వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   ఆత్మతో నింపబడిన జీవితం
WFTW Body: 

లూకా వ్రాసిన రెండు పుస్తకములలో పరిశుద్ధాత్మునియొక్క పరిచర్య గురించి ఎక్కువగా చెప్పాడు. నిజానికి దీనిని చాలా ముఖ్యమైనదిగా లూకా చెప్పాడు. లూకా సువార్తలోని ఉదాహరణలు చూడండి: బాప్తిస్మమిచ్చు యోహాను తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడియున్నాడు(లూకా 1:15). పరిశుద్ధాత్మ మరియ మీదకు వచ్చెను(లూకా 1:35). ఎలీసబెతు మరియు జెకర్యా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు(లూకా 1:41,67). సుమెయోనుని మీదకు పరిశుద్ధాత్మ వచ్చి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షతను పొంది మరియు ఆత్మవశుడై దేవాలయములోనికి నడిపించబడ్డాడు(లూకా 2:25-27). ప్రభువైనయేసు పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చును(లూకా 3:16). ప్రభువైనయేసు బాప్తిస్మము పొందినప్పుడు ప్రార్ధించగా(పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు) వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు దిగి వచ్చాడు(లూకా 3:21,22). ప్రభువైనయేసు పరిశుద్ధాత్మపూర్ణుడై, ఆత్మచేత అరణ్యములోనికి నడిపించబడి మరియు ఆత్మశక్తితో తిరిగి వచ్చారు(లూకా 4:1,14). ఆత్మ ఆయన మీద ఉన్నదని ప్రభువు ప్రకటించాడు(లూకా 4:18). అడుగువారందరికీ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడుచున్నాడు(లూకా 11:13). పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుట కొరకు కనిపెట్టి ప్రార్ధన చెయ్యమని తన శిష్యులకు ప్రభువైనయేసు ఆజ్ఞాపించారు(లూకా 24:49).

అపొస్తలుల కార్యములలో, లూకా పరిశుద్ధాత్ముని గురించి 50 సార్లు చెప్పాడు. నిశ్చయముగా లూకా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి మరియు క్రొత్తనిబంధన జీవితం జీవించుటను సాధ్యపరచిన పరిశుద్ధాత్మవరమును గూర్చి అతడెంతో సంతోషించాడు. అతనివలె ఎంతమంది క్రైస్తవులు సంతోషముతో పురికొల్పబడ్డారోనని ఆశ్చర్యపడుచున్నాను. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుటను గూర్చి క్రొత్తనిబంధనలోని మొదటి అయిదు పుస్తకములలో ఆరంభములో చెప్పబడింది. క్రొత్తనిబంధన యుగములో పరిశుద్ధాత్మునియొక్క పరిచర్యకు ఎంతో ప్రాముఖ్యత కలదని మనకు బోధిస్తున్నది. కాబట్టి సాతాను మోసము చేయాలనుకుంటే, అందులో మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయమేమిటంటే, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము గురించిన నకిలీ అనుభవము పొందునట్లు తప్పుడు బోధలు చేయుట మరియు ఇటువంటి తప్పుడు బోధలు ఈనాడు అనేకములు చూస్తున్నాము.

పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుట గూర్చి సాతాను విశ్వాసులను ఏవిధంగా మోసం చేస్తాడు?

మొదటిగా, వారికి శరీరసంబంధమైన మరియు ఉద్రేకపూరితమైన అనుభవాలిచ్చుట ద్వారా చేస్తాడు. వారు పాపము మీద జయము పొందుటకును మరియు దేవునిపరిచర్య చేయుటకును కావలసిన దేవుని శక్తిని కలిగిలేరు. కాని పరిశుద్ధాత్మలో వారు బాప్తిస్మము పొందియున్నారని సాతాను వారిని నమ్మిస్తాడు. వారు ఇప్పటికే పరిశుద్ధాత్మతో నింపబడియున్నామని ఒప్పించబడియున్నారు కాబట్టి పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొంది, ఆయనతో నింపబడాలని వారు ప్రార్ధించరు. ప్రతిచోట ఇటువంటి వాళ్ళు లక్షలమంది ఉన్నారు. వారు పాపములో ఓడిపోతూ ఉంటారు, సిరిని ప్రేమిస్తూ ఉంటారు మరియు లోకము కొరకు జీవిస్తారు. కాని అన్యభాషలని చెప్పి వారు ఏదో "కొన్ని మాటలు" మరలా మరలా పలుకుతుంటారు మరియు శరీరములోను మరియు దర్శనములలోను ఏదో అనుభూతులు పొందియున్నామని చెబుతారు.

రెండవదిగా, ఈ నకిలీ అనుభవాలను వ్యతిరేకించి, అసలు పరిశుద్ధాత్మలోని నిజమైన బాప్తిస్మాన్ని అనేకులు తిరస్కరించునట్లుగా సాతాను చేయుచున్నాడు. ఆవిధంగా రెండు గుంపులలో ఉన్న అనేకమంది విశ్వాసులు పరిశుద్ధాత్మలో నిజమైన బాప్తిస్మము పొందకుండా చేసి, వారు దేవుని యొక్క శక్తిని పొందకుండా సాతాను చేయుచున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండి, ఈ రెండు గుంపుల నుండి తప్పించుకొనుట మంచిది.

బాప్తిస్మమిచ్చుయోహాను తల్లిగర్భములో ఉండగానే ఏవిధంగా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు? తల్లి గర్భములో పరిశుద్ధాత్మ నింపుదల కొరకు కనిపెట్టియున్నాడా? తల్లి గర్భములో ఉండి ప్రార్ధించమని ఎవరైనా హెచ్చరించారా? లేదు. దేవుడే అతనిని ఆత్మతో నింపియున్నాడు. దేవుడే నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. అది దేవుడు చేసే పనియైయున్నది. ఆయనకు లోబడేకొలది, ఆయన ఆత్మతో నింపుతూ ఉంటాడు. తల్లిగర్భములో నిస్సహాయతతో ఉన్న పిండాన్నే పరిశుద్ధాత్మతో నింపిన దేవుడు, నిన్ను కూడా నిశ్చయముగా పరిశుద్ధాత్మతో నింపుతాడు కాబట్టి ధృడమైన విశ్వాసము కలిగియుండుము.

నకిలీ అనుభవముతో తృప్తిపడవద్దు. నేను నకిలీ అనుభవముతో తృప్తిపడనుగాని పదిసంవత్సరములు పట్టినను నిజమైన ఆత్మ నింపుదల కొరకు కనిపెడతానని ప్రభువుతో చెప్పాను. దానికొరకు ఎంతకాలమైనను వేచియుండవచ్చును. పరిశుద్ధాత్మలో నిజమైన బాప్తిస్మము నిన్ను సంపూర్ణముగా క్రీస్తు సారూప్యములోనికి మార్చి వేస్తుంది.

బాప్తిస్మమిచ్చుయోహాను, పరిశుద్ధాత్మతో నింపబడుట ద్వారా దేవుని దృష్టిలో గొప్పవాడైయున్నాడు(లూకా 1:15). మనలను కూడా పరిశుద్ధాత్ముడు, మనుష్యుల దృష్టిలో కాదుగాని దేవుని దృష్టిలో గొప్పవారలనుగా చేయును.