WFTW Body: 

2 ది.వృ. 20వ అధ్యాయములో సాతానుతో మనము ఏవిధముగా పోరాడగలమో చూస్తాము. అనేకులు దండెత్తి యెహోషాపాతుమీదికి వచ్చినట్లు అక్కడ చదువుతాము. అనేకులైన తన శత్రువులను ఎదుర్కొనే విషయములో యెహోషాపాతు సరియైన పని చేసాడు. యూదా దేశమంతయు ఉపవాసము ఉండి దేవునికి ప్రార్ధించేటట్లుగా చేశాడు. తరువాత వారి బలహీనతను, బుద్ధిహీనతను మరియు వారి విశ్వాసమును ఒప్పుకొని, "మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్ధించెను"(12వ వచనము). మనము ఎంత బలహీనులమో మరియు ఎంత బుద్ధిహీనులమో గుర్తించి, తెలుసుకొని మన పక్షముగా యుద్ధము చేయుటకు, దేవునిని మనము పూర్ణహృదయముతో విశ్వసించాలి.

జ్ణానము కొదువగా ఉన్నవారికి దేవుడు ధారాళముగా ఇస్తానని వాగ్దానము చేశాడు కాబట్టి యెహోషాపాతు తనకు ఏమి చేయాలో తెలియదని మంచిగా దేవునియొద్ద ఒప్పుకున్నాడు. ఆ వాగ్దానాన్ని పొందుకొని, అనుభవించుటకు మనము మొదటిగా విశ్వసించి, ప్రార్ధించాలి (యాకోబు 1:5,6). యెహోషాపాతు అలాగే చేశాడు. అతడు ఏమియు చేయలేని తన నిస్సహయతను మరియు బుద్ధిహీనతను ఒప్పుకొనుట మాత్రమే కాక దేవునియందు పూర్ణవిశ్వాసము ఉంచి ప్రార్ధించాడు. "నీవే మాకు దిక్కు" అని చెప్పాడు. మరొక మాటలో చెప్పాలంటే "మాలోను మరియు మా పక్షముగా నీవే పని చేయాలని కోరుచున్నాము" అని దేవునితో చెప్పుచున్నాడు. మరియు దేవుడు ఆవిధముగానే చేశారు. యెహోషాపాతు ప్రార్ధన చేసిన వెంటనే, దేవుడు అతనితో, " ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరుకాదు దేవుడే జరిగించును. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యెహోవా దయచేయు రక్షణను నిలువబడి చూడండి భయపడకుడి, జడియకుడి (15,17 వచనములు). దేవుని యొక్క మాటలు వినిన వెంటనే యెహోషాపాతు దేవుని ఆరాధించాడు. మరుసటిరోజు "యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి" వారిని యుదా సైన్యానికి ముందుగా నడిపించాడు. వారు దేవునికి పాడుటకును మరియు స్తుతించుటకును ఆరంభించిన వెంటనే దేవుడు వారి శత్రువులను నాశనము చేశాడు (21,22 వచనములు).

స్తుతించే ఆత్మతో ప్రభువునందు విశ్వాసమును వ్యక్తపరచుట ద్వారా శత్రువును జయించగలము. వారు పరిశుద్ధాలంకారములతో దేవుని స్తుతించారు. ఇటువంటి స్తుతించేఆత్మ మరియు పరిశుద్ధత సంఘములో అవసరమైయున్నది. కాని బాధాకారమైన విషయమేమిటనగా - ఈ విషయములో క్రైస్తవులలో రెండు విపరీత ధోరణులను చూస్తాము. ఒకవైపున వారు పరిశుద్ధ జీవితము జీవించరు గాని కూటములలో అన్యభాషలలో మాట్లాడదురు, ఉద్రేకముతో గొప్ప శబ్దముతో స్తుతిస్తారు కాని ఇంటికి వెళ్ళిన తరువాత వారి స్వంత భాషలో భార్యల మీద కేకలు వేస్తారు. ఇది ఒకవిధమైన మోసము. వివేచనలేని శరీరానుసారులకు ఇవి పరలోకసంబంధమైనవిగా ఉండును. వారు ఎంత శబ్దము చేసినను, "శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరని" వివేచన గలిగిన వారు గుర్తిస్తారు (రోమా 8:8). మరొకవైపున దేవుని పరిశుద్ధతతో నింపబడాలని కోరుచూ తమ్ముతాము యదార్ధముగా తీర్పుతీర్చుకొనుచూ ఉండేవారు స్తుతించేఆత్మను కలిగియుండి ఆర్భాటముతో దేవుని స్తుతించరు, ఎల్లప్పుడు ఒకరినిఒకరు హెచ్చరించుట యందే విశ్వాసము ఉంచి, ఎల్లప్పుడు ముభావముగా, తీవ్రముగా ఉంటారు.

