వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   పునాది సత్యము శిష్యులు
WFTW Body: 

"ఆయన యందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే నడుచుకొనబద్ధుడైయున్నాడు" 1 యోహాను 2 : 6 .

ప్రభువైనయేసు ఏలాగు నడుచుకున్నారు(జీవించారు)? ఆయన కొంతకాలము మాత్రమే జయజీవితము జీవించారా? లేక ఎక్కువ కాలమా లేక ఎల్లప్పుడు జయజీవితము జీవించారా? జవాబు మనకు తెలియును. ఆయన అన్ని విషయములలో మనవలెనే శోధించబడినను ఒక్క పాపము కూడా చేయలేదు.

"మన ప్రధానయాజకుడు మన బలహీనలతలయందు మనతో సహానుభవములేనివాడు కాదు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధించబడియు, ఆయన పాపము లేనివాడుగా ఉండెను" (హెబ్రీ 4 : 15 ).

ఇప్పుడు మనము ఆయన ఏలాగు నడిచెనో మనమును ఆలాగే నడుచుకొనవలెనని చెప్పబడుచున్నాము. ఈలోకములో ఆలాగు జీవించుట సాధ్యమేనా? మనము ఎట్టి పరిస్థితులలోను (ఎన్నటెన్నటికీ) చేయలేని దానిని చెయ్యమని దేవుడు మనకు చెబుతాడా? అలాగు చెప్పడు. దానిని మనము ఊహించుట కూడా అసాధ్యము. భూలోక సంబంధమైన తండ్రులు కూడా అటువంటి అసాధ్యమైన వాటిని చేయమని చెప్పరు. అటువంటప్పుడు దేవుడు ఆలాగు చేయమని అసలే చెప్పడు.

క్రొత్తనిబంధనలో చాలా బాధాకరమైన మాటలు మత్తయి 13 : 58 లో చూచెదము- "వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు".

అలాగే మార్కు 6 : 5 లో కూడా ఉన్నది, "ఆయన అక్కడ ఏ అద్భుతమును చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను".

ఆయన స్వంతపట్టణములో ఉన్న ప్రజలకొరకు అనేక అద్భుతములను చేయకోరెను. కాని వారి అవిశ్వాసము ఆయనను పరిమితి చేసింది. దేవుడు మనకొరకు చేయాలని కోరిన వాటిని ఆయన చేయలేకుండునట్లు మన అవిశ్వాసము సర్వశక్తిగల దేవుని చేతులు బంధించును.

దేవుడు నీకొరకు చేయాలని కోరిన అనేక అద్భుతములు నీ అవిశ్వాసమును బట్టి చేయలేదేమోనని నేను తలంచుచున్నాను. క్రీస్తు న్యాయపీఠము ఎదుట, మనలో ఎవరైనను ఈ మాటలు వినవలసివచ్చునేమో, "నీ అవిశ్వాసమును బట్టి నీలోను మరియు నీద్వారాను నేను చేయదలచుకున్నదంతయు చేయలేకపోయాను". మన జీవితము ముగించిన తరువాత ఈలాగున వింటే మన హృదయములు ఎంతనొచ్చుకొనునో గదా! దానిగురించి ఇప్పుడే ఆలోచించుట మంచిది.

జయజీవితము (పాపము మీద)లో ప్రవేశించుటకు కూడా అదే నియమము పని చేస్తుంది. మనము ఉపవాసము ఉండవచ్చును లేక దాహాము కలిగి ప్రార్ధించవచ్చును అయినప్పటికీ పొందకపోవచ్చును. అయితే దేవుడు మనలను తన పరిశుద్ధజీవముతో నింపి, దేవుడు కానిదానంతటి నుండి మనలను విడిపించి మరియు జయజీవితములోనికి నడిపించగలడు అని మనము విశ్వసించినట్లయితే అది జరుగును.

కేవలము విశ్వాసము ద్వారా తప్ప దేవునిలో నుండి మరి ఏవిధముచేతనైనను ఏదియు పొందలేమని సాతానుకు తెలియును. కాబట్టి సాతాను నీ హృదయమును ఎంత అవిశ్వాసముతో నింపుతాడో నీవు ఊహించుకొనవచ్చును. అబద్దములు లేక వ్యభిచారము సులభముగా గుర్తించగలిగిన పాపములు గాని అవిశ్వాసము సులభముగా గుర్తించలేము కాబట్టి ఇదిఎంతో అపాయకరము.

"సహోదరులారా! జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి" (హెబ్రీ 3 : 12 ).

విశ్వాసములేని దుష్టహృదయము మనలను జీవముగల దేవుని విడిచిపెట్టునట్లు (ఆయనమీద ఆధారపడకుండునట్లు) చేయును. సమస్త పాపములకు మూలము అవిశ్వాసము. "మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారుకారు గనుక పాపము మీమీద ప్రభుత్వము చేయదు" (రోమా 6 : 14 ).

మనము దేవుని కృపలో ఉంటే, పాపము ప్రభుత్వము చేయదని పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు. చిన్న పిల్లలు కూడా అర్ధము చేసుకొనునట్లుగా చెప్పబడింది. అయినప్పటికీ చాలామంది విశ్వాసులు అటువంటి జయజీవితములో ప్రవేశించుట సాధ్యమేనని నమ్ముటలేదు.

నీవు జయజీవితము జీవించాలని దేవుడు కోరుచున్నాడు. నీ ఆలోచనా జీవితము ఎంత భ్రష్టుపట్టినప్పటికీ లేక ఎంతో కాలమునుండి నీవు కోపము విషయములో ఓడిపోయినప్పటికీ జయజీవితము సాధ్యమే. దేవుడు నీకు పవిత్ర(నూతన)హృదయమును ఇచ్చి నిన్ను సంపూర్ణముగా విమోచించగలడు కాని దేవుడు దానిని నీ జీవితములో చేయగలడని నీవు విశ్వసించనంతవరకు ఆయన ఏమియు చేయలేడు.

మనము మన హృదయములో విశ్వసించి మరియు మన నోటితో ఒప్పుకోవాలని బైబిలు చెప్పుచున్నది.

"ఏలయనగా నీతికలుగునట్లు మనష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును" (రోమా 10 : 10 ).

ఇది చాలా ముఖ్యమైన నియమము- మననోటితో ఒప్పుకొనుట ద్వారా మన విశ్వాసమును వ్యక్తపరిచెదము. ఆవిధముగా నోటితో ఒప్పుకొనే కొలది మనము పాపము యొక్క శక్తినుండి విడుదల పొందెదము.

"సాతానుతో కూడా మన సాక్ష్యము చెప్పాలి, "దేవుడు నన్ను పాపము నుండి విడిపించి, జయజీవితములోనికి నడిపిస్తాడని నేను నమ్ముచున్నాను". ఆవిధముగా మనము సాతానును జయించగలము.

"వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించియున్నారుగాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించినవారు కారు" (ప్రకటన 12 : 11 ).

నీవు ఓడిపోయినప్పుడల్లా, నీవు జయము పొందేవరకు నీ నోటితో ఒప్పుకొంటూ ఉండుము. అది వెంటనే జరుగనియెడల నిరాశపడవద్దు. నీవు నోటితో ఒప్పుకుంటూ ఉంటే, దేవుడు నిన్ను ఘనపరచును.