కాదు. మనము ఆత్మతో ప్రార్ధించునప్పుడు అన్యభాషలతో ప్రార్ధించగలం (I కొరింథీ 14:15). శరీరానుసారముగా కాక పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి ప్రార్ధించునప్పుడు ఆత్మతో ప్రార్ధిస్తాము. పరిశుద్ధాత్మ ద్వారా మన మనస్సు నూతనపరచబడునట్లును మరియు మన నాలుకను అదుపు చేయనట్లును, మనము పరిశుద్ధాత్మకు సహకరించే కొలది ఆత్మలో ప్రార్ధించగలము. "ప్రత్యేకముగా నాకొరకు ప్రార్ధించుడి" అని పౌలు చెప్పుచున్నాడు. ప్రభువు పక్షముగా పోరాడుచున్న దేవుని సేవకుల కొరకు ప్రత్యేకముగా మనము ప్రార్ధించాలి.

పాతాళలోకపు ద్వారము నిలువనేరకుండునట్లు దేవుడు అనుగ్రహించే సర్వాంగకవచముతో మనము క్రీస్తుయొక్క శరీరముగా నిర్మించబడాలి.