సంఘములో ప్రభువైన యేసు రెండు పనులు చేస్తారని హెబ్రీ 2:12లో చెప్పబడింది 1. తండ్రి నామమును ప్రచురించుట 2. తండ్రి కీర్తిని గానము చేయుట. ప్రభువైన యేసు దేవుని వాక్యమును మనయొద్దకు తెచ్చుట మాత్రమేగాక, సంఘములో స్తుతించుటలోను మరియు పాడుటలోను ఆయన మనలను నడిపించే నాయకుడైయున్నాడు. మన సంఘకూటములలో ఈ రెండు విషయములలో ప్రభువు మనకు నాయకుడును మరియు పెద్ద సహోదరుడైయున్నాడు.

మనము సంఘములో వాక్యము చెప్పుటకు నిలువబడినప్పుడు తండ్రి నామమును ప్రకటించాలి గాని మన నామమును కాదు. మనలను ప్రదర్శించుకోవటానికి ప్రకటించకూడదు లేక గతవారములో మనమెంత నమ్మకముగా ఉన్నామో చూపించుకొనకూడదు లేక మనము దేవుని వాక్యముతో ఇతరులను గాయపరచకూడదు. అటువంటి బోధ అంతయు లౌకికమైనదై, శరీరానుసారముగా ఉండి, సైతాను సంబంధమైనదైయుండి ప్రభువు నామమునకు అవమానముగా ఉండును. ప్రభువైన యేసుని గూర్చిన సాక్ష్యము మాత్రమే ప్రవచనసారము (ప్రకటన 19:10). సంఘములో తండ్రిని ఆర్భాటముతోను, శబ్దముతోను స్తుతించుటలో మనము ప్రభువైనయేసుని వెంబడించాలి. ప్రార్ధించుట ఒక్కటే సరిపోదు. తప్పనిసరిగా దేవునిని స్తుతించాలి. పదిమంది కుష్టురోగులు ప్రభువైన యేసుని ప్రార్ధించారు. కాని ఒక్కడు మాత్రమే స్తుతించాడు. ఈనాడు సంఘములో కూడా అదే నిష్పత్తిలో స్తుతించుట బాధాకారము.

యెహోషాపాతు శత్రువులను ఈవిధముగా ఎదుర్కొనుట వలన "ఒక్కడును(శత్రువులలో ఒక్కడైనను) తప్పించుకొనలేదు"(24వ వచనము). దీని భావమేదనగా, సాతానును మనము కూడా విశ్వాసముతోను మరియు స్తుతులతోను ఎదుర్కొనినట్లయితే పరిష్కరించబడని సమస్య అంటూ ఉండదు. 2 ది.వృ. 20వ అధ్యాయము "గొప్ప సైన్యము (అనేక సమస్యలు) వచ్చుటతో ఆరంభమై, ఒక్క శత్రువు (ఒక సమస్య) కూడా లేకుండా పోవుటతో ముగిసింది. మన జీవితములలోని ప్రతి సమస్యను దేవుడు తన మహాశక్తితో పరిష్కరిస్తారు. ఆ యుద్ధము తరువాత యుదా ప్రజలు ఎంతో ధనవంతులయ్యారు(25వ వచనము). క్రీస్తులో ఉన్న శోధింపశక్యముగాని ఆత్మీయ ఐశ్వర్యములను మనము ఈ రీతిగా పొందుకోవాలి.

