వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   పురుషులు
WFTW Body: 

“నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివని” సాతాను దేవునితో అనెను (యోబు 1:10). సాతాను చెప్పినదానినుండి మూడు గొప్ప సత్యములు నేర్చుకొనుచున్నాము. దైవజనులచుట్టు దేవుడు మూడింతలుగా కంచెను ఉంచెను. మొదటిగా వ్యక్తి చుట్టు, రెండవదిగా అతని కుటుంబముచుట్టు మరియు మూడవదిగా అతనికున్న ఆస్తి మరియు సమస్తముచుట్టు కంచె ఉంచెను. సాతాను ఆత్మీయ రాజ్యము(మండలము)ను చూచును మరియు యెరుగును. మనము ఆ కంచెలను చూడలేము కాని అవి అక్కడ ఉన్నవి.

సాతాను ఆత్మగా ఉన్నాడు మరియు యోబునుగాని అతని కుటుంబమునుగాని లేక అతని ఆస్తినిగాని ముట్టలేడని గ్రహించియున్నాడు. నేను కూడా దైవజనుడుగా ఉన్నట్లయితే, నాచుట్టు కూడా మూడు కంచెలు ఉన్నవని యెరుగుటలో నాకు ఎంతో ఆదరణ ఉన్నది. దేవుని అనుమతి లేకుండా ఆకంచెలు తెరుచుకొనవు. ఆ కంచెలలోగుండా వెళ్ళుటకు సాతాను, దేవుని అనుమతికొరకు అడుగవలసియున్నదని యోబు గ్రంధములో కనుగొనగలము.

అనేకసంవత్సరముల తరువాత ప్రభువైనయేసు పేతురుతో ఈలాగే చెప్పెను : “ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను” (లూకా 22:31).

కొన్నిసార్లు సాతాను కంచెలోగుండా వచ్చుటకు దేవుడు అనుమతించును. మొదటిగా సాతానును యోబు ఆస్తిపై మరియు కుటుంబముపై పడుటకు దేవుడు అనుమతించెను. తరువాత యోబు ప్రాణమును ముట్టకుండా అతని శరీరమును మాత్రము మొత్తుటకు దేవుడు సాతానుకు అనుమతించెను. గనుక సాతాను యోబును చంపలేకపోయాడు. సాతాను యోబును చంపవలెనని కోరియుండవచ్చును గాని ఆలాగు చేయలేకపోయెను. అతడు బాధగల కురుపులతో మాత్రమే యోబును మొత్తెను.

మొదటికంచె తెరువబడినప్పుడు, సాతాను లోపలికివెళ్ళి యోబు ఆస్తినంతటిని నాశనము చేసెను. ఒక్కరోజులో యోబుయొక్క లక్షలవిలువచేసే ఆస్తి సున్నా అయినది.

రెండవకంచె తెరువబడినది. ఈ కంచెలో యోబు భార్య మరియు పిల్లలు ఉన్నారు. గనుక సాతాను యోబు పిల్లలందరిని చంపెను, యోబు భార్యనుకూడా చంపియుండెడివాడు. కాని చంపలేదు. ఎందుకనగా ఆమె చనిపోవుటకంటే బ్రతికిఉంటేనే సాతానుకు లాభము! యోబును ఇబ్బంది పెట్టుటకును మరియు అతనికి కోపము వచ్చునట్లు చేయుటకును సాతాను ఆమెను ఉపయోగించుకొనవచ్చును. కోపము కలిగించే భార్యను నీవు చూసినట్లయితే, సాతాను ఆమెను సజీవముగా ఎందుకు ఉంచెనో నీవు గ్రహించవచ్చును! కొంతమంది చనిపోవుటకంటే బ్రతికితేనే అపవాదికి లాభము.

లేఖనములలోని మొదటి పేజీలలో సాతాను గురించికూడా కొన్ని విషయములను మనము నేర్చుకొనవచ్చును.

మొదటిది: ఒక సమయములో సాతాను ఒకే స్థలములో ఉండగలడు. దేవుడు సర్వాంతర్యామి. సాతాను సృష్టించబడినవాడు గనుక ఒక స్థలములో ఉంటే వేరొక స్థలములో ఉండలేడు. కాని భూమిమీద అతనిపని చేయుటకు చాలా దయ్యములు అతనికి ఉన్నవి.

రెండవది: సాతాను భవిష్యత్తును చూడలేడు, అతనికి భవిష్యత్తు తెలిసినయెడల, యోబు మరిఎక్కువగా ఆశీర్వదించబడతాడని తెలిసి సాతాను అతని జోలికి వెళ్ళియుండెవాడుకాదు. యేసుక్రీస్తు కల్వరి సిలువ మరణముద్వారా తానే ఓడించబడతాడని సాతానుకు ముందే తెలిసినయెడల, క్రీస్తును సిలువ వేయుటకు ప్రజలను ప్రేరేపించేవాడని మీరనుకుంటున్నారా? ఎంతమాత్రముకాదు. ఉరికొయ్యమీద హామానే ఉరితీయబడతాడని సాతానుకిముందే తెలిసినయెడల, హామాను ఉరికొయ్య తయారుచేయుటకు సాతాను సహాయపడేవాడుకాదు. లోకములో ప్రజలు ఏమిచేయుచున్నారో అతడు తెలుసుకొనగలడు కాని ఆ సాతానుకు భవిష్యత్తు తెలియదు.

