రోమా 6వ అధ్యాయములోని ఒక వచనములో క్లుప్తముగా ఈ భేదము చెప్పబడింది. రోమా 6:14 లో “మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీమీద ప్రభుత్వము చేయదు” అని చదివెదము. ధర్మశాస్త్రము పాతనిబంధనకు సూచనగా ఉన్నది. అందులో దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన మరియు నిబంధనలోఉన్న షరతులు అన్నియు “ధర్మశాస్త్రములో ఉన్నవి”. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన క్రొత్త నిబంధనలోనివన్నియు ఒక మాటలో “కృప” అని చెప్పవచ్చును. ఇక్కడ మీరు ధర్మశాస్త్రములోగాని లేక కృపలోగాని ఉండవచ్చును అని చెప్పబడింది. మీరు ధర్మశాస్త్రము క్రింద కాకుండా కృపలో ఉన్నట్లయితే, పాపము మీమీద ప్రభుత్వము చేయదు. దీనిని ఈలాగు చెప్పవచ్చును. మీరు కృపలో కాకుండా ధర్మశాస్త్రము క్రింద ఉన్నట్లయితే పాపము మీమీద ప్రభుత్వము చేయును. కాబట్టి మనము ధర్మశాస్త్రము క్రింద ఉన్నామా లేక కృపలో ఉన్నామా అనునది మనము కొన్ని నియమములనుబట్టి జీవించుటచేత కాదు గాని పాపము మనమీద ప్రభుత్వము చేయుచున్నదా? లేదా అను దానిపై ఆధారపడియుంటుంది.
ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అయినప్పటికీ, చాలా మందికి క్రొత్తనిబంధనలో ప్రభువైనయేసు మనలోనికి యేమి తెచ్చియున్నారో లేక పాతనిబంధనలో మోషే ప్రజలయొద్దకు యేమి తెచ్చియున్నాడో తెలియదు. ప్రభువైనయేసు గొప్పవాడా లేక మోషేనా అని మిమ్ములను అడిగినట్లయితే, ప్రభువైనయేసే గొప్పవాడంటారు. మోషే దాసుడై యున్నాడు మరియు ప్రభువైనయేసు యజమానుడైయున్నాడు. మోషే కంటే ప్రభువైనయేసు ఎంతో గొప్పవాడు అనునది స్పష్టముగా ఉన్నది.
ఇది మీకు అర్ధమైంది కాబట్టి ఇప్పుడు నన్ను చెప్పనివ్వండి : ప్రభువైనయేసు కంటే మోషే ఎంత తక్కువవాడో అలాగే దేవుడు ప్రభువైనయేసు ద్వారా చేసిన క్రొత్తనిబంధన కంటే, మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు చేసిన నిబంధన అంత తక్కువది. మోషే మరియు ధర్మశాస్త్రము ప్రజలను కొంతవరకు దేవుని అవసరమును తెలుసుకొనేటట్లు చేసి ఆయన యొద్దకు నడిపించిన యెడల, ప్రభువైనయేసు మరియు క్రొత్తనిబంధన ఇంకెంత ఎక్కువ స్థాయికి నడిపిస్తుంది? మీరు తేడా ఉందని చెప్పవచ్చును. అది నడచుటకు మరియు ఎగురుటకు, అలాగే సైకిలుకు మరియు విమానానికి ఉన్నంత భేదము. వేగములో సైకిలుకును మరియు విమానానికి చాలా తేడా ఉంటుంది. సైకిల్ మరియు విమానమునకు ఉన్న తేడాను చూచిన యెడల పాత మరియు క్రొత్త నిబంధనలకున్న తేడాను కూడా మీరు చూడగలరు. సైకిల్ వలే పాతనిబంధన కూడా మనలను కొంత నడిపించును. విమానమువలే క్రొత్తనిబంధన మనలను అద్దరికి తీసుకెళుతుంది. వీటి మధ్య చాలా తేడా ఉన్నది.
