వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట
WFTW Body: 

రోమా 7వ అధ్యాయములో పాపముమీద జయముపొంది, పరిశుద్ధముగా జీవించాలని కోరిన ఒక వ్యక్తి ఉన్నాడు కాని ఏవిధంగా జీవించగలడో తెలియదు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ వివాహన్ని చూపిస్తున్నాడు (4వ వచనము). మనము రక్షణపొందకముందు, ప్రాచీనపురుషునితో మనకు వివాహమైంది. రక్షణపొందిన తరువాత, క్రీస్తును పెళ్ళిచేసుకొని ఆయనతో ఏకాత్మయైయున్నామని ఎరుగక ధర్మశాస్త్రముతో పెళ్ళాడి పొరపాటు చేయుచున్నాము. పాపముమీద జయముపొందగోరే ప్రతివిశ్వాసి ఈ పొరపాటును చేస్తాడు. ధర్మశాస్త్రాన్ని వివాహము చేసుకోవటమంటే తన స్వంత శక్తితో పాపముమీద జయముపొందుటకు ప్రయత్నించుట. 6 మరియు 7 అధ్యాయములలో మూడు ఆత్మీయవివాహలు చూస్తాము. మొదటిగా ప్రాచీనపురుషునితో, తరువాత ధర్మశాస్త్రముతో, చివరకు క్రీస్తుతో వివాహమవుతుంది.

ప్రాచీనపురుషుడు(ప్రాచీనస్వభావము) చెడ్డభర్తయైయుండి, భార్యనుకొట్టి, హింసించి, ఆమెను వ్యభిచారిణిగా మార్చి మరియు ఆమెను, ఆమె సంతోషాన్ని నాశనము చేశాడు. ఈ భార్య తన దుష్టుడైన భర్తనుండి విడుదలపొందుటకు ఎంతో కోరుతూ ఉంటుంది. ఒక రోజు ప్రాచీనపురుషుడు చనిపోతాడు. ఆమె క్రొత్తగా జన్మిస్తుంది. ఇప్పుడు మరలా వివాహము చేసుకొనుటకు విడుదల పొందియున్నది. కాని ఆమె క్రీస్తును వివాహము చేసుకొనుటకు బదులుగా క్రీస్తువలె ఉన్న ధర్మశాస్త్రాన్ని వివాహమాడుతుంది.

ధర్మశాస్త్రము నీతిని కోరుతూ, పరిపూర్ణమైయుంది కాబట్టి క్రీస్తుకు బదులుగా ధర్మశాస్త్రాన్ని స్వీకరించే పొరపాటు చేయటం మనకు చాలా సులభము. ధర్మశాస్త్రము ప్రాచీనపురుషునివంటిదికాదు. అతనివలె భార్యని హించించదు లేక బాధపెట్టదు. కాని ధర్మశాస్త్రము పరిపూర్ణతను కోరుతుంది. ఉదయం 6 గంటలకే లేవాలని డిమాండ్ చేస్తుంది. 8 గంటలకే టిఫెన్(అల్పాహారము) తయారు కావాలని డిమాండ్ చేస్తుంది. 8 గంటల ఒక నిమిషం(8:01) కూడా కాదు 8 గంటలకే. పరిపూర్ణత అంటే అదే. ఇల్లంతయు పరిశుభ్రంగా ఉండాలి. చెప్పులు ఎల్లప్పుడు వాటి స్థానములో ఉండాలి. బట్టలు శుభ్రంగా ఉతికి, మంచిగా ఇస్త్రీ చేయాలి. చెడును చేయమని ధర్మశాస్త్రము చెప్పదు. ప్రతి విషయములోను పరిపూర్ణతను కోరే ఇటువంటి భర్తను ఎంతమంది యవ్వనస్త్రీలు వివాహము చేసుకొనుటకు ఇష్టపడతారు? ప్రాచీనపురుషుని విడిచి ధర్మశాస్త్రాన్ని పెళ్ళి చేసుకొన్నట్లయితే, పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లుగా ఉంటుంది. అతడు మంచివాడేగాని ఎల్లప్పుడు డిమాండ్ చేస్తూ ఉంటాడు.

అతడు చెడ్డదానిని కోరడుగాని నీవు అతని స్థాయికి ఎన్నటికీ చేరుకోలేవు. అప్పుడు నీవు తప్పుడు వ్యక్తిని వివాహము చేసుకున్నావని గ్రహిస్తావు. కాబట్టి ఇప్పుడు ఏమి చెయ్యగలవు? దేవుడిచ్చిన ధర్మశాస్త్రమెన్నటికీ చనిపోదు. ఇక్కడ ఆరోగ్యముతో ఉన్న బలమైన, ఎల్లప్పుడూ నివసించే భర్తను చూస్తున్నాము. భర్తగల స్త్రీ, అతడు బ్రతికియున్నంతవరకు అతనికే బద్ధురాలు (రోమా 7:2). కాబట్టి ఆ స్త్రీ తాను ఎన్నటెన్నటికీ సంతోషించలేనని తెలుసుకుంటుంది.