మూడవది: సాతాను మన తలంపులను తెలుసుకొనలేడు. బహిరంగముగా నీవు చేయుచున్నదే అతడు తెలుసుకొనగలడు. యోబు గురించి కేవలము బాహ్యముగానే అతడు తెలుసుకొనెను. యోబు తలంపులను అతడు చూడలేకపోయెను.

నాలుగవది: దేవుడు పిల్లలను మొత్తుటకు సాతానుకు దేవుని అనుమతి అవసరమైయున్నది.

నేను పోరాడుచున్న ఈ శత్రువునకు భవిష్యత్తుగాని, నా తలంపులుగాని తెలియదు మరియు అతడు దేవుని ఆధీనములో ఉన్నాడు కాబట్టి అది నాకు ఎంతో ఆదరణగా ఉన్నది. అన్నిటికంటెపైగా అతడు సిలువలో ఓడించబడియున్నాడు. ఆ విషయము సాతాను గురించిన భయమంతటిని తీసివేయుచున్నది. రెండవకంచె తీసినప్పుడు, యోబు పదిమంది పిల్లలను పోగొట్టుకున్నాడు. ఒక దైవజనుని పిల్లలు శ్రమలలో ఉంటే లేక సమస్యలను ఎదుర్కొనుచున్నట్లయితే ఎన్నటికీ ఆ దైవజనుని నీవు తీర్పు తీర్చకూడదు. వారికొరకు ప్రార్ధించుము. నీవలె కాకుండా అతని పిల్లలు సాతానుకు గురిగా ఉండవచ్చును ఎందుకనగా అతడు నీవలె సర్ధుబాటు చేసుకొనిపోయేవాడు కాడని సాతానుకు తెలుసు. బహుశా అందువలన సాతాను నిన్నును నీ కుటుంబమును ఒంటరిగా విడిచిపెట్టును! ఇప్పుడు దీనంతటికీ యోబు ఎలా స్పదించాడో చూడుము. తాను సమస్తమును పోగొట్టుకున్నాడని యోబు వినెను. ఒకరి తరువాత మరియొక సేవకుడు వచ్చి సమస్తమును పోయెనని చెప్పిరి. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసెను (యోబు 1:20).

లేఖనములలోని మొదటి పేజీలలో చూచే ఒక విషయము ఇది. ఒక దైవజనుడు ఆరాధించేవాడుగా ఉండును. బైబులు తెలిసినదానికంటే మరియు ప్రభువును సేవించుటకంటేముందు ఒక దైవజనుడు ఆరాధికుడుగా ఉండును. నీవు అన్నిటిని కలిగి ఉన్నను నీవు ఆరాధికుడుగా ఉండవలెను మరియు అన్నిటినీ పోగొట్టుకొనినను నీవు ఆరాధికుడిగా ఉండవలెను. “దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధింపవలెను మరియు తన్ను ఆరాధించువారు అట్టివారు కావలెనని తండ్రి కోరుచున్నాడు” (యోహాను 4:24). దేవుని ఆరాధించుట అనగా అన్నిటిని ఆయనకు ఇచ్చుట. “నేను నా తల్లి గర్బములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనిపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏవిషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు” (యోబు 1:21,22). దిగంబరిగా వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదనని బహుశా భూమి గురించి యోబు చెప్పియుండవచ్చును. ప్రభువు తన జీవితములో అనుమతించిన దానంతటిని అతడు అంగీకరించెను.

ప్రభువుయెడల యోబుసమర్పణను నేను తలంచినప్పుడు నాకు ఆశ్చర్యమేసినది. మనకున్నట్లుగా అతనికి ప్రభువైన యేసుగాని లేక అపొస్తలులుగాని మాదిరిగా లేరు. వెంబడించుటకు అతనికి ఎవరు లేరు. మనకున్నట్లుగా అతనికి పరిశుద్ధాత్మశక్తి లేదు. మనకున్నట్లుగా అతనికి బైబులు లేదు. అతనికి ఇతర విశ్వాసులనుండి సహాయముగాని లేక ప్రోత్సాహముగాని లేక భార్య ప్రోత్సాహముకూడా లేదు. యోబుకు దేవుడు మాత్రమే ఉన్నాడు మరియు అతనికి దేవుడు చాలును. యోబు ఎంతో మహిమకరమైన జీవితమును కలిగియుండగా, మనమెందుకు కలిగియుండకూడదు?