మనము మానవరీతిగా అర్ధము చేసికొనిన దానినిబట్టి మానవ ఆలోచనను ఉపయోగించి దేవునికి సహాయము చేయుటకు ప్రయత్నించునప్పుడు దేవుని యొక్క పనిలోను మరియు మన స్వంత జీవితములలోను ఎంతో గలిబిలిని సృష్టించుకొందుము.
పాతనిబంధన నుండి మూడు ఉదాహరణలను పరిశీలించండి.
దేవుడు అబ్రాహాముతో "నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుము, నీ సంతానము అలాగవును....అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు....శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయురాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను...హాగరు అబ్రాహమునకు ఇష్మాయేలును కనెను...అబ్రాహాము- ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతకనను గ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు- నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును.... అతని తరువాత అతని సంతానము కొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను" (ఆదికాండము 15:5; 16:1,3,16; 17:18,19) అని చెప్పెను.
అబ్రాహాము సంతానము నక్షత్రముల వలె లెక్కింపజాలనంతగా నుండునని దేవుడు వాగ్దానము చేసెను. అయినప్పటికి శారా గొడ్రాలుగా నుండెను. వాగ్దానము నెరవేరనట్లయితే దేవుని యొక్క నామమునకు అవమానము కలుగునని అబ్రాహాము మరియు శారా కూడా భయపడియుందురు. గనుక శారా సలహాతో అబ్రాహాము మరియొక భార్యను తీసుకొనెను. మరియు దేవునిని యిబ్బందికరమైన పరిస్థితి నుండి తప్పించుట కొరకు ఆమె ద్వారా ఒక కుమారుని కనెను.
అక్కడ అబ్రాహాము అర్ధము చేసికొననిదేమంటే, దేవునికి అతడి యొక్క సహాయము అక్కర్లేదనే విషయము. దేవునికి అతడు చేశాననుకొనిన సహాయము (ఇష్మాయేలును కనుట) చివరకు తన భార్యకే కాక, తన కుమారుడైన ఇస్సాకునకు మరియు అతని సంతానమునకు సమస్య కలుగజేసాడు.
మన సహాయము లేకుండా దేవుని వాగ్దానములు నెరవేరవని ఎంత తరచుగా మనము అనుకొందుము. గనుక మనలను ఏదైనా చెయ్యమని దేవుడు చెప్పకపోయినా మనము చేయుదుము. మనము దేవుని పని చేయుటకు మనము మానవ నిర్మితమైన ప్రణాళికలు మరియు ప్రయత్నములపై నమ్మిక యుంచుదుము. మరియు దేవునియొద్ద మనము వేచియున్నట్లయితే, ఆయన మనలను నడిపించును అని తగినంతగా నమ్మలేకపోవుచున్నాము.
యేసుప్రభువు ఆయన జీవితములో ఎల్లప్పుడు తన తండ్రియొక్క చిత్తమును మరియు నడిపింపును వెదకకుండా ఏమియు చేయలేదు (యోహాను 5:19,30). అనేకమంది విశ్వాసులు దేవుని నడిపింపుకంటె తమపై తమకే నమ్మకముండుట చేత దేవునియొక్కచిత్తమును మరియు నడిపింపును ఆ విధముగా వెదకరు.
మనము తీసుకొనే నిర్ణయములో ప్రార్ధనా జీవితపులోటు మరియు మన స్వంతజ్ఞానముపై ఆధారపడుట (లేక అబ్రాహాము విషయములోవలె మన భార్య యొక్క వివేకముపై ఆధారపడుట) అనునవే మన కుటుంబములలో మరియు దేవుని యొక్క పనిలోను గలిబిలిని కల్పించును.
"యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను...నీవు ఆ బండతో మాటలాడుము. అది నీళ్ళనిచ్చును...అప్పుడు మోషే తనచెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా......అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నులయెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొనిపోరని చెప్పెను"(సంఖ్యాకాండము 20:7-13).
