వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము నాయకుడు పురుషులు
WFTW Body: 

దేవునికి నివాసస్థలమైయుండుటకు దేవుడు సంఘమనే తన ఇంటిని కట్టుచున్నాడని క్రొత్తనిబంధనలో చెప్పబడింది. జ్ఞానమువలన ఇల్లు కట్టబడునని సామెతలు 24:3 లో ఉన్నది.

ఒక శిష్యుడు కేవలము లేఖనములను చదువుటద్వారా జ్ఞానవంతుడుకాడు. అది కేవలము బైబిలుజ్ఞానమును ఇచ్చును. దేవునియందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము(సామెతలు 9:10). దేవునియందు భయభక్తులు కలిగియుండుటయే క్రైస్తవజీవితానికి పునాది(అ,ఆ లు). "పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది(యాకోబు 3:17). కాబట్టి క్రీస్తు శరీరమనే సంఘమును కట్టువారందరు దేవునియందు భయభక్తులు నేర్చుకోవాలి. యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పెదమని" మనము చెప్పగలిగియుండాలి(కీర్తనలు 34:11).

మంచి సిద్ధాంతము, మంచి అనుభవములను కలిగియుండుట, స్తుతి, ఆరాధన మరియు సువార్త ప్రకటించుటను గూర్చి మనము నొక్కి చెప్పవచ్చును. కాని దేవునియందు భయభక్తులు కలిగియుండుటమనే పునాది లేనట్లయితే, ఒకరోజు మనము కట్టినదంతయు కూలిపోతుంది.

కార్యక్రమముల ద్వారాగాని, అనేకపనులు చేయుటద్వారాగాని, డబ్బుతోగాని, మనుష్యుల తంత్రములద్వారాగాని లేక లోకానుసారమైన వ్యాపారపద్దతిద్వారా గాని సంఘము కట్టబడదు. ఆ విధముగా చేసిన క్రైస్తవ పరిచర్య మనష్యుల దృష్టికి గొప్పదిగా ఉండవచ్చును గాని దేవుడు దానిని అగ్నిచేత పరీక్షించినప్పుడు అది కేవలము కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మాత్రమేనని తెలుస్తుంది(1 కొరింథీ 3:11-15).

తమ్ముతాము తీర్పు తీర్చుకొనుటయే దేవుని ఇంటియొక్క ప్రత్యేకలక్షణము(1 పేతురు 4:17). అది దేవునివెలుగులో, దేవునియెదుట జీవించుట ద్వారానే అది సాధ్యము. యెషయా, యోబు మరియు యోహాను అను వారందరు దేవుని చూచినప్పుడు వారి నిస్సహాయతను, బలహీనతను మరియు వారి పాపమును చూచియున్నారు (యెషయా 6:5; యోబు 42:5,6; ప్రకటన 1:17).

ఆదాము, హవ్వ దేవునిపరిశుద్ధతను అతిక్రమించినప్పుడు, ఏదేనుతోటలో నుండి పంపించివేయబడియున్నారు. అప్పుడు దేవుడు జీవవృక్షమును కాచుటకు ఇటుఅటు తిరుగు ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ప్రభువైనయేసు మనకిచ్చుటకు వచ్చిన నిత్యజీవము(దేవునిజీవమును) మరియు దేవునిస్వభావమును ఈ జీవవృక్షము చూపించుచున్నది. మనము దేవుని స్వభావములో పాల్గోనునట్లు మన స్వజీవము సిలువ వేయబడవలసియున్నది. ఆ ఖడ్గజ్వాల మొదట ప్రభువైనయేసు మీద పడింది. అనగా మనకొరకు ఆయన సిలువవేయబడ్డాడు. మనము కూడా ఆయనతో సిలువ వేయబడ్డాము(గలతీ 2:20). క్రీస్తుతో కూడా మన ప్రాచీనస్వభావము, మనము కూడా సిలువ వేయబడ్డాము కాబట్టి, "క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను, దురాశలతోను సిలువ వేసియున్నారు(గలతీ 5:24).

దేవునిజీవమును అంతకంతకు సమృద్ధిగా పొందుటకు ఒకే ఒక మార్గము పునరుత్ధానశక్తితో శరీరయిచ్ఛలను, దురాశలను చంపుటయేనని సంఘపెద్దలు, ఖడ్గజ్వాలలవలె ప్రకటించాలి. దేవునితో సహవాసము చేయుటకు సిలువే (ఖడ్గజ్వాల) మనకు శరణం. ఖడ్గజ్వాల(సిలువ) అనేక సంఘములలో పనిచేయుటలేదు కాబట్టి ఆ సంఘస్థులు రాజీపడుచున్నారు. మరియు వారు క్రీస్తుశరీరమనే స్థానిక సంఘమును వ్యక్తపరచలేకపోవుచున్నారు.

