వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము క్రీస్తుయెడల భక్తి
WFTW Body: 

ప్రకటన 19:5-7లో ఈలాగు చదువగలము “మరియు మన దేవుని దాసులారా! ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి, గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహసనమునొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును,బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము-సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది; ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని”.

ప్రభువే పెండ్లి కుమార్తెను సిద్ధపరచెనని చెప్పుటలేదని గమనించవలెను. పెండ్లికుమార్తె తన్నుతాను సిద్ధపరచుకొనినట్లుగా చెప్పబడినది. ప్రభువు రాకడకొరకు మనంతటమనమే సిద్ధపడవలెను. దేవుడు వెలుగులోనున్నట్లు మనము కూడా వెలుగులో నడిచిన యెడల యేసు రక్తము ప్రతిపాపము నుండి పవిత్రపరచునని చాలా మంది విశ్వాసులకు తెలియును (1యోహాను1:7). కాని అది సత్యమునకు ఒకవైపు మాత్రమే. సత్యమునకు మరియొక ప్రక్క మనలను మనమే పవిత్రపరచుకొనవలెను. ఈ విధముగ పెండ్లికుమార్తె తన్నుతాను పవిత్రపరుచుకొనును. ఇది ప్రకటన 19:8 లో కూడా వ్రాయబడినది. “మరియు ఆమోదించుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపునార బట్టలు ఆమె కియ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు.”

“ఆమె కివ్వబడెను” అను మాటను బట్టి అది దేవుని నుండి పొందిన వరమని అర్థమగుచున్నది. ఇది మనకు పవిత్రపరచుకొనవలెననే కోరికను మరియు పవిత్రపరచుకొను శక్తిని దేవుడే వరముగా ఇచ్చునని బోధించుచున్నది. “మీరు ఇచ్ఛయించుటకు కార్యసిద్ది కలుగజేసికొనుటకును, కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే” (ఫిలిప్పీ 2:13). దానిని బట్టి మనము ఎట్టి ఘనతను పొందలేము లేక ఇతర విశ్వాసుల దగ్గర ఏవిధముగాను అతిశయించలేము. ఒక దైవజనుడు దీనుడైయుండి, తనలో ఉన్న మంచితనమంతటిని బట్టి దేవునినే మహిమ పరచును. తన శరీరమందు మంచిది ఏదియు నివసింపదని అతనికి తెలియును.

ఈ విధముగా ధరింపజేయబడుట దేవుని వరమైతే, అందరు ఎందుకు పొందుట లేదు? ఎందుకనగా తన వరములను పొందుమని దేవుడెవరిని బలవంతము చేయడు. ఆయన వాక్యమునకు ఎవరైతే స్పందించెదరో వారు మాత్రమే ఆయన వరములను పొందెదరు.

సన్నపునార బట్టలు క్రీస్తు యొక్క నీతి కాదు కాని “అవి పరిశుద్ధుల నీతిక్రియలు”. మనము మరలజన్మించిన వెంటనే క్రీస్తుయొక్క నీతి చేత ధరించ బడెదమనునది నిజము. (రోమా 4:22-24, కొరింథీ 1:30,31). కాని ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మనలో నెరవెర్చబడవలెనని” కూడా చెప్పబడినది (రోమా 8:4). “పరిశుద్ధుల నీతి క్రియలే” పెండ్లి కుమార్తె వస్త్రమైయున్నది (ప్రకటన 19:8) లో స్పష్టముగా ఉన్నది. గబ్బిలము వంటి గ్రుడ్డివారే దానిని చూడలేరు.

తన యెక్క నీతి క్రియలే ఆమె యెక్క వస్త్రము, ప్రభువు ఆజ్ఞలను తీవ్రముగా తీసుకొని తన్నుతాను పవిత్రపరచుకొనుట వలన ఆమె దానిని పొందెను. “భయముతోను మరియు వణకుతోను”(ఫిలిప్పి2:12) తన రక్షణలో కొనసాగెను. భయముతోను మరియు వణకుతోను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తన పెండ్లి వస్త్రము మీద ఒక కుట్టు వేయుచున్నది . కొన్ని సంవత్సరాలలో తన పెండ్లి వస్త్రము తయారగుచున్నది.

