వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట Religious or Spiritual
WFTW Body: 

"ఎందుకనగా దేవునివాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది"(హెబ్రీ 4:12).

దేవునివాక్యము ఆత్మను మరియు ప్రాణాన్ని విభజించును(4:12). దేవునివాక్యము ఆత్మను మరియు ప్రాణాన్ని విభజించి, మనము ప్రాణము (అనగా మనస్సు,ఉద్రేకములు,చిత్తము) మీద ఆధారపడుచున్నామా లేక ఆత్మలో పరిశుద్ధాత్మమీద ఆధారపడుచున్నామా అను విషయములో మనకు ప్రత్యక్షత కలిగిస్తుంది. పాతనిబంధనలో ఉన్నవారు ఆత్మకు మరియు ప్రాణానికి ఉన్న తేడాను గుర్తించలేరు.

పాతనిబంధనలోని ప్రత్యక్షగుడారములో మూడుభాగములున్నవి - ఆవరణము, పరిశుద్ధస్థలము మరియు అతిపరిశుద్ధస్థలము. అలాగే మనిషిలో కూడా శరీరము, ప్రాణము మరియు ఆత్మ ఉన్నవి (1 థెస్స. 5:23). పరిశుద్ధస్థలము ప్రాణాన్ని మరియు అతిపరిశుద్ధస్థలమేమో ఆత్మను చూచిస్తున్నాయి. దేవుడు అతిపరిశుద్ధస్థలములో అనగా మన ఆత్మలో నివసిస్తారు. పరిశుద్ధస్థలానికి మరియు అతిపరిశుద్ధస్థలానికి మధ్యలో మందమైన తెర ఉన్నది. సంవత్సరములో ఒకసారి ప్రధానయాజకుడు తప్ప మరి ఎవరును అతిపరిశుద్ధస్థలములోనికి వెళ్ళటానికి వీలులేదు. అనగా పాతనిబంధనలో ఎవరును "ఆత్మలో" ఆత్మానుసారముగా జీవించలేరు లేదా దేవుని సేవ చెయ్యలేరు. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఏది ఆత్మసంబంధమైనదో లేక ఏది ప్రాణసంబంధమైనదో తేడా తెలియదు. ఈ రెండిటిమధ్య తేడా తెలియనివారు ఇంకను పాతనిబంధన క్రైస్తవులే.

ఏది ఆత్మసంబంధమైనదో లేక ఏది ప్రాణసంబంధమైనదో దేవునివాక్యము మనకు బయలుపరుస్తుంది. ఈనాడు "క్రైస్తవపరిచర్య" అని పిలువబడే పరిచర్యలో ఎక్కువభాగము ప్రాణసంబంధమైయున్నది. ప్రాణసంబంధమైన పరిచర్య మనుష్యులయొక్క తలంపులు మరియు చిత్తప్రకారము చేయబడుతుంది. వారి తలంపులు, అభిప్రాయములు చెడ్డవికాకుండా మంచివైయుండవచ్చును. అయితే అవి మనిషిలోనుండి వచ్చినవి మరియు ప్రాణసంబంధమైయున్నవి. మూడు రకాల క్రైస్తవులు ఉన్నారు. ప్రకృతిసంబంధమైన క్రైస్తవులెవరనగా క్రొత్తగా జన్మించి, రక్షణపొందినవారైయుండి కూడా "కొద్దిగా" పాపమును బట్టి ఆనందిస్తూ, సిరిని ప్రేమిస్తూ మొదలైనవి చేయుచూ ఉంటారు. ప్రాణసంబంధమైన క్రైస్తవులెవరనగా మనుష్యజ్ఞానముతో జీవిస్తూ పాపములో సంతోషించరు గాని ఇంకను వారి తలంపులతోను, ఉద్రేకములతోను మరియు వారి చిత్తములోను జీవిస్తారు. అయితే ఆత్మసంబంధమైన క్రైస్తవులెవరనగా వారు చేసేవన్నియు పరిశుద్ధాత్మతో నడిపించబడాలని కోరువారు.

