WFTW Body: 

కొలస్సీ 1:24లో పౌలు ఇట్లు చెప్పుచున్నాడు, ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరముకొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నావంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. క్రీస్తు పొందిన శ్రమలలో కొదువ ఏముంది? సమాప్తమైందని ప్రభువు సిలువమీద చెప్పలేదా? ఇక్కడ గొప్పసత్యమున్నది. సువార్తలలో ఆయన శరీరములో పొందిన కొన్ని శ్రమలను గూర్చి చదువుతాము. అయితే లేఖనములలో వ్రాయబడని కొన్ని శ్రమలు కూడా ఆయన పొందియున్నాడు. "ఇది సమాప్తమైనది" అని ప్రభువు సిలువమీద పలికినప్పుడు, మానవులయొక్క సమస్తపాపములకు ప్రాయశ్చిత్తము చేయుటయేగాక, మానవులు ఎదుర్కొనే ప్రతియొక్క శోధనను జయించాడు. మనవలెనే అన్ని విషయములలో శోధించబడినను, ఆయన ప్రతిశోధనను జయించాడు (హెబ్రీ 4:15).

ప్రతి శోధనలో మనం సంతోషాన్ని కోరుకొని ఆ శోధనకు లోబడవచ్చును లేక ఆ సంతోషాన్ని తిరస్కరించి మరియు శ్రమపడవచ్చును. ఆయన శ్రమపడే మనస్సును కలిగియుండి శరీరమందు శ్రమపడ్డాడు (1 పేతురు 4:1). ఆవిధంగా ఆయన మనకంటే ముందుగా నడిచివెళ్ళాడు. ఇప్పుడు మనము ఆయనను వెంబడించి, ఇతరులకు మాదిరిగా ఉండాలి. మనకు పాపము చేయవలెననే శోధన వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు ప్రభువైనయేసు వెళ్ళిన మార్గములో మనలను నడిపిస్తాడు. ప్రభువైనయేసు పూర్తిగా జయించిన శోధనలు తన జీవితంలో ఇంకా పూర్తిగా శ్రమలద్వారా జయించలేదని పౌలు కొలస్సీ 1:24లో చెప్పుచున్నాడు.

సత్యముకొరకు నిలబడినందున ప్రభువైనయేసు కూడా అనేక విధాలుగా శ్రమపొందియున్నాడు. శ్రమలను గ్లాసుతో నీవు పోల్చినట్లయితే, ప్రభువైనయేసు విషయంలో ఆయన పొందవలసిన శ్రమలన్నియు పొంది ఆగ్లాసు నిండిపోయింది. చివరకు సిలువమీద ఆయన ఇట్లన్నాడు, "సమాప్తమైనది". ఇప్పుడు మనము ప్రభువైనయేసు అడుగుజాడలలో నడవాలి. ఆయనవంటి శరీరమే మనకు కూడా ఉన్నది. పరిశుద్ధాత్ముడు మనలో అదేపనిని చేస్తున్నాడు. ఆ విధంగా గ్లాసు నిండిపోతుంది. మనము క్రొత్తగా జన్మించినప్పుడు, క్రీస్తుకొరకు మనమెటువంటి శ్రమలు పొందలేదు కాబట్టి గ్లాసంతా ఖాళీగా ఉంది. క్రీస్తు నిమిత్తము మనం శ్రమలు అనుభవించే కొలది గ్లాసునిండుతూ ఉంటుంది. శ్రమలు పొందిన క్రీస్తుయొక్క ఆత్మ ఇప్పుడు మనలో నివసిస్తూ, ఆయన పొందిన శ్రమలు మన శరీరమందు కూడా పొందునట్లు ఆయన నడిపిస్తాడు. సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాదు.

సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తుపడినపాట్లలో కొదువైన పాట్లు మన శరీరమందు సంపూర్ణము కావాలి. నిజానికి ఇది ఎంతో ధన్యత. తన గ్లాసు ఇంకా నిండలేదని పౌలు చెప్పుచున్నాడు. వారు శ్రమలలో గుండా వెళ్ళుచున్నప్పుడు, అది క్రీస్తు శ్రమలలో పాలివారమగుటయని చాలామంది క్రైస్తవులు గ్రహించలేకపోవుచున్నారు. అయితే మనం బుద్ధిహీనమైన పనులు లేక పాపము చేసినందుకు వచ్చిన శ్రమల గురించి మాట్లాడుట లేదు. ఈలోకానికి వ్యతిరేకంగా ఆయన జీవితం ఉంది కాబట్టి ఆయన శ్రమలు పొందియున్నాడు. ఆ దినాలలో ఉన్న శాస్త్రులతో, బైబిలు పండితులతో ఎల్లప్పుడు పోరాటం ఉండేది. వారు ఆయనను ద్వేషించి, ఆఖరుకి ఆయనను చంపేశారు.

