2 కొరింథీ 3వ అధ్యాయములో పౌలు క్రొత్తనిబంధన సేవకుని గూర్చి మాట్లాడుచున్నాడు. పాతనిబంధన మరియు క్రొత్తనిబంధన సేవకులకు ఎంతో తేడా ఉంది. దేవుని మార్గములను నేర్చుకొని మరియు దేవుని యొద్దనుండి వర్తమానం పొందుటకు పాతనిబంధనలోని హోషియ, యెషయా మరియు యెహెజ్కేలులాంటి కొందరు ప్రవక్తలు మాత్రమే కొన్ని పరీక్షలు, శ్రమలలోగూండా వెళ్లారు. సాధారణముగా పాతనిబంధనలో దేవుని యాజకులుగా పరిచర్య చేయుటకు శ్రమలలోగూండా వెళ్ళవలసిన అవసరంలేదు. దేవుని ధర్మశాస్త్రము(వాక్యము)ను చదివి, అర్ధం చేసుకొని మరియు ప్రజలకు వివరించేవారు. వారు చదివి మరియు ప్రకటించారు. నీవు కూడా కేవలం చదివి, బోధించేవాడిగా ఉన్నట్లయితే, నీవు పాతనిబంధన సేవకుడివే. ఒక క్రొత్తనిబంధన సేవకుడు కేవలం చదువుటద్వారా తన పరిచర్యను పొందడు. తాను చదివిన వాక్యాన్ని మొదటిగా అనుభవిస్తాడు, తరువాత తన అనుభవంలోనుండి మాట్లాడతాడు. అతడు “వచ్చి మరియు వినండి” అని చెప్పడు కాని “వచ్చి చూడండి” అని చెప్తాడు.
2 కొరింధీ 3:5 లో “పరిచర్య చేయుటకు మేము సమర్ధులంకాదు” అని పౌలు అంటున్నాడు. అద్బుతమైన క్రొత్తనిబంధన పరిచర్య చెయ్యుటకు మాలో సామర్ధ్యము లేదని చెప్పుచున్నాడు. కాని మాసామర్ధ్యము దేవునిలోనుండి వస్తుంది. దేవుని సేవించుటకు క్రొత్తనిబంధన సేవకుడు తనలోనున్న దేనిమీదనైనను ఆధారపడడు. అతడు సమస్తమును దేవునిలోనుండి పొందుకుంటాడు. కానా పల్లెలో పరిచారకులు పంచిపెట్టినట్లు, వారికి దేవుడిస్తాడు మరియు వారు పొందుకొనిన దానిని వేరేవారికి పంచిపెడతారు. వారు ప్రభువైన యేసుయొద్దకు కేవలం నీటిని తెచ్చారు. ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చారు. అప్పుడు వారు పంచిపెట్టారు. అలాగే శిష్యులు అయిదు రొట్టెలు మరియు రెండు చేపలను ప్రభువైన యేసుయొద్దకు తెచ్చారు. ఆయన వాటిని విస్తరింపచేసియున్నాడు అప్పుడు వారు వాటిని పంచిపెట్టారు. మనము కూడా మనకున్న కొంచెమును ప్రభువుయొద్దకు తెస్తాము ఆయన దానిని అభిషేకించి, ఆశీర్వదించి మరియు విస్తరింపజేస్తాడు. అప్పుడు మనం వాటిని వేరేవారికిస్తాము. ఆవిధంగా మనం పరిచర్య చెయ్యాలి. మనం పంచిపెట్టుటకే(వడ్డించుటకే)గాని ప్రసంగములనైనను మరిదేనినైనను తయారుచేయుటకు మనము పిలువబడలేదు. మనం మాట్లాడినప్పుడు - మొదట మనం దేవుని జీవాన్ని అనుభవించి, ఆ జీవాన్ని ఇతరులకు ఇస్తాము అంతేగాని తెలివినికాదు.