ఒక సమయములో ఇశ్రాయేలీయులు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరని సంఖ్యాకాండము 25:1లో మనము చదువుచున్నాము. ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొనివచ్చెను(6వ). ఫీనెహాసు అనే యాజకుడు ఇశ్రాయేలు దేశము నాశనమవ్వకుండా కాపాడియున్నాడు. అతడు దేవునికొరకు ఎంత తీవ్రముగా ఉన్నాడంటే, వెంటనే అతడు యీటెను తీసుకొని పడక చోటికి వెళ్ళి ఆయిద్దరిని చంపివేశాడు(7,8 వచనములు). అప్పుడు దేవుడు ఆ తెగులును నిలిపివేశాడు(9వ). అయితే అప్పటికే 24,000 మంది చంపబడ్డారు. ఆరోజున ఆ ఖడ్గజ్వాల రానట్లయితే, అక్కడనున్న ఇశ్రాయేలీయులందరును చంపబడునంతగా ఆ తెగులు విస్తరించిఉండేది.

ప్రతిసంఘములో అటువంటి "ఖడ్గజ్వాల" ఉండుట ఎంత అవసరమో మీరు చూస్తున్నారు కదా?

ఈనాడు క్రైస్తత్యములో ఖడ్గజ్వాలను ఉపయోగించుట తెలిసిన ఫీనెహాసులాంటి వారు చాలినంతమంది లేకపోవుట వలన ఆ తెగులు వేగముగా విస్తరించుచున్నది. ఎల్లప్పుడు "మిద్యానీయులను ప్రేమించమని చెప్పుచున్న" అనేకమంది పెద్దలు మరియు బోధకులు మనుష్యులను సంతోషపెట్టేవారుగా ఉన్నారు. సంఘములో ఖడ్గజ్వాలను ఉపయోగించకూడదని అపవాది అనేక కారణములు చెప్పును. తన వాదనను సమర్ధించుకొనుటకు, అతడు ప్రభువైనయేసునకు లేఖనములను చూపించినట్లు మనకును చూపిస్తాడు.

యీటెను ఉపయోగించుట ద్వారా వ్యక్తిగతముగా ఫీనెహాసు ఏదైనా లాభము పొందియున్నాడా? లేదు. కాని దానికి బదులుగా దయ, కనికరము గలవాడనే మంచిపేరును పోగొట్టుకున్నాడు!! చంపబడిన వ్యక్తియొక్క బంధువులు మరియు స్నేహితులు అతని మీద కోపపడి మరియు కొండెములు చెప్పియుందురు. కాని దేవుని మహిమా ప్రభావములు ఫీనెహాసును ప్రోత్సహించినవి. "నేను ఓర్వలేనిదానను తాను ఓర్వలేడు" అని ఫీనెహాసు పరిచర్యను దేవుడు అంగీకరించాడు(సంఖ్యాకాండము 25:11). చివరకు అన్నిటికంటే దేవుని అంగీకారము మాత్రమే ముఖ్యమైయున్నది. ఫీనెహాసు గురించి దేవుడిట్లు చెప్పుచున్నాడు "అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడైయున్నాడు కాబట్టి అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను"(సంఖ్యాకాండము 25:12,13). యీటెను ఉపయోగించిన లేవీయులతో కూడా దేవుడు తన సమాధాన నిబంధనను చేసియున్నాడు(మలాకీ 2:4,5).

దేవునిఖడ్గమును ఉపయోగించకుండా, మనుష్యరీతిగా సమాధానము వెదకుచున్నందువలన అనేక సంఘములలో దేవునిసమాధానము లేదు. దాని ఫలితముగా పోట్లాటలు మరియు జగడములు ఉన్నవి. స్వజీవము సిలువలో క్రీస్తుద్వారా సంహరించబడుటద్వారా క్రీస్తుయొక్క సమాధానము మన కుటుంబములోనికి మరియు సంఘములోనికి తీసుకొనిరాబడియున్నది.

సంఘమును పరిశుద్ధతలో పోషించి కాపాడాలంటే దేవునినామము ఘనపరచు విషయములో ఆసక్తి కలిగియుండాలి. దయ, కనికరము గలవారని మంచి పేరు తెచ్చుకోవాలనే కోరికను మరిచి, దేవునినామము మహిమపరుచు విషయములో ఆసక్తి కలిగియుండాలి. ఇటువంటి ఆసక్తి రూకలు మార్చు వారి రూకలను చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి అనేటట్లు ప్రభువైనయేసును చేసింది. "దేవుని యింటిని గూర్చిన ఆసక్తి ఆయనను భక్షించింది"(యోహాను 2:17). క్రీస్తువలె ఉండుటమంటే ఇదియే. క్రీస్తువలె ఉండుటకు అనగా అపార్ధము చేసుకొనబడుటకును మరియు లోకవిరోధముగా ఉండుటకును ఎంతమంది ఇష్టపడుచున్నారు?