WFTW Body: 

"వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగనివారునైయుండి గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవునికొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారు" అని ప్రకటన 14:4లో వ్రాయబడియున్నది.

ఇక్కడ శరీరసంబంధమైన పవిత్రత లేక వ్యభిచారము గురించి చెప్పబడలేదు. ప్రకటన 17:5లోని స్త్రీ వేశ్యలకును, భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లియైన మహాబబులోను అని చెప్పబడింది. 1,44,000 మంది ఆత్మీయవ్యభిచారము చెయ్యలేదు. శరీరయిచ్ఛలతోనైనను లేక లోకముతోనైనను వారు ఆత్మీయవ్యభిచారము చెయ్యక, క్రీస్తుకొరకు పవిత్రమైన కన్యకలవలె నుండిరి. "వ్యభిచారిణులారా యీలోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును" యాకోబు 4:4లో వివరించబడింది. వారు శోధనసమయములో నమ్మకముగా ఉండి, లోకమాలిన్యము తమకంటకుండా జాగ్రత్తపడియున్నారు. గొఱ్ఱెపిల్ల ఎక్కడికిపోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు. భూమిమీద దేవుని గొఱ్ఱెపిల్ల నడుచుకొనినట్లుగా వారు కూడా ప్రతిదినము తమ సిలువనెత్తుకొని జీవించారు.

వారు భూలోకములో నుండి కొనబడినవారు. ప్రకటన 14:3లో వారు భూసంబంధమైన వాటినుండి విడుదల పొందియున్నారు. వారు భూసంబంధులకంటే వేరుగా ఉన్నారు. భూసంబంధమైన విషయాలతో వారు నింపబడలేదు. తండ్రి కుడిపార్శ్యమున సింహాసనాసీనుడైన క్రీస్తులో ఉన్న పైనున్న వాటిమీదనే వారి మనస్సును పెట్టియున్నారు. వారు ఈ విధముగా ఆలోచించలేదు, "ఈ భూమిమీద సాధ్యమైనంత ఎక్కువ డబ్బు సంపాదించి మరియు చనిపోయిన తరువాత నేను పరలోకానికి ఏవిధముగా వెళ్ళగలను? ఈ లోకములో ఎంతో సౌఖ్యముగా జీవించి మరియు చనిపోయిన తరువాత పరలోకానికి ఏవిధముగా వెళ్ళగలను"? భూలోకసంబంధులు ఆవిధముగా ఆలోచిస్తారు. "కాని వీరైతే, ఈ భూమిమీద ఉన్న ఒక్క జీవితములో దేవునిచిత్తాన్ని ఏవిధముగా చెయ్యగలను? కల్వరిలో నాకొరకు చనిపోయిన ప్రభువు కొరకు ఏవిధముగా కృతజ్ఞత కలిగియుండగలను?" ఈనాడు "విశ్వాసులమని" పిలుచుకొనే అనేకులవలె సర్ధుబాటు చేసుకునే వారుగాగాని, సగము మనస్సుతో వెంబడించేవారుగాగాని, పైపై భక్తిగలవారుగాగాని లేక లోకానుసారమైనవారుగాగాని వారు లేరు. వారు పూర్తిగా వేరుగా ఉన్నారు. వారు భూసంబంధమైన వాటన్నిటినినుండి విడుదల పొందియున్నారు. ఈ లోకసౌఖర్యము మీదగాని లేక సిరిమీదగాని లేక ఘనతమీదగాని వారికి మనస్సు లేదు.

ఇప్పుడు వారు మనుష్యుల అభిప్రాయముల నుండి అనగా మనుష్యులనుండి కూడా విడుదలపొందియున్నారు. దాని ఫలితముగా వారు దేవునికి మరియు గొఱ్ఱెపిల్లకును ప్రథమఫలములైయున్నారు.

ఒక చెట్టుమీద ప్రథమఫలాలు మొదటిగా పక్వానికి వస్తాయి. వారు పరిశుద్ధాత్మకు స్పందించి, ఈ లోకములోనే పరిపక్వతకు వస్తారు. వారి జీవితమును వారు వృధా చేసుకొనరు. వారు తమ్మునుతాము ఉపేక్షించుకొనుటకు దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగము చేసుకుంటారు. గొఱ్ఱెపిల్లను వెంబడించే అవకాశాన్ని వారు దుర్వినియోగము చెయ్యరు. వారు తమ్మునుతాము ఉపేక్షించుకొని, ప్రభువైనయేసును వెంబడించుటకును మరియు పరిశుద్ధాత్మ స్వరానికి విధేయులగుటకును ప్రతి అవకాశాన్ని సద్వినియోగము చేసుకున్నవారు. దాని ఫలితముగా వారు త్వరగా పరిపక్వత చెందియున్నారు. వారే ప్రథమఫలాలు.

"ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్పప్రకారము కనెను" అని దేవుడు యాకోబు 1:18లో చెప్పెను.

ప్రతిఒక్కరు సరియైనవిధముగా స్పందించరు. అయితే కొందరు సరియైన విధముగా స్పందించి, ప్రథమఫలాలుగా ఉంటారు. 1,44,000 మంది అనగా అక్షరానుసారముగా కాదుగాని అది సూచనగా ఉన్నది. సమృద్ధి జీవానికి మార్గము ఇరుకుగా ఉంటుంది మరియు కొందరే దాన్ని కనుగొంటారు.

ఎవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము దేవుని సన్నిధిలో ఉన్నారు. వారు గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకొనినవారు. ఇవన్నియు ప్రకటన 7వ అధ్యాయములో ఉన్నవి. వీరిలోని అనేకులు ఆయా మతములలో పుట్టి, అతి చిన్నవయస్సులోనే (అనగా గ్రహింపుకూడా రాని వయస్సు) చనిపోయినవారు. 20వ శతాబ్దములో అనేక లక్షలమంది తల్లిగర్భములోనే మరణించారు. క్రీస్తుయొక్క నీతివారికి అనుగ్రహించబడింది. కాబట్టి వారు పరలోకములో ఉన్నారు. కాని జయించువారు అగుటకు వారికి అవకాశములేదు. ఎవరైతే దేవుని సమృద్ధిజీవాన్ని పొందుకొని జయము పొందునట్లు ఇరుకు మార్గాన్ని ఎన్నుకొంటారో వారు ప్రథమఫలములు కాగలరు. వారి కొద్దిమంది మాత్రమే. వారు మత్తయి 5,6,7 అధ్యాయాలను తీవ్రముగా తీసుకొని మరియు దేవునికిని, గొఱ్ఱెపిల్లకును ప్రథమఫలాలుగా మారారు.