ప్రాణసంబంధమైన క్రైస్తవులు మంచివారైయుండి, సాక్షులుగా ఉండవలెననియు మరియు దేవుని సేవించాలని కూడా కోరెదరు. వారు, వారు చేసేదంతయు దేవుని శక్తితోగాక స్వంతశక్తితో చేస్తారు. వారు దేవుని మార్గములను ఎరుగరు. దేవుడు ఇట్లనుచున్నాడు, "నా తలంపులు మీ తలంపులవంటివి కావు మీ త్రోవలు నా త్రోవలవంటివి కావు ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపుల కంటె నాతలంపులు అంత యెత్తుగా ఉన్నవి" (యెషయా 55:8,9). ఆత్మలను రక్షించుటకు మనుష్యుల పద్ధతులను ఉపయోగించి మరియు మనుష్యజ్ఞానముతో వారి పద్ధతులను ఉపయోగించి దేవుని సేవిస్తారు. ఫిలిష్తీయులు ఒకప్పుడు చేసిన రీతిగా దావీదుకూడా ఒకసారి దేవుని మందసాన్ని ఎద్దులబండి మీద తీసుకొని వెళ్ళాడు (2 సమూయేలు 6:3, 1 సమూయేలు 6:11). మందసాన్ని చాలాదూరము మోయుట కష్టము కాబట్టి ఆవిధముగా చేయుట మంచి ఉద్దేశమే కాని అది దేవుని విధానము కాదు. కాబట్టి మార్గములో దేవుని తీర్పు వచ్చియున్నది.

ఎక్కడైతే దేవుని పనిలో మనుష్యలపద్ధతి ఉపయోగిస్తారో అక్కడ కలవరము ఉంటుంది. బాహ్యాముగా ఫలితాలు ఉండవచ్చును. కాని అక్కడ దేవుని మహిమ ఉండదు. దేవుడు చెప్పినట్లుగానే అక్షరాలా మోషే మందసాన్ని కట్టాడు. తాను ఐగుప్తులో పిరమిడ్స్ ఏవిధముగా నిర్మించాలో నేర్చుకొనిన తన జ్ఞానాన్ని ఉపయోగించలేదు. దేవునిఇల్లు కట్టుటలో అతడు మనుష్యజ్ఞానాన్ని విసర్జించవలసియున్నది. మానవజ్ఞానమునుండి మోషే విడుదల పొందు నిమిత్తమే అరణ్యములో 40 సంవత్సరములు ఉండునట్లు దేవుడు అతనిని నడిపించాడు. పౌలు గమలియేలు దగ్గర 3 సంవత్సరములు నేర్చుకొనిన దానినుండి విడుదల పొందునట్లు దేవుడు అతనిని అరేబియాకు నడిపించాడు (గలతీ 1:17,18). దేవుని మార్గములను ఎరుగుటకు ముందుగా తన స్వంతజ్ఞానాన్ని (స్వాభావికజ్ఞానమును) విసర్జించవలసియున్నది.

ప్రాణము మానవశక్తిని కూడా చూపిస్తున్నది. అనగా మనుష్యులమీద ఆధారపడుటను చూపుచున్నది. మనకు ఎలక్ట్రిక్సామానులు ఉండి మరియు రాజకీయ పలుకుబడిఉన్నట్లుయితే దేవునిపని బాగుగా చేయవచ్చునని మనము ఊహించుకోవచ్చును. అది మోసము. పరిశుద్ధాత్మశక్తి ద్వారానే దేవునిపనిని చెయ్యగలము. ఆదిమ అపొస్తలులకు ధనములేదు అనేక పరికరములులేవు లేదా పలుకుబడి లేదు. మనుష్యుల ద్వారా వారు పొందుకొనినది ఏమియులేదు సున్నా మాత్రమే. కాని ఈనాడు క్రైస్తవులు వారి పరికరాలతోను, డబ్బుతోను మరియు పలుకుబడితోను చేసే పరిచర్యకంటే ఎంతో ఎక్కువగా వారు చేశారు. అపొస్తలులు ఆత్మీయశక్తిని కలిగియున్నారుగాని ప్రాణసంబంధమైన శక్తినికాదు.