కొంతకాలం దేవుని సేవ చేసినతరువాత, అనేకమంది క్రైస్తవ పరిచారకులు(సేవకులు) నిరాశచెంది, చింతిస్తూఉండి మరియు వ్యాకులముతో ఉంటారు మరికొందరైతే అనారోగ్యానికి కూడా గురౌవుతారు. ఎందుకంటే వారు వారి సొంత శక్తితో దేవుని సేవను చేయాలని ప్రయత్నించారు. ఆయన సేవకు మనం ప్రాత్రులమగునట్లు, దేవుని సర్వ సమృద్ధితో నింపబడాలి. ఆయనను సేవించాలంటే, మన శారీరక ఆరోగ్యానికి కూడా ఆయనమీద ఆధారపడాలి. దేవుని వాగ్ధానమేమిటనగా, “యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు” (యెషయా 40:31). దేవుడే మన అవసరమంతటినీ తీర్చును. ఒకవేళ నీకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ వాగ్ధానము నమ్మండి, “దేవుడే మన అవసరమంతటినీ తీర్చును”. మన అవసరమేదైననూ, ఎన్నిసార్లు అవసరమైననూ దేవుడు ఎంతో సమృద్ధిగా మన అవసరమంతటినీ ప్రతిసారి తీర్చును.
ఆయన మనలను క్రొత్తనిబంధన సేవకులనుగా చేసాడు. క్రొత్తనిబంధనలో మనము అక్షరమునకుకాదుగాని ఆత్మకు పరిచారకులమైయున్నాము (2 కొరింథీ 3:6). 2 కొరింథీ 3:9 లో రెండురకాల పరిచర్యలు చెప్పబడినవి ఒకటి శిక్షావిధి కలిగించి, ఖండించే పరిచర్య మరొకటి దేవుని నీతిని కలుగజెసే పరిచర్య. మొదటి పరిచర్యలో ప్రసంగము వినిన తరువాత ప్రజలు శిక్షావిధికి గురిఅవుతారు ప్రసంగము బాగున్నదని నీవు అనుకోవచ్చును గాని దానిద్వారా ప్రజలు ఖండించబడి శిక్షావిధికి గురిఅయివున్నారు. అది పాతనిబంధన పరిచర్య. ధర్మశాస్త్రము ఎల్లప్పుడు ప్రజలను ఖండిస్తూ, శిక్షావిధిని కలుగజేస్తూ, “నీవు బాగుగా లేవు, నీవు బాగుగా లేవు” అని చెపుతూ ఉంటుంది. ఈనాడు ఉజ్జీవ కూటములు అనబడే కూటాలలోని బోధ అంతయు, “నీవు బాగుగా లేవు. నీవు చెడ్డవాడవు. నీవు పనికిమాలినవాడవు” అని బోధిస్తున్నారు. ప్రజలు దానిని విని శిక్షావిధికి గురి అవుచున్నారు. అది క్రైస్తవ బోధకాదు. క్రైస్తవ బోధ దేవునినీతిని పొందుకునేటట్లు చేసి, సంతోషకరమైన మహిమకరమైన జీవితానికి నడిపిస్తుంది. అది ప్రజలను ఒప్పింపజేయుటయేకాక ఆ వర్తమానము ప్రజలను విమోచింపజేస్తుంది కాబట్టి ప్రజలు గొప్ప నిరీక్షణతో వెళతారు. నీ బోధ ప్రజలను బంధకాలలోకి తెచ్చినట్లయితే, నీవు పాతనిబంధన సేవకుడవే. నీ బోధ ప్రజలను శిక్షావిధిలోనికి తెచ్చినట్లయితే అది పాతనిబంధన బోధ. నీ బోధద్వారా ప్రజలను ప్రోత్సహించి, ఆత్మీయముగా పైకి లేపినట్లయితే అది క్రొత్త నిబంధన బోధ. క్రొత్తనిబంధన ప్రజలలో క్షేమాబివృద్ధిని కలిగించి, వారికి గొప్ప నిరీక్షణ కలుగజేస్తుంది.