వీటన్నిటినీ తేలికగా తీసుకొని, ఇలాగు చెప్పు క్రైస్తవుని సంగతేమిటి. “యేసు రక్తము నన్ను పవిత్రపరచినది, కాబట్టి అంతయు బాగున్నది” . అటువంటి క్రైస్తవులకు ప్రభువు ఇలా చెప్పుచున్నారు, “ఇదిగో దొంగవలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిసమొలను చూతురేమో అని మెలకువుగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు” ప్రకటన 16:16.

పెండ్లి కుమార్తె తన వివాహమునకు దిగంబరిగా వచ్చుట ఎప్పుడైన చూచి యున్నవా? దిగంబరుడిగా కనబడకుండునట్లు జాగ్రత్తపడుమని తన ప్రజలకు ప్రభువు హెచ్చరించుచున్నారు. దిగంబరులనగా వారికి తమ నీతిక్రియలు లేవు.

బాబెలోను మోసము అనగా ధర్మవిరోధ సంబంధమైన మర్మము అనేక క్రైస్తవులకు, బాబెలోను ఈలాగు చెప్పినది “చింతంచవద్దు మీరు క్రీస్తుయెక్క నీతిని ధరించుకొనియున్నారు. మీరు ఏవిధముగా జీవించినను పర్వాలేదు”. క్రియలులేని విశ్వాసము మృతమని యాకోబు స్పష్టముగా హెచ్చరించుచున్నాడు. అటువంటి హెచ్చరికలను తీవ్రముగా తీసుకొనకుండా బాబెలోను విశ్వాసులను అడ్డగించుచున్నది.

దేవుని యెదుట మురికిగుడ్డలవలె ఉన్న మన స్వనీతికి(యెషయా 64:6) మరియు ప్రతిదినము మన సిలువ నెత్తుకొని మరియు యేసు అడుగు జాడలలో నడిచినప్పుడు, పరిశుద్ధాత్మశక్తిద్వారా పొందే నీతికి తేడా ఉన్నది. రెండవది పెండ్లివస్త్రము. మనము మొదటిగా ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు మనయొక్క స్వనీతి అను మురికి గుడ్డ మరియు పాపములతో మరియొక్కువగా మురికి గుడ్డతో వచ్చియుంటిమి. కాని మనము మరల జన్మించినప్పుడు, మెదటిగా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చి మరియు క్రీస్తుయొక్క నీతిని ధరింపజేసెను (రోమా 3:24, 4:5). అప్పుడు ఆయన ధర్మవిధులను మన హృదయములమీదను మరియు మన మనస్సుమీదను వ్రాసి (హెబ్రీ 8:10)ధర్మశాస్త్ర నీతివిధిని మన హృదయములలో నెరవేర్చును (రోమా 8:4).దీని ఫలితముగా నీతి నెమ్మదిగా మన బహిరంగ జీవితములో కనబడును మరియు మన బాహ్యస్వభావము క్రీస్తు వలె రూపాంతరము చెందును.

పెండ్లికుమార్తె వస్త్రము ప్రకాశమును, నిర్మలమును మరియు పవిత్రమైనదైయుండును. ఈమె యొక్క సామాన్య జీవితమునకును మరియు ధూమ రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని, బంగారముతోను, రత్నములతోను, ముత్యములతోను అలంకరింపబడిన వేశ్యకును ఎంత వ్యత్యాసము ఉన్నది. “పెండ్లి కుమార్తె కీర్తన” (కీర్తన 45)లో, ప్రభువు మరియు పెండ్లి కుమారుడు గురించి “ఆయన నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నాడు”(కీర్తన 45:7) అని చెప్పబడినది మరియు పెండ్లి కుమార్తె గురించి “అంతఃపురములోనుండు రాజు కుమార్తె కేవలము మహిమగలది”(కీర్తన 45:13) అని చెప్పబడినది. ఆమె సాధువైనట్టియు, మృదువైనట్టియు ఆత్మ గలది (1పేతురు3:4). మరియు ఇటువంటి అంతరంగస్వభావము (వస్త్రము) తో “ఆమె రాజునొద్దకు తీసుకొని రాబడుచున్నది”(కీర్తన 45:14). అది ప్రకటన 19:8 లో నెరవేర్చబడును.