మనము ఆత్మసంబంధులమై ఆత్మానుసారముగా ఉండవలెనంటే, ఆత్మను మరియు ప్రాణాన్ని (మనస్సు,ఉద్రేకము,చిత్తము) మనము వేరుచేయాలి. నేను చాలా కూటములలో చూసిందేమిటంటే, అక్కడున్న శబ్దమునుబట్టియు, ఉద్రేకములనుబట్టియు అక్కడ పరిశుద్ధాత్మ చలిస్తున్నాడని చెప్తారు. కాని నేను మోసపోను. అక్కడ కేవలము మనుష్యప్రాణమే పని చేస్తుందిగాని పరిశుద్ధాత్మ వారిలో పని చేయుటలేదని నేను స్పష్టముగా చూడగలను. "పరిశుద్ధాత్మలో బాప్తిస్మము" అని వారు చెప్పుచున్నది కేవలము "వారి స్వంతశక్తి" మాత్రమే. ఈనాడు కూడా ప్రభువైనయేసు క్రైస్తవులను పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిస్తారు. అయితే అది క్రీస్తు సజీవుడనుటకు సాక్షులుగా జీవించుటకు కావలసిన ఆత్మీయశక్తి(దేవునిశక్తి)ని ఇస్తుంది (అ.కా. 1:5,8). మానవశక్తి కేవలము ఉద్రేకములను మాత్రమే రేకెత్తించగలదు. కాని చాలామంది క్రైస్తవులకు ఈ వివేచన లేదు కాబట్టి మోసపోవుచున్నారు.

క్రైస్తవేతర కూటములలో కూడా "భాషలతో మాట్లాడి", ఉద్రేకాన్ని కలిగించి మరియు "అంతరంగ విశ్రాంతి వచ్చిందని" చెప్పెదరు. అనేక మతాలలో మానవశక్తి ద్వారా ఇతరులను ఉద్రేకపరుస్తారు.

ఈ రోజులలో మనకు ఆత్మకు మరియు ప్రాణానికి మధ్య ఉన్న తేడా తెలియనట్లయితే పూర్తిగా మోసపోతాము. ఈనాడు ప్రభువైనయేసు నామములో జరుగుచున్న "స్వస్థతలు" పరిశుద్ధాత్మ శక్తితోగాక మానవశక్తితో చేయుచున్నారు. పాటలు పాడుటద్వారా ఒకలాంటి "వాతావారణము" కలుగునట్లు చేస్తారు. "ప్రభువా, నిన్ను నమ్ముచున్నాను" అని అనేకసార్లు పాడించి, ప్రజలలో ఉద్రేకాన్ని కలిగిస్తారు. అప్పుడు "వారి విశ్వాసాన్ని విడుదల చెయ్యమని" ప్రజలతో చెప్తారు. అక్కడ దేవుడు ఏమియు చెయ్యడు. బోధకుడు ప్రజలను హిప్నొటైజ్ చేస్తాడు. ప్రభువైనయేసుగాని లేక అపొస్తలులుగాని ఆవిధముగా ఒక్కసారి కూడా చెయ్యలేదు. పాటలు పాడకుండానే లేక ఉద్రేకము కలిగేటట్లు చెయ్యకుండానే నిశ్శబ్దముగా స్వస్థపరిచారు.

ఈ నకిలీ స్వస్థతను నీవు గుర్తించనట్లయితే, నీవు కూడా అలాగే చేసి దేవుని సేవిస్తున్నావని నీవనుకోవచ్చును. నీలో ఉన్న స్వంతశక్తిని ఉపయోగించి ఇతరులను మరియు నిన్నునీవును మోసగించుకొను అవకాశమున్నది. కాబట్టి నీలో దేవునివాక్యము చాలా లోతుగా నీ ప్రాణాత్మలలోనికి వేరుపారనిచ్చినప్పుడు, ఏది ఆత్మసంబంధమైనదో లేక ఏది ప్రాణసంబంధమైనదో తెలుసుకొనగలవు. నీవు ప్రభువైనయేసునే కోరుకొని, ఆయననే చూచినప్పుడు, ఆయనలో నీ అవసరమంతయు తీర్చబడుతుంది. నీవు ఎప్పుడైనను ఒకవేళ స్వస్థత కూటానికి వెళ్ళినను లేక క్రైస్తవ టీవి కార్యక్రమం చూచినను, ప్రభువైనయేసు ఆవిధముగానే చేస్తారా అని ప్రశ్నించుకొనుము. నీవు వెంటనే సత్యమును గ్రహించగలిగెదవు. కాని నీవు దేవునివాక్యాన్ని చదివి ధ్యానించకుండా నిర్లక్ష్యము చేసినయెడల, నిశ్చయముగా నీవు మోసపోయెదవు. దేవునివాక్యము నీలో లోతుగా పనిచెయ్యనిచ్చి, ఆత్మ మరియు ప్రాణమును వేరు చెయ్యనివ్వుము. మనకు నిజమైన ఆత్మీయతను చూపించుటకు దేవుడు మనకు తన వాక్యమును, ప్రభువైనయేసును మరియు అపొస్తలులయొక్క మాదిరిని మన యెదుట ఉంచియున్నారు.