పాతనిబంధన మనలను కొంతవరకు మాత్రమే దేవునితో సహవాసమునకు నడిపిస్తుంది. పాతనిబంధనలోని ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలమునకు మరియు అతిపరిశుద్ధ స్థలమునకు మధ్య తెర ఉన్నది. ఇశ్రాయేలీయులు పరిశుద్ధ స్థలములోనికి (యాజకులు) మాత్రమే ప్రవేశించగలరు గానీ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశము లేదు. తెరలోపల దేవుడు మాత్రమే నివసించేవాడు. ఎవరును అందులో ప్రవేశించగలిగే వారు కాదు. ప్రధానయాజకుడు కూడా సంవత్సరములో ఒక్కసారి మాత్రమే ప్రవేశించగలడు. కానీ వారి ఇష్టము వచ్చినప్పుడల్లా ఇతరులు వెళ్ళటానికి లేదు. కాని ప్రభువైనయేసు కల్వరి సిలువలో మన కొరకు మరణించినప్పుడు ఆ తెర పైనుండి క్రింది వరకు చినిగింది. కాబట్టి ఇప్పుడు అతిపరిశుద్ధ స్థలములోనికి మనకు ప్రవేశము దొరికింది. కాబట్టి ఒక ప్రశ్న నన్ను అడుగనివ్వండి. ఇప్పుడు తెర చినిగింది కాబట్టి దేవునిలోనికి ఆయన అతిపరిశుద్ధ స్థలములోనికి మనము నడిపించబడ్డాము. పాతనిబంధనలో కంటే మన జీవితము శ్రేష్టముగా ఉండాలా వద్దా? జవాబు స్పష్టముగా ఉన్నది. అప్పుడు కేవలము ధర్మశాస్త్రముతో దేవునితో సహవాసము లేకుండా వారు ఆవిధముగా జీవిస్తే, ఇప్పుడు మనము తెరలోపల ప్రవేశించి, దేవునితో సహవాసము చేసి ఎంత శ్రేష్టమైన జీవితము జీవించాలి? కాని చాలామంది క్రైస్తవులకు ఇది అర్ధమైనట్లు లేదు. ఉదాహరణకు కొందరు క్రైస్తవులు భయంకరమైన పాపములో పడ్డారని మనము ఎందుకు వింటున్నాము? ఏలియా గాని బాప్తీస్మమిచ్చు యోహాను గాని స్త్రీల వెంట లేక ధనము వెంట పరిగెత్తుటను మీరు ఊహించగలరా? వారు కృపలో లేనప్పటికీ, అతిపరిశుద్ధ స్థలములో ప్రవేశము లేనప్పటికీ వారు ఆవిధముగా జీవించారు. క్రొత్తనిబంధనలోని వాగ్ధానములన్నిటినీ నమ్మి ప్రార్ధనగా చేసినట్లయితే మనము ఇంకా ఎంత శ్రేష్టమైన జీవితము జీవిస్తాము?
దానినే పౌలు ఇక్కడ చెప్పుచున్నాడు: మీరు కృపలో ఉన్నారు గాని ధర్మశాస్తము క్రింద లేరు కాబట్టి పాపము మీమీద ప్రభుత్వము చేయదు. “స్త్రీలు కనినవారందరిలో బాప్తీస్మమిచ్చు యోహాను గొప్పవాడని” ప్రభువైనయేసు చెప్పారు (మత్తయి 11:11). అయితే ప్రభువైనయేసు మానవ తండ్రికి పుట్టలేదు కాబట్టి ఆయనను మినహాయించి చెప్పారు. అయితే ఇతరులందరిలో బాప్తీస్మమిచ్చు యోహాను గొప్పవాడు. అయితే పరలోకరాజ్యములో ఉన్న అల్పుడుకూడా అతనికంటే గొప్పవాడని ప్రభువు చెప్పారు. ధర్మశాస్త్రముక్రింద ఉన్న అతిగొప్ప వ్యక్తికంటే కృపలో ఉన్న అల్పుడే గొప్పవాడు అని ఆయన చెప్పుచున్నారు. కొందరు విశ్వాసులు మాత్రమే ఈ స్థాయికి వస్తారని చెప్పబడలేదు. దేవుని చిత్తమేమిటంటే ఆయన కృపలోనికి వచ్చిన తన బిడ్డలందరు బాప్తీస్మమిచ్చు యోహానుకంటే గొప్పవారుగా ఉండాలని కోరుచున్నాడు. కాని వారు ఆవిధముగా జీవిస్తారా లేదా అనునది వేరే విషయము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించిన కృపను వారు అర్ధము చేసుకొని మరియు ఆకృపను పొందినయెడల వారు ఆవిధముగా జీవించగలరు.
