వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట పురుషులు
WFTW Body: 

1. లోకములో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము "మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము"(లూకా 16:15).

లోకములో ఘనముగా ఎంచబడే విషయాలు దేవుని దృష్టిలో విలువలేనివి మాత్రమే కాదు, నిజానికి అవి ఆయనకు అసహ్యము. లోకఘనత అంతయు దేవునికి అసహ్యమే.

ధనమును భూమిమీద ప్రతిఒక్కరు విలువైనదిగా ఎంచుతారు. కాని ఎవరైతే సిరిని(ధనమును) ప్రేమించి మరియు ఎల్లప్పుడు ధనవంతులు కావాలని కోరుతారో వారు ఈ క్రింద ఉన్న 8 పర్యవసానములు ఫలితముగా పొందుతారని దేవుడు చెప్పుచున్నాడు (1 తిమోతి 6:9,10). వారు 1. శోధనలో పడతారు 2. ఉరిలో పడతారు 3. అవివేక యుక్తములలో పడతారు 4. హానికరమైన అనేక దురాశలలో పడతారు 5. నష్టపోతారు 6. నాశనము జరుగుతుంది 7. విశ్వాసము నుండి తొలగిపోతారు 8. నానా బాధలతో తమ్మునుతామే పొడుచుకుంటారు.

ప్రతిచోట విశ్వాసులలో ఈ విధంగా జరుగుటను నేను చూచాను.

మన దేశములో ఎక్కువగా ప్రవచనవాక్యము వినలేకపోవుటకు ఒక ముఖ్యకారణము బోధకులు ధనాపేక్షులుగా ఉన్నారు. సిరి విషయంలో అపనమ్మకస్థులుగా ఉన్నవారికి నిజమైన ధనము (అందులో ప్రవచనవాక్యము ఒకటి)ను దేవుడు ఇవ్వడని ప్రభువైనయేసు చెప్పారు (లూకా 16:11). అందుకే మన సంఘకూటాలలోను, బహిరంగ సభలలోను అనేక విసుగుకలిగించే బోధలు వింటున్నాము.

2. మనకు మనమే హాని చేసుకొనవచ్చును గాని ఇతరులు హాని చెయ్యలేరు

మీరు మంచివిషయములో ఆసక్తిగలవారైతే మీకు హాని చేయువాడెవడు? (1 పేతురు 3:13).

దేవునిసంకల్పము చొప్పున పిలువబడినవారికి మరియు ఆయనను ప్రేమించువారికి అనగా వారి జీవితములలో దేవునిచిత్తము మాత్రమే జరగాలని కోరే వారికి సమస్తమును సమకూర్చి వారి మేలుకొరకే జరిగించగల సర్వశక్తిగల దేవుడైయున్నాడు (రోమా 8:28).ఎవరైతే తమకొరకే తాము జీవిస్తారో వారు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేరు. కాని మనము దేవునిచిత్తాన్ని(దయాసంకల్పాన్ని) పూర్తిగా అంగీకరిస్తే, ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం ప్రతిక్షణం ఈ వాగ్దానాన్ని అనుభవించవచ్చును. ఈ విశ్వంలో ఏదీయు మనకు హాని చెయ్యదు.

ఇతరులు మనకు చేసే మేలుగాని, కీడుగాని లేక అనుకోకుండా చేసినను, కావాలని చేసినను సమస్తమును రోమా 8:28లో గుండా వెళ్ళి, క్రీస్తు సారూప్యము మనలో అంతకంతకు, కొంచెం కొంచెం ఏర్పడునట్లు చేయును(రోమా 8:29). దేవుడు మనకు చేయాలనుకొనుచున్న అతిశ్రేష్టమైన మేలు ఇదియే. ఈ వచనములో ఉన్న షరతులు నెరవేర్చువారికి ప్రతిసారి పరిపూర్ణముగా వారి మేలుకే జరుగుతుంది.

మనం "మంచి విషయములో ఆసక్తిగలిగియుంటే" మనకెవ్వరు హాని చెయ్యలేరని 1 పేతురు 3:13లో చెప్పబడింది. అయితే ఈ వాక్యము రోమా 8:28 వలే ప్రసిద్ధి పొందలేదు. కాని మనం దీని గురించి ఎక్కువగా మాట్లాడాలి. ఇతరుల విషయములో తమ హృదయములను సరిగా ఉంచుకొనువారికి మాత్రమే ఈ వాగ్దానం నేరవేరుతుంది. అటువంటి విశ్వాసికి దయ్యమైనను లేక ఏ మనుష్యుడైనను హాని చెయ్యలేరు.

ఇతర క్రైస్తవుల గురించి ఎవరైనను ఫిర్యాదు చేసినట్లయితే, వారు తాము దేవుని ప్రేమించుటలేదనియు, దేవునిసంకల్పము చొప్పునవారు పిలువబడలేదనియు మరియు మంచివిషయములో వారికి ఆసక్తిలేదనియు ఒప్పుకొనుచున్నట్లుగా ఉంటుంది. వారు చేసినదంతయు తన మేలుకే సమకూడి జరుగుచున్నట్లయితే అతడు ఫిర్యాదు చెయ్యనే చెయ్యడు.

నిజానికి నీ అపనమ్మకత్వాన్ని బట్టి మరియు ఇతరుల విషయంలో సరియైన వైఖరి లేకపోవుట వలన నీవు మాత్రమే నీకు హాని చేసుకొనగలవు.

ఇప్పుడు నాకు 76 సంవత్సరములు. నా జీవితమంతటిలో నాకు ఎవ్వరును హాని చెయ్యలేదని యధార్దముగా చెప్పగలను. చాలామంది చేయాలనుకున్నారు గాని సమస్తమును నాకును మరియు నా పరిచర్యకును మేలు కలుగటకే జరిగింది.

కాబట్టి నేను వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తాను. నన్ను వ్యతిరేకించే "విశ్వాసులని" పిలువబడే వారికి దేవుని మార్గములు తెలియవు. నా సాక్ష్యమును ఎందుకు చెప్పుచున్నానంటే ఇది ఎల్లప్పుడు నీ సాక్ష్యము కూడా అయి ఉండాలని కోరుచున్నాను.