దేవుడు ఈసారి ఆ రాతితో కేవలము మాట్లాడమని మాత్రమే మోషేను అడిగెను. కాని మోషే రాతిని రెండుమారులు కొట్టుట ద్వారా దేవునికి సహాయము చేయవలెనని అనుకొనెను. ఒకసారి మృధువుగా మాటలాడుట కంటె మన శరీరము రెండుసార్లు గట్టిగా కొట్టును అను మాట ఎంత సత్యమైన విషయము. దేవుడు మనలను సాత్వికముతో నుండుమని ఆజ్ఞాపించినా సరే (మత్తయి 11:28,29),కొంచెము మానవపరమైన కఠినత చూపినట్లయితే దేవుని పని మరికొంచెము త్వరగా జరుగునని మనమనుకొందుము. కాని ఆయన యొక్క అనుగ్రహము ద్వారా దేవుడు జనులను మారుమనస్సులోనికి నడిపించును(రోమా 2:4).
దేవుడు అంతకు మునుపు ఒకమారు రాతిని కొట్టమని అడుగుట వలన (నిర్గమకాండము 17:6), ప్రతిసారి అట్లే చేయవలెనని కూడా మోషే అనుకొని యుండవచ్చును. పరిశుద్ధాత్ముడు ఇంతకుముందు లేక వేరొకచోట చేసినట్లే ఆయన ఎల్లప్పుడు పని చెయ్యాలని అనేకులు అనుకొందురు. గనుక వారు ఉజ్జీవము తెచ్చుటకు, స్వస్థతలు కలుగుటకు మరియు జనులు అన్యభాషలలో మాటలాడుటకు మానసిక చిట్కాల ద్వారా ఆయనకు సహాయపడవలెనని అనుకొందురు. వారు అర్ధము చేసికొననిదేమంటే, పరిశుద్ధాత్మ వేరు వేరు సమయములలో వ్యత్యాసముగా పనిచేయును అను విషయము మరియు ఆయన యొక్క వరములను కనపరచుటకు ఏవిధమైన మానసిక సహాయము అవసరములేదను విషయము.
"ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పునుబట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్దపడి చనిపోయెను"(2 సమూయేలు 6:6,7).
ఉజ్జా ఉద్దేశ్యములు మంచివే. అతడు దేవుని యొక్క సాక్ష్యపు మందసము జారిపడకుండా కాపాడవలెనని నిజముగా ఆశించెను కాని అతడు లేవీయుడు కాడు, గనుక మందసమును తాకుటకు అతడికి హక్కులేదు. అతడు తన పరిధి దాటి బయటకు వెళ్ళెను. ఇది దేవుడు మొత్తేటంతటి తీవ్రమైన విషయం. దేవుని యొక్క ఆజ్ఞలను మనము చిన్న విషయముగా తీసుకొనకూడదు.
సంఘములో కూడా దేవుడు వేరు వేరు బాధ్యతలను వేరు వేరు వ్యక్తులకిచ్చి ఒక్కొక్కరి చుట్టూ గిరిగీయును, మనము ఒక విషయములో ఒకలోటును చూచినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుట ద్వారా దేవునికి సహాయపడవలెనని చూచినట్లయితే మొదట అట్లు చేయుటకు ఆత్మ మనలను ప్రేరేపించుచున్నాడా లేక మన మానవపరమైన ఆలోచన దానిగూర్చి ఏదోఒకటి చేయునట్లు ప్రేరేపించుచున్నాదా అనునది చూచుకొనవలెను. మనము గౌరవించకపోయినా దేవుడు ప్రతివారి చుట్టూ ఉండిన పరిధులను గౌరవించును. ఆయన మనచుట్టూ గీసిన పరిధిని మించి మననుండి దేవునికి ఏ సహాయము అక్కర్లేదు. కేవలము ఆ పరిధులలోనే మనము దేవునిని కనుగొనగలము (అపొ.కా. 17:26,27 చూడండి). వాటికి బయట మనము సాతానును మాత్రమే కనుగొనగలము (ప్రసంగి 10:8 చూడండి).
పైన చూచిన ఉదాహరణలలో నున్న సూత్రములను మన జీవితములకు అనేక విధములుగా అన్వయించుకొనవచ్చును.
మన స్వంత జీవితములకు మరియు పరిచర్యకు సంబంధించిన ఈ విషయములో వెలుగు నిమ్మనమని మనము దేవుని అడుగుదుము.