దేవుడు ఏలియాను అభిషేకించినదానికంటే రెండంతలుగా ఎలీషాను అభిషేకించెను. దేవుడు ఎలీషా జీవితమును అంగీకరించి యున్నాడనుటకు అది ముద్రగా వున్నది. కాని దేవుడు అతనిని ఆ విధముగా అభిషేకించుటకుముందు, అతడు పరీక్షింపబడెను.
నిజమైన దేవుని సేవకులందరి విషయములో వలెనే, ఎలీషాను కూడా లోక సంబంధమైన పనులను నమ్మకముగా చేసియున్నందువలన పరిచర్యకు పిలువబడెను.
“ఏలియా అచ్చటనుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతనిమీద వేసెను”(1 రాజులు 19:19).
తరువాత, ఎలీషా చాలా సం||లు ఉపచారకుడిగా ప్రవక్తయైన ఏలియాకు పనులు చేయుచూ వుండెను. అతడు “ఏలియా చేతులుమీద నీళ్ళు పోయుచు వచ్చిన” వాడుగా తెలియబడెను (2 రాజులు 3:11).
అతడు గొప్ప విషయముల కొరకు వెదకలేదు కాని దేవునికి ఆ యౌవ్వనస్థుని విషయములో గొప్ప ప్రణాళికలు ఉండెను.
ఏలియా పరలోకమునకు వెళ్ళకముందు, ఎలీషా పరీక్షింపబడవలెను. ఏలియా బేతేలునకు వెళ్ళుచూ, ఎలీషాను గిల్గాలు దగ్గరనే వుండమని చెప్పెను. ఎలీషా అక్కడ వుండుటకు తిరస్కరించి, ఏలియాతోనే వెళ్ళుటకు నిర్ణయించెను. బేతెలు దగ్గర, ఏలియా మరలా ఎలీషాను విడిచి యెరికో వెళ్ళుటకు ప్రయత్నించెను. కాని ఎలీషా ఒక జలగవలే పట్టు పట్టెను. చివరకు యెరికో యొద్దకూడా, ఇదే విధముగా ఎలీషా మరొకసారి పరీక్షింపబడెను. మరొకసారి, పట్టుదల విషయములో ఎలీషా పరీక్షలో నెగ్గి ఏలియాతో యోర్ధానుకు వెళ్ళెను. ఆ విధముగా తన జీవితములో దేవుని యొక్క అతిశ్రేష్టమైన అనగా ఆత్మలో రెండంతల అభిషేకమును పొందెను. (2 రాజులు 2:1-14 )
ఇక్కడ మనకున్న వర్తమానము ఏమిటి? మనము ఆత్మీయ అభివృద్ధిలో అనేక మజిలీలు కలిగియుండి, మనము ఇప్పటికే పొందియున్నదానితో తృప్తి పొందుచున్నామా లేక దేవుని యొక్క అతిశ్రేష్టమైనది పొందుటకు పట్టు వదలక కొనసాగుచున్నామా అని దేవుడు పరీక్షించును.
గిల్గాలు అను స్థలము మనము పాపక్షమాపణ పొందియుండుటను చూపుచున్నది.
“యెహోవా యెహోషువాతో ఇట్లనెను - ‘నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించివేసియున్నాను’. అందుచేత నేటివరకు ఆ చోటికి గిల్గాలను పేరు ”( యెహోషువ 5:8-9 ).
చాలామంది క్రైస్తవులు అక్కడవరకూ వచ్చి మరియు అంతటితో ఆగిపోవుదురు.
కొంతమంది బేతేలు(దేవుని మందిరము) వరకు వెళ్ళెదరు - ఇది దేవుని కుటుంబమైన విశ్వాసులతో సహవాసమును చూపించుచున్నది.
“మరియు యాకోబు ఆ స్థలమునకు బేతేలను పేరుపెట్టెను. మరియు స్థంబముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగునని యాకోబు చెప్పెను” (ఆది 28:19,22 ).
కొందరు ఇక్కడ ఆగిపోవుదురు.
కాని కొద్దిమంది యెరికో వరకు వెళ్ళెదరు - అది దేవుని అద్భుతమైన శక్తిని ప్రకాశింపజేసే స్థలముగా నున్నది.
“ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను... మరియు వారు పట్టణము(యెరికో)ను పట్టుకొనిరి” ( యెహోషువ 6:20)
చాలామంది క్రైస్తవులు అతికష్టముగా ఇక్కడవరకు చేరుదురు.
చాలా, చాలా కొద్దిమంది మాత్రమే యొర్దాను వరకు వెళ్ళుదురు - ఇది బాప్తిస్మము సాదృశ్యముగావున్న - క్రీస్తుతో ఏకమై మరణించుటకు గురుతుగానున్నది.
“ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను” (మత్తయి 3:13 )
చాలా, చాలా కొద్దిమంది ఇటువంటి సిలువ మార్గములో వెళ్ళుటకు ఇష్టపడుచున్నారు. - “యేసు మన కొరకు ప్రతిష్టించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది” (హెబ్రీ 10:20 ).
ఎవరైతే హృదయపూర్వకముగా తమ్ము తాము పూర్తిగా మరణము పొందునంతగా ఉపేక్షించు కొనెదరో, అటువంటి చాలా కొద్దిమంది మాత్రమే రెండంతల అభిషేకమును పొందెదరు - అదియే దేవుని యొక్క శ్రేష్టమైనది.
మనమందరము ఏ మజిలీ దగ్గర నిలిచి పోయెదమోనని నేడు పరీక్షింపబడుచున్నాము.