ఈనాడు కూడా అలాగే ఉంది. మనం క్రీస్తుకు నిజమైన శిష్యులమైతే, ఈ లోకములోని మతత్వముతోను, క్రైస్తవవేదాంతముతోను మరియు క్రైస్తవమతంతోను పోరాటం చేయవలసియుంటుంది. కేవలం మతానుసారులై, దేవుని ఎరుగని వారితో ప్రభువైనయేసువలె మనకు కూడా పోరాటం ఉంటుంది. ప్రభువైనయేసును "బయెల్జబూల్" అని పిలచినవారెవరు? రోమీయులుకాదు లేక గ్రీకుదేశస్థులుకాదు. బైబిలు(పాతనిబంధన)ను కలిగిన వారే. ప్రభువైనయేసును ఎక్కువగా హింసించి మరియు చంపిన వారెవరు? బైబిలును కలిగిన మతానుసారులే. క్రీస్తుపాట్లలో ఉన్న కొదువను మనము సంపూర్ణము చేయాలంటే, బైబిలును కలిగినప్పటికీ దేవునిని ఎరుగని మతానుసారులు మనలను కూడా బాధించెదరు. తన తండ్రిని వారెరుగరు గనుక తనను వారు ద్వేషించి మరియు హింసించారని ప్రభువైనయేసు చెప్పారు.

"నావంతు నేను చేయుచున్నాను కాబట్టి శ్రమలయందును సంతోషించుచున్నానని" పౌలు చెప్పుచున్నాడు. సంఘమనే క్రీస్తుశరీరములో మనవంతు శ్రమలు మనము పొందాలి. మొదటిగా, ప్రభువైనయేసు తన శరీరమందు శ్రమపడియున్నాడు. ఈ శ్రమలలో నీవంతు మరియు నావంతు ఉన్నది. నా వంతు మీరు చేయలేరు మరియు మీవంతు నేను చేయలేను. మీరు శ్రమలలో గుండా వెళ్ళునప్పుడు, నేను మీకొరకు నమ్మకముగా ఉండలేను. ప్రభువైనయేసును వెంబడించినందుకు మీ బంధువులద్వారా, ఇతరులద్వారా శ్రమలొచ్చినప్పుడు లేక మీయింటిలో నుండి వెళ్ళగొట్టినప్పుడు నీకు నీవే నమ్మకముగా ఉండాలి. క్రీస్తు శ్రమలలో ఇవికొన్ని. ఆ సమయంలో సంతోషించి ఇట్లుచెప్పండి, "ప్రభువా నీ శరీరమైయున్న సంఘము కొరకు నావంతు శ్రమలు పొందే ధన్యతను నాకిచ్చినందుకు స్త్రోతం". ఆవిధంగా మనం ఇతరుల కొరకు పరిచర్య కలిగియుంటాము మరియు క్రీస్తుశరీరమైన సంఘాన్ని నిర్మిస్తాము. అందుకే "క్రీస్తు శ్రమలలో పాలివారమని" చెప్పబడింది. శ్రమలద్వారా మనం చాలా పొందుకుంటాము.

క్రీస్తుశ్రమలలో పాలివారమగుట ద్వారా సంఘముగా నిర్మించబడతాము. మీరు దానికి ఇష్టపడుచున్నారా? మీరు ఇట్లు చెపుతారని నేను నమ్ముచున్నాను, "అవును ప్రభువా! నేను ఇష్టపడుచున్నాను. నేను నీతో ఏకమై నీ మనస్సుతోను, నీ ఆత్మతోను మరియు నీ వైఖరితోను సహవాసము కలిగియుంటాను. నాశ్రమలద్వారా ఇతరులు పొందుకొనునట్లు శ్రమలలోగుండా వెళతాను".

చెఱుకుగడలో నుండి ఏవిధంగా చెఱుకురసం వస్తుందో మీరు చూచారా? చెఱుకుగడను తీసుకొని గైండర్‍లో వేసినప్పుడు అది నలిపివేయబడి అందులో నుండి రసం వస్తుంది. అది మరలా మరలా పెట్టినప్పుడు, ఇంకను చెఱుకు రసం వస్తుంటుంది. అది ఎవరి కొరకు నలుగగొట్టబడింది? వేరేవాళ్ళు త్రాగుటకు మాత్రమే. ఆవిధంగా దేవుడు కూడా మనలను ఇతరులకు ఆశీర్వాదముగా చేస్తాడు. క్రీస్తు సువాసన మనలో నుండి ఆయనను వ్యక్తపరచుటకు మనం కుడా విరుగగొట్టబడి, ఆయా పరిస్థితులలో పిండబడి, దీనులమై వాటిని సంతోషంగా అంగీకరిస్తాము.