వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   నాయకుడు తెలిసికొనుట
WFTW Body: 

నిర్గమకాండము 4వ అధ్యాయములో దేవుడు మోషేను పిలుచుట గూర్చి చదువుతాము. మోషేను ప్రొత్సహించి మరియు అతనికి బోధించుటకు మూడు సూచనలు దేవుడు అనుగ్రహించాడు. "నేను చెప్పునది వారు నమ్మరని" మోషే దేవునితో చెప్పినప్పుడు, నీ చేతిలో ఏమున్నదని ఆయన అడిగాడు, దీనిని గమనించండి. మన చేతిలో ఇప్పటికే ఉన్నదానితో దేవుడు ఎల్లప్పుడు ఆరంభిస్తాడు. మనకు లేనిదానికొరకు మనము చూడనవసరము లేదు. విధవరాలిని ఎలీషా ఇట్లడిగాడు, "నీ యింటిలో ఏమున్నది?" నూనె కుండ ఉన్నదని ఆమె చెప్పింది (2 రాజులు 4 : 2, 3). మోషే చేతిలో కఱ్ఱ మాత్రమే యున్నది. అది చాలును. దేవుడే నీతో ఉన్నట్లయితే, కఱ్ఱతో కూడా అద్భుతములు జరుగును.

మొదటి సూచన: కఱ్ఱను నేలపడవేయుమని మోషేతో దేవుడు చెప్పాడు. అది పాముగా మారింది. మోషే దాని నుండి పారిపోయాడు (నిర్గమకాండము 4 : 3). "భయపడవద్దు నీ చేయి చాపి దాని తోక పట్టుకొనుమని దేవుడు చెప్పాడు. అతడు దానిని పట్టుకొనగా, అది మరలా కఱ్ఱగా మారింది. ఇక్కడ మనకున్న సందేశమేమిటి? కఱ్ఱ మోషేకు ఎంత సన్నిహితముగా ఉన్నదో సాతాను మనకు అతడు అంత సన్నిహితముగా ఉన్నాడు. సాతాను మనకు ఎంతో దూరములో ఉన్నాడని నీవనుకొనుచున్నావా? కాదు. భార్యభర్తల మధ్య, పరిచారకుల మధ్య మొదలగువారి మధ్య మనస్పర్ధలు వచ్చేటట్లు చేస్తాడు. కాని మనము సాతానుని జయించవచ్చును. అతడు ఇప్పటికే నశింప చేయబడి ఓడిపోయాడు. కాబట్టి మనము అతనికి భయపడము. దేవుడు అతనిని మన పాదముల క్రింద త్రొక్కిపెట్టును. మనము ప్రభువును సేవించునప్పుడు, మొదటిగా మనము నేర్చుకొనవలసిన పాఠము, "సాతానుకు భయపడకూడదు". సాతానుకు కోట, దుర్గము ఉన్నది కాని మనము అతని నుండి పారిపోము. మనము యౌవనేచ్చల నుండి పారిపోవాలి (2 తిమోతి 2 : 22). అయితే సాతాను మనయొద్దనుండి పారిపోతాడు (యాకోబు 4 : 7). సాతాను ఏ నామమును బట్టి మనలను భయపెట్టాలనుకుంటాడో ఆ సర్వశక్తిగల శ్రేష్టమైన యేసునామమే, సముద్రములను రెండు పాయలుగా చేసి, దేవుని ప్రజలు ముందుకు వెళ్ళుటకు మన చేతిలో కఱ్ఱగా ఉండును.

దేవుని సేవకులముగా మనకు మొదటిగా బైబిలు జ్ఞానముకాదు గాని దేవుని యొక్క పునరుత్ధానశక్తి, అధికారము కావాలి. నేను ఏరోజైనా బైబిలు జ్ఞానము కంటే ఆత్మీయ శక్తి (జీవింపజేసే పరిశుద్ధాత్మ శక్తి)ని కలిగియుంటాను. మోషేకు మొదటిగా శత్రువు మీద అధికారము కావాలి. తన దాసుడైన ఫరో ద్వారా సాతాను, ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసుకొనుటకు ప్రయత్నించియున్నాడు. కాబట్టి భయపడకుండా దాని తోక పట్టుకొని లేపాడు. సాతానును గూర్చి మనమెప్పటికీ భయపడకూడదు.

రెండవ సూచన: దేవుడు మోషేతో నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమని చెప్పాడు (6వ). మోషే తన చెయ్యిపెట్టి, తీసిన తరువాత ఆ చెయ్యి కుష్టుకలదాయెను. దేవుని సేవకులముగా మనము తెలుసుకొనవలసిన రెండవ విషయము, మన శరీరమందు మంచిది ఏదియు నివసింపదు (రోమా 7 : 18). స్వార్ధము మరియు భ్రష్టత్వము మన శరీర(ప్రాచీన స్వభావ)మంతటిలో ఉన్నది. నీవు ఇది నిజముకాదనుకొనినచో, నిన్ను నీవే పరీక్షించుకొనుము. నీలో ఉన్న కుష్టురోగము గురించి, నీకు వెలుగు దయచేయుమని దేవునికి ప్రార్ధించుము. నీవు ఈపాఠము నేర్చుకొననట్లయితే, ఇతరులు నీకంటే చెడ్డవారని వారిని ఖండించే అవకాశమున్నది. మనము చేయలేని పాపయేదియు ఇతరులు చేయరు. వారు చేసిన పాపము మనము చేయలేదంటే దానికి కారణము కేవలము దేవుని కనికరము మరియు వారికి వచ్చినంతగా మనకు శోధన రాకపోవడము. మనము ఏ మనిషి కంటే కూడా మంచివారముకాదు. ఈ లోకములో ఉన్న ఏఒక్క వ్యక్తికంటే కూడా నీవు మంచివాడవనుకుంటే దేవుని సేవకు నీవు అనర్హుడవు.

మూడవ సూచన: కొంచెము ఏటినీళ్ళు తీసుకొని ఎండిననేల మీద పోయగా రక్తమగును (9వ). నైలునది ఐగుప్తీయులకు ఇష్టదేవత మరియు రక్తము మరణానికి సాదృశ్యము. దీనియొక్క ఆత్మీయ అర్ధమేమిటనగా ఈ లోకస్తులు ఆశపడి వెంటాడి మరియు ఆరాధించే ఈ లోకసంబంధమైనవన్నియు చివరకు మరణాన్ని తెస్తాయి. ఒకదైవసేవకునకు లోకమును లోకమునకు అతడును సిలువ వేయబడియున్నారు. ఈ లోకము, నాకు అత్యవసరమైన జీవజలనదికాదు కాని రక్తమైయున్నది. కాబట్టి అది త్రాగవలెననే శోధన కూడా నాకురాదు. ఈ లోకములోని సమస్తమును మనము ఆవిధముగా చూడాలి.