అయితే యెహోషాపాతు ఆరోజున నేర్చుకొనిన దానిని తరువాత మరచిపోయి, వెనుకంజవేసి తన జీవితము చివరలో రాజీపడ్డాడు. పరిశుద్ధాలంకారములతో దేవుని స్తుతించుట నేర్చుకొనిన అనేకులు చివరివరకు అలాగే కొనసాగుట లేదు. ఏదొక విషయములో రాజీపడతారు. మన విషయములో ఆవిధముగా ఉండనవసరము లేదు. చివరి వరకు మనము నమ్మకముగా ఉండునట్లు మహాశక్తి గల దేవుడు మనలను కాపాడగలడు. మనకు అతిశ్రేష్టమైనది కలుగునట్లు దేవుడే సమస్తమును సమకూర్చి మన జీవితములలో జరిగించుచున్నాడు కాబట్టి ఎల్లప్పుడు, ప్రతి విషయమును బట్టి మనము ప్రభువు స్తుతించాలి (రోమా 8:28). అదియే విశ్వాసముతో స్తుతించుట. మన గత జీవితములను మనము చూసుకొనినట్లయితే, మనకు కీడు చేయుననుకున్న విషయములనేకము మనకేంతో మేలు చేసినవి. భవిష్యత్తులో కూడా ప్రభువు మనకు అలాగే చేయును. దీనిని మనము విశ్వసించినట్లయితే, మనము ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము.

కీర్తన 106:12లో "అప్పుడు వారు ఆయన మాటలు నమ్మరి. ఆయన కీర్తిగానము చేసిరి". ఐగుప్తును విడిచి వచ్చిన ఇశ్రాయేలీయులు వారి శత్రువులు ఎర్రసముద్రములో నశించిన తరువాత దేవుని స్తుతించారు (కీర్తన 106:11). అనగా దేవుడు సమస్యలన్నిటినీ పరిష్కరించిన తరువాత దానిని చూచి వారు స్తుతించారు. పాత నిబంధనలో విశ్వాసమూలముగా జీవించుట అసాధ్యము కాబట్టి వారు ఆవిధంగా చేసారు.

కాని ఇప్పుడు క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ తైలముతో మన తలలు అభిషేకించబడినవి కాబట్టి మనము స్తుతిస్తాము, "మన శత్రువుల యెదుట యెహోవాయే మన కాపరి, శాంతికరమైన జలముల యొద్దకే మనలను నడిపించును"(కీర్తన 23:5,1,2). ఇప్పుడు మనము ఎర్రసముద్రము రెండుపాయలుగా అవ్వకపోయినప్పటికీ, ఐగుప్తీయులు సజీవముగా ఉన్నప్పటికీ చూట్టూ పర్వతములు ఆవరించినప్పటికీ దేవుని స్తుతించగలము. సర్వశక్తిగల దేవునిలో మనకున్న సజీవమైన విశ్వాసమును బట్టి మనము స్తుతిస్తాము.

మరణపులోయలో కూడా మనము భయపడము. ఎందుకనగా దేవుని అనుమతి లేకుండా శత్రువు మన ఒక్క వెంట్రుకను కూడా ముట్టలేడు. "పై నుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారము ఉండదు" (యోహాను 19:11) అని ప్రభువైన యేసు చెప్పినట్లు మనము కూడా శత్రువులతో చెప్పగలము. కాబట్టి మనము చింతించి, మన గురించి మనము బాధపడుటకు గాని, లేక ఫిర్యాదుచేయుటకు గాని లేక పరిస్థితులనుబట్టిగాని లేక ఎవరినిబట్టియైనను సణగము.