అప్పుడు దేవుడు ఒక ఆశ్చర్యకార్యాన్ని చేశారు. ఆ స్త్రీని చనిపోయేటట్లు ఆయన చేసి, ఆ వివాహము నుండి విడుదల కలుగచేశాడు. మొదటి భర్తయైన ప్రాచీనపురుషుడు చనిపోయాడు. ఇప్పుడు భార్య అనగా నీవు క్రీస్తుతోకూడా సిలువవేయబడి చనిపోయావు. "కావున నా సహోదరులారా, మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు మృతులలోనుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి"(రోమా 7:4). ఇప్పుడు నీవు క్రీస్తుతో కూడా చనిపోయావు కాబట్టి ఇంక ఏమాత్రమును ధర్మశాస్త్రము క్రిందలేవు. మరియు దేవుడు నిన్ను క్రీస్తుతో కూడా లేపియున్నాడు కాబట్టి ఇప్పుడు నీవు క్రీస్తుని పెళ్ళి చేసుకోవచ్చును. ఇదియే మహిమకరమైన మూడవ వివాహము. అయితే క్రీస్తు పరిపూర్ణుడైయుండి, ఇట్లనును, "ఉదయం 8 గంటలకు టిఫెన్ తయారు కావాలి, 8:01 గంటలకు కాదు, ప్రతీది కూడా సమయానికి జరగాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి" మొదలైనవి. ఇవి ధర్మశాస్త్రము కంటే తక్కువ డిమాండ్స్ కాదు. నిజానికి ఇంకా ఎక్కువే. "నీవు వ్యభిచారము చేయవద్దని" ధర్మశాస్త్రము చెపుతుంది. నీవు స్త్రీని మోహపు చూపుతో చూడొద్దని ప్రభువైనక్రీస్తు చెప్పుచున్నాడు. కాని ధర్మశాస్త్రానికి మరియు క్రీస్తుకూ చాలా తేడా ఉంది. క్రీస్తు ఇట్లనుచున్నాడు, "మనిద్దరము కలసి టిఫెన్ తయారు చేద్దాము". క్రీస్తే మనలో జీవిస్తున్నాడు కాబట్టి సమస్తమును ఆయనతో కలసి చేస్తాము.

ఒకవేళ నీవు చాలా బలహీనురాలవైన భార్యవైయుండి, టిఫెన్‍ను మధ్యాహ్నం ఒంటిగంటకు తయారు చేశావనుకొనుము. ధర్మశాస్త్రమువలె ప్రభువు నిన్ను గద్దించడు లేక నిన్ను తృణీకరీంచడు. ఆయన ఇట్లంటాడు, "ఫరవాలేదు, మనిద్దరము కలసి చేద్దాము మరియు నీవు కొంచెం నేర్చుకొని వృద్ధిని పొందుతావు". మరియు ప్రభువు నీలోను, నీతోను పని చేస్తాడు మరియు కొద్దిరోజుల తరువాత ఉదయం 11 గంటలకు టిఫెన్ తయారుచేస్తావు. ప్రభువిట్లనును, "అద్భుతం, మనమిప్పుడు మధ్యాహ్నం ఒంటిగంట నుండి 11 గంటలకు చేసియున్నాము. ఈ దినానలో ఒకరోజు 8 గంటలకు తయారు చేస్తాము. పరిపూర్ణుమగుటకు సాగిపోతూ ఉందాము". ఒకవేళ నీవు బట్టలు సరిగా ఉతకలేక, వాటి మీద మరకలున్నట్లయితే, ప్రభువు నీతో ఇట్లనును, "ఫరవాలేదు బాధపడకు, ఆ విషయంలో కూడా ఇద్దరము కలసి పనిచేద్దాము". ఆయన సహాయంతో నీవు మరల బట్టలు ఉతికినప్పుడు, కొద్దిగా తక్కువ మరకలు ఉండును. మరకలన్నియు పోయేవరకు ప్రభువు నీలోను, నీతోను పని చేయాలని తీర్మానించుకొని, నిర్ణయించుకున్నాడు. కాబట్టి నీవు సంపూర్ణుడువగువరకు ప్రభువు నీతో పని చేస్తాడు.

ఆయన తన పెండ్లికుమార్తెతో ఎలా పనిచేస్తాడో నీవు చూస్తున్నావా? ధర్మశాస్త్రమువలె ఆయన కేవలము ఆజ్ఞలు మాత్రమే ఇవ్వడుగాని మనము ఆయన సహపనివారము గనుక ఆయన మనలో పని చేస్తాడు. ఆవిధమైన భర్తగా ప్రభువైనయేసు మనకున్నారు.