హెబ్రీ 4:16 లో ఉన్న కనికరమును దీనితో పోల్చినయెడల, కనికరముద్వారా సమయోచితమైన సహాయము కొరకు (ఎల్లప్పుడు, ప్రతి పరిస్థితికి అవసరమైన కృప అంతటినీ పొందుటకు) కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు వచ్చెదము. నేను ఇంతకు ముందు చెప్పినట్లు “కనికరమునకు” మరియు “కృపకు” తేడా ఉన్నది. “కనికరము” పాతనిబంధనలో ఉన్నమాట. ప్రభువుయొక్క కనికరము నిరంతరము ఉండునని పాతనిబంధనలో అనేకసార్లు చూస్తాము. దావీదు దీనిగురించి ఎక్కువగా చెప్పాడు. కనికరముద్వారా పాతనిబంధనలోని ప్రజల పాపములు కప్పబడి మరియు క్షమించబడి ఉన్నవి. అయితే అవి కడుగబడలేదు. “ఎవరి పాపములు క్షమించబడినవో(కప్పబడినవో) అతడు ధన్యుడు” అని దావీదు చెప్పగలిగాడు. ప్రభువైన యేసు కల్వరి సిలువలో చనిపోయేవరకు ఎవరి పాపములు కడుగబడలేదు. క్రీస్తు వచ్చేవరకు పాపములు కేవలము కప్పబడినవి. అవి క్షమించబడినవి. 103 వ కీర్తనలో దావీదు ఇట్లనుచున్నాడు, “నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు” (కీర్తన 103:2,3). అది కనికరము. మన పాపములన్నియు క్షమించబడునిమిత్తము మనకు కూడా ఆ కనికరము అవసరము. అయితే క్రొత్తనిబంధనలో కనికరముకంటె ఇంకా శ్రేష్టమైనది కూడా ఉన్నది. మనము పాపముమీద జయము పొందుటకు అవసరమైన కృప (దేవుని జీవము మరియు స్వభావము) మనకు అందుబాటులో ఉన్నది. కనికరము పొందిన దగ్గరనే మన భవిష్యత్తులోని ప్రతి అవసరము నిమిత్తము కృపాసనములోనుండి కృపను పొందెదము.
మనకు ఈ కృప ఎప్పుడు అవసరమవుతుంది? మన శరీర ఇచ్ఛలద్వారాను మరియు సాతానుద్వారా పాపము చేయాలనే బలమైన కోరిక మనలో కలిగినప్పుడు ఈ కృప అవసరమవుతుంది. మనము ఏ పాపమైననూ చేయుటకు శోధింపబడినప్పుడు మన అవసరమంతటికీ సరిపోయే కృప మనకు సహాయపడుతుందని దేవుడు చెప్పుచున్నాడు. మన అవసరమెంత పెద్దదైనప్పటికీ, ఎన్నిసార్లు అవసరమైనప్పటికీ కృప మనకు సహాయపడగలదు. ఏదైనా పాపముమీద జయము పొందుట ఇప్పుడు నా అవసరమైతే అవసరమైనప్పుడెల్లను కృప నాకు సహాయపడుతుందని చెప్పబడుచున్నది. దీనిని ఈ విధముగా చెప్పవచ్చును: నేను పర్వతము ఎక్కుచున్నప్పుడు జారి పడబోవుచున్నట్లయితే వెంటనే దేవుని సహాయమును అడిగినట్లయితే వెంటనే ఆయన నేను పడిపోకుండా సహాయము చేస్తాడు. కాని నేను ప్రార్ధించనట్లయితే, నాకు నేనే పెనుగులాడుచున్నట్లయితే నేను జారి పడిపోయి మరియు ఎముకలు కూడా ఇరుగవచ్చును. అప్పుడు నేను ప్రార్ధించినట్లయితే, అప్పుడు ఆంబులెన్స్ వచ్చి నన్ను తీసుకొని వెళ్లి సహాయము చేయును. కాని అది కనికరము మాత్రమే అనగా నేను పడిపోయిన తరువాత దేవుడు నన్ను పైకిలేపి, నన్ను క్షమించి, హాస్పిటల్‍కు తీసుకెళ్లి కట్టుకట్టి నన్ను బాగు చేస్తారు. అనేకమంది క్రైస్తవుల అనుభవము ఇలాగే ఉన్నది. వారు పడిపోయిన తరువాత దేవునికి ప్రార్ధిస్తారు. కాని దానికంటే మంచి మార్గము ఉన్నది గదా! సమయోచితమైన సహాయము కొరకు కృప అందుబాటులో ఉన్నది.
మరొకసారి నీవు పడిపోవునంతగా శోధించబడినప్పుడు నీవు ఈ విధముగా ఎందుకు చేయకూడదు. ప్రయత్నించి చూడుము. ఆ కృప ఎంత బాగుగా పనిచేస్తుందో చూడుము. ఆ క్షణములో దేవునికి ప్రార్దించు, “ఓ యేసుప్రభువా! నేను ఈ పాపమును జయించలేకపోవుచున్నాను, నీ సహాయము నాకు కావాలి. దీనిని జయించుటకు కృపను అనుగ్రహించుము”. ఆ క్షణములోనే నీవు దేవుని కృపను పొందుకొని జయము పొందెదవు.